అరటి సాగు.. లాభాలు బాగు
రాయవరం: ఏ సీజన్‌లోనైనా అరటి కాయలకు మంచి డిమాండ్ ఉంటుంది. పైగా ఈ పంటను ఏ సీజన్‌లోనైనా సాగు చేసుకోవచ్చు. అరటిలో కేవలం పంటే కాకుండా ఆకులు, పిలకలకు కూడా మంచి గిరాకీ ఉంటుంది. లాభాలు తప్ప దాదాపుగా నష్టాలు ఉండవు. అందుకే రైతులు అరటి సాగుకు ఆసక్తి చూపుతున్నారు. జిల్లాలో సుమారుగా 15వేల ఎకరాల్లో రైతులు అరటి సాగు చేపడుతున్నారు. కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తే అరటి సాగులో అధిక లాభాలు సాధించవచ్చునంటున్నారు రామచంద్రపురం డివిజన్ ఉద్యానవన శాఖ అధికారి ఎం.అనూష. సాగు విధానం, పాటించాల్సిన పద్ధతులు ఆమె మాటల్లోనే..
ఉష్ణ మండల పంట
అరటిని ఏడాది పొడవునా సాగు చేయవచ్చు. ఇది ఉష్ణమండల పంట. 10 నుంచి 40 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతల్లోనూ దిగుబడి వస్తుంది. 46 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉన్నా అరటిలో అధిక ఫలసాయం పొందడానికి వీలుంటుంది. ఉష్ణోగ్రత తక్కువగా ఉంటే గెలల్లో ఎదుగుదల తగ్గిపోతుంది. ఏడాది పొడవునా అరటిని సాగు చేయవచ్చు. గ్రాండ్‌ఫైన్ రకం అధిక దిగుబడినిస్తుంది. నీరు ఇంకే సారవంతమైన నేలలు అరటి పంటకు అనుకూలం. చౌడు భూములు అరటి పంటకు అనుకూలం కావు. భూమిని బాగా దుక్కి చేసి, చదును చేసిన తర్వాత ఆరడుగుల పొడవు,. ఐదడుగుల వెడల్పుతో లేదా ఐదున్నర అడుగుల పొడవు వెడల్పుతో నాటుకోవాలి. 1.5 అడుగుల గుంతలు తవ్వాలి. గుంత పైభాగం మట్టికి 5కిలోల పశువు ఎరువు, 300గ్రాముల ఆముదం లేదా వేపపిండి, 150 గ్రాముల సూపర్‌ఫాస్ఫేట్ కలిపి గుంతలు పూడ్చాలి. నీరు పెడితే గుంతలో మట్టి సర్దుకుంటుంది. టిష్యూకల్చర్ మొక్కలను మట్టి, గడ్డి చెదరకుండా పాలథీన్ సంచులను తీసి, గుంత మధ్యలో పెట్టి తిరిగి డ్రిప్ ద్వారా నీరు పెట్టాలి.
ఎరువుల వాడకం ఇలా..
టిష్యూకల్చర్ అరటి మొక్కలకు పోషక పదార్థాలు నిల్వ ఉండే దుంపలుండవు. ఇవి నాటిన వెంటనే తొందరగా పెరగవు. ఎరువులను సమర్ధవంతంగా ఉపయోగించుకుంటాయి. నాటిన నాలుగు నుంచి ఐదు నె నెలలకు గెల అంకురం ఏర్పడి హస్తాలు, కాయల సంఖ్య నిర్ణయమవుతుంది. ఈ దశ అరటి చెట్టు పెరుగుదలలో చాలా కీలకమైనందున పోషకాల లోపం లేకుండా సిఫారసు మేరకు ఎరువులు అందించాలి. లేకుంటే గెలలో హస్తాలు, కాయల సంఖ్య తగ్గుతుంది. ఆ తర్వాత వేసే ఎరువులు చెట్లు, కాయల వృద్ధికి ఉపయోగపడతాయే తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఎరువులను గుంతల్లో వేయడంతో పాటు, మొక్కలు నాటిన రెండో వారం నుంచి డ్రిప్ పద్ధతిలో నీరందించాలి. టిష్యూ కల్చర్ అరటి చెట్లకు ఎరువులను డ్రిప్ ద్వారా వేస్తే అధిక ఖర్చు అవుతుంది. ఎరువులను రోజూ గాని, 2–3 రోజులకు గాని, వారానికి ఒకసారి గాని అందించవచ్చు. పోషకాల వినియోగంలో టిష్యూకల్చర్ అగ్రగామి. ఒక టన్ను ఆరటికాయల దిగుబడికి 8కిలోల నత్రజని, 1.5 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాష్ ను వినియోగించుకుంటుంది. దీని ప్రకారం ఎకరానికి 30 టన్నుల దిగుబడికి 240 కిలోల నత్రజని, 45 కిలోల భాస్వరం, 600 కిలోల పొటాష్ వేయాలి.
పిలకలు ఎప్పటికప్పుడు తీసేయాలి
సాధారణంగా అరటి చెట్టు 3 నుంచి 8 పిలకలు వేస్తుంది. అవసరానికి మంచి నత్రజని వేసినప్పుడు, తల్లిచెట్టుకు దెబ్బతగిలినప్పుడు, అవసరానికి మించి మట్టి ఎగదోసినప్పుడు పిలకలు ఎక్కువగా వస్తాయి. వీటిని ఎప్పటికప్పుడు తీసివేయాలి. లేకుంటే భూమిలోని పోషకాలను తల్లిచెట్టుతో సమానంగా ఉపయోగించుకుని పోటీపడి పెరిగి తెగుళ్లు, పురుగుల బెడదను పెంచుతాయి. పిలకలను ఆకుల కింద భాగంలో కోసి, మధ్యభాగాన్ని పొడిచిన వెంటనే 10–20 చుక్కల కిరోసిన్‌ను ఇంక్ ఫిల్లర్ లేదా సిరంజ్‌తో వేస్తే మళ్లీరావు.
ఏ సీజన్‌లోనైనా డిమాండ్
దాదాపు నష్టం ఉండదు
జిల్లాలో 15 వేల ఎకరాల్లో పెంపకం
Comments
Please login to add a commentAdd a comment