కాకినాడ రూరల్: వైద్యురాలిగా బంగారు భవిష్యత్తు ఉన్న ఆ యువతి అర్ధాంతరంగా తనువు చాలించింది. చదువుల్లో ముందంజలో ఉండే ఆ బంగారు తల్లికి ఏమి కష్టం వచ్చిందో నేమాం బీచ్‌లో ఇసుక తిన్నెల్లో విగత జీవిగా కనిపించింది. తిమ్మాపురం పోలీసులు తెలిపిన ప్రకారం.. కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ ఫైనల్ ఈయర్ వైద్య విద్యను అభ్యసిస్తున్న మెడికో వంకదారి శ్వేత (25) మృతదేహం నేమాం బీచ్‌లో బుధవారం సాయంత్రం లభ్యమైంది. స్థానికుల సమాచారంతో అక్కడకు చేరుకున్న తిమ్మాపురం పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి, కాకినాడ ప్రభుత్వాస్పత్రికి పీఎం నిమిత్తం తరలించారు.
కాకినాడ రంగయ్యనాయుడు వీధి సాయిబాబా గుడి సమీపంలో శ్వేత కుటుంబం నివసిస్తోంది. శ్వేత నీట్‌లో జనరల్ కేటగిరిలో 714 ర్యాంక్ సాధించి రంగరాయ మెడికల్ కళాశాలలో 2018 –19లో ఎంబీబీఎస్‌లో చేరింది. గురువారంతో పరీక్షలు ముగియనున్నాయి. ప్రాక్టికల్ ఎగ్జామ్ కోసం తండ్రి కుభేరరావు బుధవారం ఉదయం 8.45 గంటలకు ఆమెను కాకినాడ ప్రభుత్వాస్పత్రి వద్ద దింపాడు. తండ్రి వెళ్లిన పది నిమిషాలు తరువాత పరీక్ష హాలులోకి వెళ్లకుండా శ్వేత బయటకు వెళ్లిపోయింది. బీచ్‌లో మృత దేహం లభ్యమవ్వడంతో తల్లి ఆశాజ్యోతి, తండ్రి కుభేరరావు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. శ్వేత సోదరుడు హైదరాబాద్‌లో పీహెచ్‌డీ చేస్తున్నాడు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు తిమ్మాపురం ఎస్సై షేక్ షరీఫ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment