వదినకు ఏం చెప్పాలి అన్నయ్యా!  | - | Sakshi
Sakshi News home page

వదినకు ఏం చెప్పాలి అన్నయ్యా! 

Published Tue, Mar 5 2024 11:25 PM | Last Updated on Wed, Mar 6 2024 10:51 AM

- - Sakshi

రాజమహేంద్రవరం రూరల్‌: మోరంపూడి జంక్షన్‌లో వేగంగా దూసుకువచ్చిన టిప్పర్‌ ఢీకొని ఐసీఐసీఐ బ్యాంకు ఉద్యోగి దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కె.గంగవరం మండలం కూళ్ల గ్రామానికి చెందిన దాసి జేమ్స్‌బాబు (27) ప్రస్తుతం రామచంద్రపురం మండలం ఉండూరు గ్రామంలోని అమ్మమ్మ ఇంటి వద్ద భార్య మేరీ గ్రేస్‌తో ఉంటున్నాడు. రాజమహేంద్రవరం టి.నగర్‌లోని ఐసీఐసీఐ బ్యాంకు కమర్షియల్‌ వెహికల్స్‌ లోన్స్‌ విభాగంలో రిలేషన్‌షిప్‌ మేనేజర్‌గా పని చేస్తున్నాడు.

మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో బైక్‌పై నామవరం వైపు నుంచి మోరంపూడి జంక్షన్‌కు చేరుకున్నాడు. అక్కడి నుంచి వేమగిరి వైపు తిరుగుతూండగా వెనుక నుంచి వేగంగా దూసుకువచ్చిన టిప్పర్‌ అతడిని ఢీకొంది. ఈ ప్రమాదంలో కింద పడిపోవడంతో తలకు బలమైన గాయమై, జేమ్స్‌బాబు అక్కడికక్కడే మృతి చెందాడు. బొమ్మూరు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఐడెంటిటీ కార్డు ఆధారంగా మృతుడిని గుర్తించారు. బ్యాంకుకు సమాచారం అందించారు. దీంతో, బ్యాంకు సిబ్బంది ఈ విషయాన్ని జేమ్స్‌బాబు కుటుంబ సభ్యులకు తెలియజేశారు. వెంటనే అతడి సోదరుడు సురేష్‌ రాజమహేంద్రవరం చేరుకున్నాడు. జేమ్స్‌బాబు మృతదేహాన్ని పోలీసులు రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడి సోదరుడు సురేష్‌ ఫిర్యాదు మేరకు బొమ్మూరు ఇన్‌స్పెక్టర్‌ ఉమర్‌ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. 

వదినకు ఏం చెప్పాలి అన్నయ్యా! 
ఈ ప్రమాదంలో జేమ్స్‌బాబు మృతి చెందడంతో అతడి సోదరుడు సురేష్‌ కన్నీటి పర్యంతమయ్యాడు. ప్రస్తుతం ఐదో నెల గర్భిణి అయిన వదినకు ఏం చెప్పాలి అన్నయ్యా! అంటూ అతడు రోదించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. అందరితో కలివిడిగా ఉండే జేమ్స్‌బాబు ఊహించని విధంగా జరిగిన ప్రమాదంలో మృతి చెందడాన్ని ఐసీఐసీఐ బ్యాంకు ఉద్యోగులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఉద్యోగ నిర్వహణలో బయటకు వెళ్లిన వ్యక్తి, తిరిగి వస్తాడనుకున్న సమయంలో మృతి చెందాడనే విషయం తెలిసి, ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement