ప్రమాదంలో పూర్తిగా ధ్వంసమైన కారు
కృత్తివెన్ను (కృష్ణా జిల్లా): రెండు కార్లు, లారీ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందడంతో పాటు మరో తొమ్మిది మంది తీవ్రగాయాల పాలయ్యారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదం కృష్ణాజిల్లా కృత్తివెన్ను మండలం సంగమూడి సమీపంలో 216 జాతీయ రహదారిపై బుధవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో సంభవించింది. ముందు వెళ్తున్న లారీని కారు ఓవర్ టేక్ చేస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. కృత్తివెన్ను పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
అంబేడ్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం మొగళ్ళమూరు తూర్పుచెరువు నుంచి ఓ కుటుంబంలోని ఇద్దరు మహిళలు, నలుగురు చిన్నారులు, కారు డ్రైవర్‌తో కలసి మొత్తం ఏడుగురు గుంటూరు బయలుదేరారు. అక్కడి దేవదాసు చర్చిలో దాసుబాబుకి మొక్కు తీర్చుకోవడానికి వీరంతరూ బుధవారం ఉదయం 6 గంటలకు బయలుదేరారు. అల్లవరం మండలం మొగళ్ళమూరుకు చెందిన తెన్నేటి అనామణి, గోడికి చెందిన మడికి రాజేశ్వరి, మడికి మెరాకిల్, మడికి షారోన్ జ్యోతి, మడికి రమ్య, మడికి దాసుబాబు కారులో ఉన్నారు.
మొక్కులు తీర్చుకుని మధ్యాహ్నం తిరుగు ప్రయాణమయ్యారు. యలవర్తి అఖిలేష్, యలవర్తి రవి, దేవరకొండ నాగబసవయ్య, అజయ్‌కుమార్ నర్సాపురం నుంచి అవనిగడ్డకు కారులో వెళుతున్నారు. సంగమూడి సమీపానికి వచ్చే సరికి లారీని తప్పించబోయి రెండు కార్లు ఎదురెదురు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో గుంటూరు నుంచి మొగళ్ళమూరు వెళుతున్న కారులోని తెన్నేటి అనామణి (70) ఘటనా స్థలంలోనే మరణించింది.
అదే కారు డ్రైవర్ అల్లవరం మండలం అల్లవరం పొలంనకు చెందిన పెయ్యిల బాలస్వామి(20) తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మరణించాడు. ఈ కారులోని రాజేశ్వరీతో పాటు నలుగురు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. భర్తతో గొడవల కారణంగా ఐదు నెలలుగా రాజేశ్వరీ తన పిల్లలతో పుట్టింట్లో ఉంటోంది. భర్త మడికి చిరంజీవి ప్రైవేటు లైన్‌మెన్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు.
మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలింపు
ఈ ప్రమాదంలో మరో కారులోని నాగబసవయ్య, రవిలకు తీవ్రగాయాలు కాగా, అఖిలేష్, అజయ్‌కుమార్‌లకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులందరినీ 108, ఎన్‌హెచ్ అంబులెన్సుల్లో మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులతో పాటు కృత్తివెన్ను పోలీసులు సకాలంలో స్పందించిన తీరు ప్రశంసనీయం. ప్రమాద విషయాన్ని తెలుసుకున్న వెంటనే బందరు రూరల్ సీఐ వీరప్రసన్నగౌడ్, బంటుమిల్లి ఎస్‌ఐ పైడిబాబులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు సీఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment