తాళ్లరేవు: పుట్టినరోజు వేడుకను జరుపుకుందామని పశ్చిమగోదావరి జిల్లా తణుకు నుంచి కేంద్రపాలిత ప్రాంతమైన యానాంకు వచ్చిన యువకుల విహారయాత్ర విషాదాంతమైంది. గోపులంక వద్ద గోదావరిలో గల్లంతైన పశ్చిమ గోదావరి జిల్లా తణుకుకు చెందిన హనుమకొండ కార్తీక్, ముద్ధన ఫణీంద్ర గణేష్, పెండ్యాల బాలాజీ, తిరుమల రవితేజ మృతదేహాలు ఆదివారం లభ్యమయ్యాయి. తణుకు సజ్జాపురంలోని ఒకే వీధికి చెందిన ఏడుగురు యువకులు శనివారం బర్త్‌డే పార్టీకి యానాం వచ్చి తిరిగి వెళుతూ గోపులంక వద్ద స్నానానికి దిగి గల్లంతైన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో తహసీల్దార్ ఎస్.పోతురాజు, కాకినాడ రూరల్ సీఐ పి.శ్రీనివాస్‌ల ఆధ్వర్యంలో గాలింపు చర్యలు ముమ్మరంగా చేపట్టారు. శనివారం రాత్రి 10 గంటల వరకు కొనసాగించిన గాలింపు చర్యలు, తిరిగి ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటలకు ప్రారంభించారు. కాకినాడ, జగన్నాథపురం అగ్నిమాపక శాఖలకు చెందిన సుమారు 10 మంది సిబ్బందితోపాటు, 21 మంది ఏపీఎస్‌డీఆర్‌ఎఫ్ బృందం శ్రమించి మృతదేహాలను బయటకు తీశారు. యువకులు స్నానానికి దిగిన ప్రాంతానికి సమీపంలోనే మృతదేహాలు లభ్యమయ్యాయి.
స్థానిక మత్స్యకారులు కట్టిన వలలకు గణేష్, బాలాజీ మృతదేహాలు చిక్కుకోగా మిగిలిన రెండు మృతదేహాలను సుమారు మూడు గంటలపాటు శ్రమించి బయటకు తీశారు. ఆయా మృతదేహాలను పోస్టుమార్టమ్ కోసం కాకినాడ ప్రభుత్వాసుత్రికి తరలించారు. మృతుల బంధువుల రోదనలతో గోపులంక ప్రాంతంలో విషాదం నెలకొంది. చేతికి అందివచ్చే సమయంలో యువకులు మృత్యువాత పడడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
మానవత్వం చాటిన సీఐ శ్రీనివాస్
నదిలో గల్లంతైన యువకుల మృతదేహాలను వెలికితీసేందుకు ఎంతగానో శ్రమించిన స్థాని క మత్స్యకారులకు కాకి నాడ రూరల్ సీఐ పి.శ్రీనివాస్ రూ.5వేల నగదు ఇచ్చి మానవత్వాన్ని చాటారు. యువకులు గల్లంతైనప్పటి నుంచి మత్స్యకారులు వెన్నంటే ఉండి గాలింపు చర్యలు చేపట్టడంతోపాటు మృతదేహాలను వెలికితీయడంలో సిబ్బందికి సహకరించారని సీఐ అభినందించారు.
కన్నవాళ్లను కన్నీళ్లలో వదలి..
నాలుగు కుటుంబాలకు కొడుకులు దూరం
కాకినాడ క్రైం: తమ కడవరకు తోడుండి వృద్ధాప్యంలో కంటికి రెప్పలా కాచుకుంటాడనుకున్న ఒక్కగానొక్క కొడుకు ప్రాణాలు గంగపాలై మృత్యు ఒడికి చేరితే కన్నీళ్లే దిక్కయ్యాయి ఆ తల్లిదండ్రులకి. పున్నామ నరకం నుంచి తప్పిస్తాడనుకున్నారే గానీ రెండు పదుల ప్రాయం దాటిన రెండేళ్లకే నూరేళ్లు నిండిపోతాయని కల్లోనైనా ఊహించలేదు వాళ్లు. తాళ్లరేవు మండలం గోపులంక పుష్కర్‌ఘాట్ గౌతమి గోదావరి తీరం విషాదాంతాన్ని లిఖించింది. బంగారు భవిత కోసం కొండంత ఆశతో ఇప్పుడిప్పుడే తమ జీవితాలను ప్రారంభిస్తున్న నలుగురు యువకుల ఆయువులు తనలో కలిపేసుకొని ఆ నాలుగు కుటుంబాల్లో పెను విషాదాన్ని మిగిల్చింది.
స్వస్థలాలకు మృతదేహాలు
కాకినాడ జీజీహెచ్‌లో ఆదివారం మధ్యాహ్నం 4 గంటలకు పోస్టుమార్టం ప్రక్రియ పూర్తి చేసి కుటుంబ సభ్యులకు మృతదేహాలను అప్పగించారు. తాళ్లరేవు, తణుకు ఎంఆర్‌వోలు మార్చురీ వద్ద ఉండీ పోస్టుమార్టం ప్రక్రియను పర్యవేక్షించి స్వగ్రామాలకు తరలించేందుకు చర్యలు తీసుకున్నారు. నలుగురి యువకుల మృతదేహాలను రెండు మహాప్రస్థానం వాహనాల్లో స్వస్థలాలకు చేర్చారు.
‘అమ్మా.. నిన్ను చక్కగా చూసుకుంటాననేవాడు’
తణుకు మండలం సజ్జాపురం గ్రామంలో తల్లితో కలిసి నివసిస్తున్న పెండ్యాల బాలాజీ (21) ఏకై క కుమారుడు. తండ్రి నాలుగేళ్ల క్రితం గుండెపోటుతో చనిపోతే ఇంటి బాధ్యతలు తల్లి వెంకటలక్ష్మి తీసుకున్నారు. స్థానిక పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్నారు. బాలాజీ చదువులో చురుకై నవాడు స్థానిక ఇంజినీరింగ్ కళాశాలలో మూడవ సంవత్సరం ట్రిపుల్ ఈ చదువుతున్నాడు. తన అక్క భావనలా మంచి ఉద్యోగం సంపాదిస్తానని తల్లికి చెప్పేవాడు. క్యాంపస్ సెలెక్షన్స్‌లో ఉద్యోగం తప్పకుండా సాధిస్తానని భరోసా ఇచ్చేవాడు. తనకు ఉద్యోగం వస్తే నిన్ను ఇంట్లో పెట్టి చక్కగా చూసుకుంటానని తన తల్లితో అనేవాడని బాలాజీ మేనమామ బోయపాటి వెంకట సత్యనారాయణ కన్నీటి పర్యంతమవుతూ చెప్పారు.
సొమ్మసిల్లిన కన్నతల్లి
కొడుకు చనిపోయాడన్న విషయం పోస్టుమార్టం పూర్తయ్యేవరకు ఆ తల్లికి తెలియకుండా దాచే ప్రయత్నం చేశారు కుటుంబ సభ్యులు. నీటిలో పడిపోయాడు అని తెలిసిన వెంటనే మృతుడు తిరుమల రవితేజ(20) తల్లి దేవి ఫిట్స్‌కు గురై ప్రమాదకర స్థితికి చేరుకున్నారు. దీంతో వైద్యులు మత్తు ఇచ్చి ఆమెను శాంతింపజేశారు. ఆదివారం సాయంత్రం కుమారుడి మృతదేహం ఇంటికి చేరే కొద్ది సమయానికి ముందు మత్తులో నుంచి మేల్కొని కొడుకు బాగోగుల కోసం ఆరా తీయగా లేడన్న చేదు నిజాన్ని బంధువులు ఆమెకు చెప్పారు. అంతే.. గుండెలు బాదుకొని దేవి పడిపడి ఏడ్చింది. ఆమెను సముదాయించడం ఎవరి వల్లా కాలేదు. ఆమె వేదనను చూసిన వారి కళ్లు చమర్చాయి. రవితేజకు యానిమేషన్ రంగం అంటే ప్రాణం అని హైదరాబాద్ వెళ్లి అదే రంగంలో ఉద్యోగం పొంది అక్కడే స్థిరపడతానని అనేవాడని చెబుతూ బంధువులు విలపించారు. రవితేజ స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లాలోని పైడిపర్రు గ్రామం. డిగ్రీ పూర్తి చేశాడు. తణుకు రైల్వేస్టేషన్ సమీపంలో నివసిస్తున్నాడు.
అయ్యప్పా... ఏంటీ ఘోరం...
తణుకు మండలం సజ్జాపురం గ్రామానికి చెందిన అనుమకొండ విజయ్‌కుమార్ దంపతులకు సాయి కార్తీక్(20) ఒక్కగానొక్క కుమారుడు. స్థానిక సోనోవిజన్ షోరూంలో పనిచేస్తూ కుమారుడిని విజయ్ ఇంజినీరింగ్ చదివిస్తున్నారు. కుమారుడి మరణానికి ఒక్క రోజు ముందు విజయ్ అయ్యప్పమాల వేశారు. జీజీహెచ్‌లో పోస్టుమార్టం అనంతరం కన్నబిడ్డ మృతదేహాన్ని చూస్తూ అయ్యప్పా అంటూ దేవుడిని స్మరిస్తూ ఏంటీ ఘోరమని కన్నీటి పర్యంతమైన తీరు హృదయాల్ని కదిలించింది. రెండేళ్లలో మంచి ఉద్యోగం సాధించి తన కోసం తన చిన్నప్పటి నుంచి కష్టించి పనిచేస్తున్న తండ్రి రుణం తీర్చుకుంటాననీ, మంచి ఉద్యోగం సాఽధించి అపాయింట్‌మెంట్ లెటర్ చేతిలో పెట్టి సర్‌ప్రైజ్ చేస్తానని చెప్పేవాడని తోటి స్నేహితులు కన్నీళ్లు నిండిన కళ్లతో కార్తీక్ మాటల్ని గుర్తు చేసుకున్నారు.
దర్జీ కొడుకు ఇంజినీరు అనిపించుకోవాలని....
దర్జీ కొడుకు ఇంజినీరు అయ్యాడు అనిపించుకుంటా అని ముద్దన ఫణీంద్ర గణేష్(20) అంటూండే వాడని అతడి సహ విద్యార్థులు చెప్పి కన్నీటి పర్యంతమయ్యారు. జీవనోపాధి కోసం తండ్రి దుబాయ్ వెళ్లి అక్కడ దర్జీగా జీవనాన్ని కొనసాగిస్తూ భార్యాబిడ్డల కోసం కష్టపడుతున్నాడు. తణుకులో నివాసం ఉండే గణేష్ స్థాఽనిక ఇంజినీరింగ్ కళాశాలలో బీ టెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. జీవితం కోసం ఎన్నో కలలు కంటూ తండ్రి కష్టాన్ని చెరిపేస్తానని.. తన భర్త ఎలా ఉన్నాడో అంటూ తలుచుకుంటూ బాధపడుతుండే తల్లి ధనలక్ష్మితో అనేవాడని మావయ్య సాయికృష్ణ ఆవేదన చెందారు.
స్కూబా డైవింగ్ నిపుణుడు ప్రకాష్‌బాబు సాహసం
యువకుల మృతదేహాలను వెలికితీయడంలో కొవ్వూరు ఫైర్‌స్టేషన్ స్కూబా డైవింగ్ నిపుణుడు ప్రకాష్ సాహసం చేశారు. ఆక్సిజన్ సాయంతో సుమారు 70 అడుగుల లోతులో మూడు గంటల పాటు శ్రమించడంతో కార్తీక్, రవితేజ మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ సందర్భంగా ప్రకాష్‌ను అగ్నిమాపకశాఖ డీఎఫ్‌ఓ సురేంద్రన్, ఏఎఫ్‌ఓ సిబ్బంది అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment