
గోదావరికి పౌర్ణమి హారతి
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరం త్రివేణి సంగమ గోదావరికి పౌర్ణమి సందర్భంగా హారతి కార్యక్రమాన్ని దేవస్థానం ప్రధాన అర్చకుడు త్రిపురారి కృష్ణమూర్తిశర్మ, ఉప ప్రధాన అర్చకుడు ఫణీంద్రశర్మల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. శనివారం సాయంత్రం శ్రీకాళేశ్వరముక్తీశ్వరస్వామి ఆలయం నుంచి అర్చకులు, అధికారులు, సిబ్బంది మంగళవాయిద్యాలు, వేదపండితుల మంత్రోచ్ఛరణలతో కాలినడకన గోదావరికి తరలివచ్చారు. అక్కడ గోదావరి మాతకు ప్రత్యేక పూజలు చేశారు. గోదావరికి పాలు, పసుపు, కుంకుమ, పూలతోపాటు సారె సమర్పించారు. అనంతరం అర్చకులు మూడు హారతులతో హారతి కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ బి.శ్రీనివాస్, జూనియర్ అసిస్టెంట్ డి.శ్రీనివాస్, స్వచ్ఛంద సేవాసమితి సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.