ప్రైవేట్ అప్పులు తీర్చేందుకు అదనపు రుణాలు
వరంగల్ లీగల్ : రైతుల ప్రైవేట్ అప్పులు తీర్చుకోవడానికి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం బ్యాంకుల నుంచి పంట రుణాలకు అదనంగా దీర్ఘకాలిక రుణాలు పొందేందుకు రైతులు దరఖాస్తులు చేసుకోవాలని హనుమకొండ, వరంగల్ జిల్లాల న్యాయసేవాధికార సంస్థల కార్యదర్శులు జడ్జి క్షమాదేశ్ పాండే, ఎం.సాయికుమార్ సూచించారు. శుక్రవారం తెలంగాణ రైతు రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు పాకాల శ్రీహరిరావు అధ్యక్షతన జిల్లా కోర్టు ఆవరణలో బ్యాంకర్లు, రెవెన్యూ అధికారులు, వ్యవసాయాధికారులు, రైతులతో హనుమకొండ, వరంగల్ న్యాయసేవాధికారి కార్యదర్శులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీహరిరావు మాట్లాడుతూ.. జిల్లా న్యాయసేవాధికార సంస్థల కార్యదర్శుల సూచన మేరకు అర్హులైన రైతులందరికీ ప్రైవేట్ అప్పులు తీర్చుకోవడానికి అదనపు రుణాలు మంజూరు చేసేందుకు బ్యాంకర్లు ఒప్పుకున్నట్లు తెలిపారు. సమావేశంలో తెలంగాణ రైతు రక్షణ సమితి ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కిషన్‌రావు, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు హింగే భాస్కర్, తిరుపతి, రాజు, బాపురావు, సీఐఎస్‌ఎఫ్ కోఆర్డినేటర్ తోకల్ ఆదిరెడ్డి, లీడ్ బ్యాంక్ మేనేజర్ శ్రీనివాస్, జిల్లా వ్యవసాయాధికారి రవికుమార్, బ్యాంకర్లు, వ్యవసాధికారులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.