టీడీపీ ఫ్లెక్సీ స్థానంలో రంగు మార్చి వేసిన మరో ఫ్లెక్సీ
పిఠాపురం: పిఠాపురంలో టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వర్మ మళ్లీ రంగు మార్చేశారు. ఇప్పటి వరకు జనసేన అధినేత పిఠాపురంలో పోటీకి వస్తే తాను అండగా ఉండి నెగ్గించి బంగారు పళ్లెంలో పెట్టి ఇస్తానంటూ వర్మ చెప్పుకొచ్చారు. పవన్ కల్యాణ పిఠాపురం నుంచి పోటీ చేస్తారనగానే రంగు మార్చేశారు. టీడీపీ జెండాల స్థానంలో తెలుపు రంగు జెండాలపై స్థానికుడికే నా ఓటూ అంటూ స్థానికతను తెరపైకి తీసుకు వచ్చేందుకు పావులు కదుపుతున్నారు.
ఒక పక్క పొత్తు ధర్మం పాటిస్తామంటూ చెబుతూనే పవన్ కల్యాణ్ స్థానికుడు కాదంటూ ప్రచారం ముమ్మరం చేశారు. 2014లో తనకు టిక్కెట్ రాకపోవడంతో టీడీపీ జెండాలను తగులబెట్టి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన వర్మ ఇప్పుడు అదే రాజకీయాలను రిపీట్ చేస్తున్నారని స్థానికులు చెప్పుకుంటున్నారు. జెండా రంగులు మార్చేయడం ఆయనకు కొత్త కాదని ఇలాంటి వ్యక్తితో పొత్తు అనడం మంచిది కాదని జనసేన నేతలు విమర్శిస్తున్నారు.
ప్రస్తుతం వర్మ ఏర్పాటు చేయించిన ఫ్లెక్సీలు పిఠాపురంలో దుమారం రేపుతున్నాయి. నిజంగా స్థానికత గురించి మాట్లాడాలంటే వర్మ కూడా స్థానికేతరుడే అంటూ జనసేన నేతలు అంటున్నారు. స్థానికుడునని చెప్పుకునే వర్మ ఒక్క రోజు కూడా ఇక్కడ లేరని కాకినాడలో సొంత ఇల్లు కట్టుకుని, చుట్టపుచూపుగా ఇక్కడకు వచ్చి పోయే వర్మ స్థానికత గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment