విలేకరులతో మాట్లాడుతున్న జక్కంపూడి గణేష్. పక్కన రాయపురెడ్డి చిన్న
కాకినాడ: గత సార్వత్రిక ఎన్నికలలో రాజానగరం నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి, ఓటమి చెందిన రాయపురెడ్డి ప్రసాద్ (చిన్న) వైఎస్సార్ సీపీలో చేరారు. బుధవారం జగ్గంపేట మండలం ఇర్రిపాక వచ్చిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని స్థానిక ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు జక్కంపూడి రాజా ద్వారా కలుసుకున్నారు. పార్టీ లో చేరేందుకు ఆసక్తి చూపడంతో ఆయనను సీఎం జగన్ సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంక్షేమ, సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, యువ నాయకుడు జక్కంపూడి గణేష్ పాల్గొన్నారు.
చిన్న రాక పార్టీకి బలం: జక్కంపూడి గణేష్
ప్రకాశం నగర్: రాయపురెడ్డి చిన్న రాకతో వైఎస్సార్ సీపీకి మరింత బలం చేకూరిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రీజనల్ కో ఆర్డినేటర్ జక్కంపూడి గణేష్ పేర్కొన్నారు. బుధవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గణేష్ మాట్లాడుతూ 30 ఏళ్ళుగా తమ తండ్రి జక్కంపూడి రామ్మోహనరావుకు వెన్నెంటి ఉండి పనిచేసిన రాయపురెడ్డి చిన్న బుధవారం ఇర్రిపాకలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహనన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో జనసేనకు పెద్ద షాక్ తగిలినట్లు అయిందన్నారు.
చిన్న తమ సొంత మనిషి అన్నారు. జక్కంపూడి రామ్మోహనరావు మరణం అనంతరం కూడా తమతో కలిసి పయనించడమే కాకుండా స్థానిక కంబాలచెరువు వద్ద జక్కంపూడి రామ్మోహనరావు విగ్రహాన్ని ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేశారన్నారు. చిన్నకు నియోజకవర్గంలోని అన్ని మండలాలలో మంచి కేడర్ ఉందని, సొంత సొమ్ము ఖర్చు చేసి ఎంతోమందికి సహకారం అందించారన్నారు. అటువంటి నాయకుడు ఇప్పుడు తమ పార్టీలో చేరడంతో పార్టీకి మరింత బలం చేకూరిందన్నారు.
వచ్చే ఎన్నికల్లో మరింత భారీ మెజార్టీతో రాజానగరంలో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. త్వరలోనే టీడీపీ, ఇతర పార్టీల నుంచి జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులుగా పనిచేసినవారు పెద్ద ఎత్తున పార్టీలో చేరనున్నారని తెలిపారు. త్వరలోనే భారీ బహిరంగ సభ నిర్వహించి తమ సత్తా చాటుతామన్నారు. ఈ బహిరంగ సభలో తాము నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి నివేదిను ప్రజల ముందు ఉంచుతామన్నారు. తమ పార్టీ నుంచి ఒకరు బయటకు వెళితే నలుగురు పార్టీలోకి వస్తారని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
సంక్షేమ పాలనకు ఆకర్షితుడనై పార్టీలో చేరాను : రాయపురెడ్డి చిన్న
రాయపురెడ్డి చిన్నా మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగనన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న సంక్షేమ పాలనకు ఆకర్షితుడనై వైఎస్సార్ సీపీలో చేరానన్నారు. వచ్చే ఎన్నికల్లో జక్కంపూడి రాజా అత్యధిక మెజార్టీతో గెలుపొందడం ఖాయమన్నారు. తాను జక్కంపూడి కుటుంబంలో ఒక సభ్యుడినేనని అనివార్య కారణాలతో బయటకు వెళ్లానన్నారు.
తనను స్వయంగా సీఎం జగన్ వద్దకు తీసుకువెళ్లి వైఎస్సార్ సీపీ కండువా వేయించిన గణేష్‌కు అభినందనలు తెలిపారు. పార్టీ కోసం పనిచేయండి .మీకు తగిన ప్రాధాన్యం ఇస్తానని ముఖ్యమంత్రి జగనన్‌మోహనన్‌రెడ్డి హామీ ఇచ్చారన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో తనకు అనేక ఇబ్బందుల ఎదురయ్యాయని, వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఎటువంటి ఇబ్బంది ఎదురుకాలేదని అన్నారు. ఇకపై నియోజకవర్గంలో ఒక్క ఓటుకు నలుగురుం పనిచేస్తామన్నారు. ఈ సమావేశంలో దాట్ల పృథ్వీరాజ్, కోరుకొండ మండం పార్టీ ఉపాధ్యక్షుడు ఉల్లి గణ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment