ఖాదర్ మృతితో జార్జిపేటలోని అతడి ఇంటి వద్ద విషాద ఛాయలు
కాకినాడ: అతి వేగం ఒకరి ప్రాణం తీసింది. మరో ముగ్గురిని క్షతగాత్రుల్ని చేసింది. యానాం బైపాస్‌లో గణపతి నగర్ వంతెన వద్ద 216 జాతీయ రహదారిపై శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందాడు. మరో ముగ్గురు గాయపడ్డారు. కోరంగి ఎస్సై పి.శ్రీనివాస కుమార్, మృతుని కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మండలంలోని జార్జిపేట గ్రామ పంచాయతీకి చెందిన షేక్ ఖాదర్, షేక్ అబ్దుల్లా, షేక్ బషీర్ అన్నదమ్ములు. వీరు నీలపల్లి చెక్‌పోస్టు వద్ద కోళ్ల దుకాణంలో పని చేస్తున్నారు. శుక్రవారం రాత్రి కోళ్ల వ్యాను వచ్చిందనే సమాచారంతో కోళ్లను తెచ్చుకునేందుకు ఖాదర్, బషీర్ బైక్‌పై సుంకరపాలెం జంక్షన్‌కు వెళ్లారు. తిరిగి వస్తూండగా వీరి బైక్, అదే మార్గంలో వస్తున్న మరో బైక్ ఢీకొన్నాయి.
దీంతో రెండు మోటార్ సైకిళ్లూ అదుపు తప్పాయి. ఈ ప్రమాదంలో షేక్ ఖాదర్ రోడ్డు పక్కన ఉన్న రెయిలింగ్‌ను ఢీకొన్నాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో అతడిని హుటాహుటిన స్థానికులు యానాం ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ప్రమాదంలో ఖాదర్ తమ్ముడు బషీర్‌తో పాటు మరో బైక్‌పై వెళ్తున్న యానాంకు చెందిన కర్రి రాజు, కోరంగి పంచాయతీ సీతారామపురం గ్రామానికి చెందిన గుబ్బల కాళీ ప్రసాద్ గాయపడ్డారు. వారు యానాం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని చెబుతున్నారు. కోరంగి పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
20 ఏళ్ల క్రితం తండ్రి.. నేడు కొడుకు
రోడ్డు ప్రమాదాలు ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపాయి. ఈ ప్రమాదంలో మృతి చెందిన ఖాదర్, అతడి సోదరుడు అబ్దుల్లా కవలలు. జార్జిపేట గ్రామానికి చెందిన హాసియా, బాషా దంపతులకు 20 ఏళ్ల క్రితం కవలలు ఖాదర్, అబ్దుల్లా జన్మించారు. అనంతరం ఆ దంపతులకు మూడో సంతానంగా బషీర్ పుట్టే సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బాషా దుర్మరణం పాలయ్యాడు.
తిరిగి మళ్లీ రోడ్డు ప్రమాదంలోనే కవల కొడుకుల్లో ఒకడైన ఖాదర్ మృతి చెందడం ఆ కుటుంబ సభ్యులను తీవ్రంగా కలచివేస్తోంది. తనతో పాటే పుట్టి, తోడుగా పెరిగిన ఖాదర్ మృతితో అబ్దుల్లాతో పాటు అతడి కుటుంబ సభ్యులు కంటికి కడివెడుగా రోదిస్తున్నారు. రోడ్డు ప్రమాదాల్లో కొడుకు, మనవడిని కోల్పోయానని ఖాదర్ నానమ్మ అజ్మా బోరున విలపించింది. వారం రోజుల కిందటే కొత్త మోటార్ సైకిల్ కొన్నామని, దానిపై ఎంతో ఆనందంగా తిరుగుతున్న మనవడు ఖాదర్.. ప్రమాదానికి గురై ఇలా మృతి చెందుతాడనుకోలేదని కన్నీటిపర్యంతమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment