చేతిలో మొబైల్‌ ఉండాల్సిందే.. రాజేష్‌..సురేష్‌ల పరిస్థితి చూద్దాం | - | Sakshi
Sakshi News home page

చేతిలో మొబైల్‌ ఉండాల్సిందే.. రాజేష్‌..సురేష్‌ల పరిస్థితి చూద్దాం

Dec 24 2023 2:26 AM | Updated on Dec 24 2023 12:07 PM

- - Sakshi

సురేష్‌ జేఎన్‌టీయూకేలో ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. తెల్లవారుజామున లేచింది మొదలు అర్థరాత్రి వరకు మొబైల్‌ ఫోన్‌ చూస్తూనే ఉంటాడు. పరీక్షలు సమీపిస్తున్నాయని ఇంట్లో కుటుంబ సభ్యులు అడిగితే చివర్లో చదివేస్తానంటూ బదులిస్తున్నాడు. చేతిలో మొబైల్‌ లేకుండా ఉండలేనంతగా మారిపోయాడు. పరీక్షలు వచ్చినా ఇతని వైఖరిలో మార్పు లేదు. ఫలితాలు చూసేసరికి సబ్జెక్టులన్నీ ఫెయిలయ్యాడు. బిడ్డ తీరు చూసి తల్లిదండ్రుల ఆవేదం వర్ణనాతీతం.

రాజేష్‌ది కాట్రేనికోన. తండ్రి వ్యవసాయం చేస్తుంటాడు. తల్లి గృహిణి. ఉన్నంతలో మంచి ప్రైవేట్‌ స్కూలులో జాయిన్‌ చేశారు. రోజూ స్కూలుకు వెళ్లి వస్తుంటాడు. స్కూలు నుంచి రాగానే తండ్రి కొనిచ్చిన మొబైల్‌ ఫోన్‌లో మునిగి తేలుతుంటాడు. ఇందులో కూడా పాఠాలు చదువుకుంటున్నానని తల్లికి చెబుతున్నాడు. కానీ మార్కులు చూస్తే దారుణం. కుర్రాడి పరిస్థితి అర్ధమైన తల్లిదండ్రులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. సెల్‌ వ్యసనాన్ని ఎలా మానిపించాలో తెలియక తలపట్టుకుంటున్నారు.

సాక్షిప్రతినిధి,కాకినాడ: రాజేష్‌..సురేష్‌లు మాత్రమే కాదు. చాలా మంది విద్యార్థులది ఇదే తీరు. చేతిలో మొబైల్‌ ఉండాల్సిందే. ఇంట్లో ఉన్నంతసేపు సెల్‌తోనే కాలమంతా గడిపేస్తున్నారు. బిడ్డల భవిష్యత్‌ కోసం బంగారు కలలు కనే తల్లిదండ్రులకు ఇదో పెద్ద సమస్యగా తయారైంది. మొబైల్‌ ఫోన్ల నుంచి వీరిని ఎలా దూరం చేయాలో తెలియక సతమతమవుతున్నారు. విలువైన కాలాన్ని వృథా చేస్తున్న బిడ్డల తీరుపై ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో చాలామంది చదువుకుంటున్న చిన్నారుల నుంచి యువత వరకూ ఈ మొబైల్‌తోనే కాలక్షేపం చేసేస్తున్నారు. విలువైన భవిష్యత్‌ను చేజేతులా పాడుచేసుకుంటున్నారు. దీనిపై చాలా ఇళ్లలో ఇది నిత్యం వివాదాలకు కారణమవుతోంది.

అప్‌డేట్‌గా ఉంటే మంచిదే.. కానీ..
వాస్తవానికి మొబైల్‌ ఫోన్‌ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి ప్రతీక. దీనిని సద్వినియోగం చేసుకుంటే చాలా ఉపయోగం. కానీ కెరీర్‌కు ఉపయోగపడని అంశాలను చూస్తుంటే కీలకమైన కాలం కాస్తా కరిగిపోతుంది. ఫలితంగా భవిష్యత్‌కు నష్టం జరుగుతుంది. కమ్యూనికేషన్‌కు..ఎప్పటికప్పుడు తమ సబ్జెక్టులకు సంబంధించిన అంశాలపై అప్‌డేట్‌గా ఉంటే మంచిదేనని.. కానీ అలా ఎక్కువ మంది విషయంలో ఇలా జరగడం లేదని జేఎన్‌టీయూకే ప్రొఫెసర్‌ ఒకరు చెప్పారు. అరచేతిలో ప్రపంచాన్ని వీక్షించే వీలున్న ఈ చిన్న ఆధునిక పరికరం ద్వారా మేలైన జీవితానికి బాటలు వేసుకోవచ్చునంటున్నారాయన. అలాగని నిరంతరం దానిని వాడడమే వ్యసనంగా పెట్టుకుంటే ఎలాంటి ప్రయోజనం ఉండదంటున్నారు.

మరీ ఇంత వ్యసనంగానా..
దాదాపు అన్ని వయసుల పిల్లలలో ఎక్కువ మంది రోజులో నాలుగు గంటల పాటు మొబైల్‌ ఫోన్ల ద్వారా సామాజిక మాధ్యమాల్లో ఉంటున్నారని ఇటీవల ఒక అధ్యయనంలో తేలింది. ఇలా నెలలో 120 గంటలు.. అంటే సుమారు నాలుగున్నర రోజులు. ఏడాదికి 54 రోజుల పాటు మొబైల్‌ ఫోన్‌ చూడటంలోనే కాలం గడిపేస్తున్నారని అంచనా. ఇది చాలా ప్రమాకరమైన పోకడ. తరచూ ఫోన్‌ చూడటం మానసిక రోగంలా తయారైందని సైకియాట్రిస్టులు అంటున్నారు.

పరీక్షా కాలంలోనూ..
పరీక్షలకు ముందు విద్యార్థులకు ప్రతి క్షణం చాలా విలువైనది. ఏ సమయంలో ఏది చేయాలో అదే చేయాలి. చదువుపై దృష్టి పెట్టాలని తల్లిదండ్రులు, టీచర్లు పదే పదే చెబుతున్నా పెడచెవిన పెడుతున్నారు. పరీక్షలు దగ్గరపడే సమయంలోనైనా మొబైల్‌కు కాస్త దూరంగా ఉంటే మంచిదని చెబుతున్నా ప్రయోజనం కనిపించడం లేదని తల్లిదండ్రులు కలవరపడుతున్నారు. కెరీర్‌ను మలుపు తిప్పే పదో తరగతి నుంచి డిగ్రీ లేదా, ఇంజినీరింగ్‌ మధ్య చదువుల్లో ఉన్న విద్యార్థులను ఈ ‘మొబైల్‌ ధోరణి’ దెబ్బతీస్తోందని విద్యావంతులు హెచ్చరిస్తున్నారు. సహజంగా 20–22 వయస్సు మధ్య గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేస్తారు. పీజీ ఇతర ఉన్నత విద్యా కోర్సులు 25 ఏళ్లకు పూర్తి చేసి ఉద్యోగం సాధించాలి. కానీ ఈ మొబైల్‌ విచ్చలవిడి వినియోగంతో పాతికేళ్లు దాటినా బ్యాక్‌లాగ్‌లు వెంటాడుతున్నాయి. ఉద్యోగం సంపాదించాల్సిన సమయంలో వాట్సప్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్ట్రా తదితర సామాజిక మాధ్యమాల ప్రభావంలో పడి నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement