తూర్పు గోదావరి: అతి వేగం కారణంగా ఏడేళ్ల బాలుడు అసువులు బాశాడు. అప్పటి వరకు ఇంట్లో సందడి చేసిన తమ బిడ్డ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆ కుటుంబం రోదన వర్ణనాతీతంగా మారింది. ఆర్టీసీ డ్రైవర్ అతి వేగంగా వచ్చి టిఫిన్ కోసం బైక్‌పై వెళుతున్న తండ్రి కొడుకులను ఢీకొట్టడంతో స్థానిక ప్రైవేట్ స్కూల్‌లో రెండో తరగతి చుదువుతున్న గుంజే ఈశ్వర్‌దుర్గ (7) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కళ్లెదుటే అల్లారుముద్దుగా పెంచుకుంటున్న ఏకై క కుమారుడు మృతి చెందడంతో తండ్రి బోయేసు రోదన అక్కడ ఉన్నవారిని కంట తడి పెట్టించింది. వివరాలు ఇలా ఉన్నాయి..
స్థానిక వడ్డెర కాలనీకి చెందిన గుంజే బోయేసు కూలి పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. బోయేసుకు కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సోమవారం ఉదయం వడ్డెర కాలనీ సమీపంలోని హోటల్ నుంచి టిఫిన్ తీసుకువచ్చేందుకు బైక్‌పై కుమారుడు ఈశ్వర్ దుర్గతో కలిసి రోడ్డుపైకి వచ్చాడు. వెనుక నుంచి ఆర్టీసీ బస్సు అతి వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో బోయేసు రోడ్డు అవతల పక్క పడగా బాలుడు ఈశ్వర్ దుర్గ టైర్ కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో కోపోద్రిక్తులైన స్థానికులు ఆర్టీసీ డ్రైవర్‌కు దేహశుద్ధి చేశారు. అనంతరం బస్సును ధ్వంసం చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ స్థానికులు ఆందోళనకు దిగారు. తీవ్రగాయాలైన ఆర్టీసీ డ్రైవర్‌ను పోలీసులు భారీ బందోబస్తు నడుమ 108వాహనంలో అక్కడి నుంచి తరలించారు.
డ్రైవర్ తరలింపునకు కూడా స్థానికులు అడ్డు తగిలారు. 108 వాహనం అద్దాలను ధ్వంసం చేశారు. న్యాయం జరిగే వారకు బాలుడి మృతదేహాన్ని తరలించడానికి వీలు లేదని స్థానికులు ఆందోళన చేపట్టారు. రోడ్డుపైనే టెంట్ వేసుకొని ఆందోళనకు దిగారు. దీంతో పలుసార్లు పోలీస్, రెవెన్యూ, ఆర్టీసీ అధికారులు స్థానికులతో చర్చించారు. అయినప్పటికీ స్థానికులు శాంతించలేదు. విషయం తెలుసుకున్న రాజమహేంద్రవరం ఎంపీ, వైఎస్సార్ సీపీ చీఫ్ విప్ మార్గాని భరత్‌రామ్, వైఎస్సార్ సీపీ రాజమహేంద్రవరం రూరల్ కో–ఆర్డినేటర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పచ్చదనం, సుందరీకరణ కార్పొరేషన్ చైర్మన్ చందన నాగేశ్వర్ ,మాజీ డిప్యూటీ మేయర్ బాక్స్ ప్రసాద్ బాధితులతో చర్చలు జరిపారు.
బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని ప్రభుత్వ పరంగా సాయం అందిస్తామని ఎంపీ భరత్‌రామ్, కో–ఆర్డినేటర్‌నాగేశ్వర్ హామీ ఇచ్చారు. బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు. దీంతో స్థానికులు ఆందోళన విరమించారు. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎంపీ మార్గాని భరత్‌రామ్ కార్యాలయంలో బాధిత కుటుంబానికి రూరల్ కో–ఆర్డినేటర్ చందన నాగేశ్వర్ చేతుల మీదుగా రూ.10 లక్షల చెక్కును అందజేశారు.
మధ్యాహ్నం వరకు తీవ్ర ఉద్రిక్తత
బాలుడి మృతితో ధవళేశ్వరం ప్రధాన రహదారిపై తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ప్రధాన రహదారిపై స్థానికులు ఆందోళన చేపట్టడంతో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. రాజమహేంద్రవరం నుంచి వచ్చే ట్రాఫిక్‌ను ఐఎల్‌టీడీ నుంచి బొమ్మూరు వైపునకు, ధవళేశ్వరం వైపు వచ్చే ట్రాఫిక్‌ను వేమగిరి నుంచి బొమ్మూరు వైపు మళ్ళించారు. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఘటనా స్థలాన్ని సందర్శించి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. లా అండ్ ఆర్డర్ అడిషనల్ ఎస్పీ రజనీ, రాజమహేంద్రవరం సౌత్ జోన్ డీఎస్పీ శ్రీనివాసులు, ధవళేశ్వరం సీఐ కె.మంగాదేవి, కడియం సీఐ తిలక్ ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment