పిఠాపురం: చిన్నప్పటి నుంచీ అతడికి పోలీసు అవాలనే బలమైన కోరిక. బాగా చదువుకుని, మంచి ప్రాక్టీస్ చేసి, పోలీసు ఉద్యోగానికి అర్హత సాధించాడు. కొద్ది రోజుల్లో ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. ఆ కల నెరవేరకుండానే కారు రూపంలో వచ్చిన మృత్యువు అతడి ఆశలను ఆవిరి చేసి, తిరిగి రాని లోకాలకు తీసుకుపోయింది. ఈ హృదయ విదారక సంఘటనకు సంబంధించి పిఠాపురం పోలీసులు తెలిపిన వివరాలివీ.. పిఠాపురం పట్టణంలోని అగ్రహారానికి చెందిన సన్నంగి సత్యనారాయణ, అప్పలకొండ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.
వారిలో చిన్న కుమారుడైన దుర్గాప్రసాద్ (26) డిగ్రీ చదువుకున్నాడు. చదువుకుంటూనే పోలీసు ఉద్యోగాలకు శిక్షణ పొందాడు. ఇటీవల రాష్ట్ర పోలీసు నియమకాలకు నిర్వహించిన ప్రాథమిక పరీక్షల్లో అర్హత సాధించాడు. తరువాత సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్‌ఎఫ్)కు నిర్వహించిన రాత పరీక్షలో కూడా అర్హత సాధించిన దుర్గాప్రసాద్ మరో రెండు రోజుల్లో మెడికల్ టెస్టుకు వెళ్లాల్సి ఉంది.
ఆదివారం తన అన్న కుమారుడి పుట్టిన రోజు వేడుకలు ఉండటంతో కేక్ తీసుకు రావడానికి బయలుదేరాడు. పిఠాపురం రాపర్తి సెంటర్ వద్దకు వచ్చేసరికి 216 జాతీయ రహదారిపై గొల్లప్రోలు వైపు నుంచి కాకినాడ వెళుతున్న ఒక కారు దుర్గాప్రసాద్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అతడిని 108లో పిఠాపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
అక్కడ ప్రథమ చికిత్స అనంతరం కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలిస్తూండగా మార్గం మధ్యలో దుర్గాప్రసాద్ మృతి చెందాడు. తమకు న్యాయం చేయాలని కోరుతూ మృతుడి బంధువులు జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. వారితో పిఠాపురం సీఐ వైఆర్‌కే శ్రీనివాస్ చర్చలు జరపడంతో ఆందోళన విరమించారు. దుర్గాప్రసాద్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
ఈ ప్రమాదంపై పిఠాపురం పట్టణ ఎస్సై జగన్‌మోహన్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుగా చూడాలన్న కోరిక నెరవేరకుండానే దుర్గాప్రసాద్ కానరాని లోకాలకు వెళ్లిపోయాడంటూ అతడి తల్లిదండ్రులు, అన్న, అక్కలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment