నేడు, రేపు స్థానిక సెలవు
కాకినాడ సిటీ: ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లు, పోలింగ్ దృష్ట్యా బుధ, గురువారాల్లో కేంద్ర ఎన్నికల సంఘం స్థానిక సెలవు ప్రకటించిందని కలెక్టర్ షణ్మోహన్ సగిలి తెలిపారు. పోలింగ్ జరిగే గురువారం పట్టభద్ర ఓటర్లు ఓటు వేయడానికి వీలుగా స్పెషల్ క్యాజువల్ లీవ్ ప్రకటించారన్నారు. అలాగే, పోలింగ్ కేంద్రాల ఏర్పాట్ల నిమిత్తం ముందు రోజయిన బుధవారం కూడా స్థానిక సెలవుగా ప్రకటించారని తెలిపారు. ఈ ఎన్నికల దృష్ట్యా 27వ తేదీ సాయంత్రం 4 గంటల వరకూ, ఎన్నికల కౌంటింగ్ దృష్ట్యా మార్చి 3న కూడా మద్యం విక్రయాలపై నిషేధం విధించారని, అందువలన మద్యం దుకాణాలను మూసివేయాలని కలెక్టర్ తెలిపారు. ఆయా తేదీల్లో క్లబ్బులు, స్టార్ హోటళ్లు, రెస్టారెంట్లు, హోటళ్లలో కూడా మద్యం అమ్మరాదని ఆదేశించారు. ఈ మేరకు ఎకై ్సజ్ అధికారులు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
వసతి గృహాల్లో
సదుపాయాలు కల్పించాలి
కాకినాడ సిటీ: వసతి గృహాల్లో విద్యార్థులకు మెరుగైన సదుపాయాలు కల్పించాలని అధికారులను కలెక్టర్ షణ్మోహన్ ఆదేశించారు. స్థానిక జగన్నాథపురం చర్చి స్క్వేర్ వద్ద ఉన్న సాంఘిక సంక్షేమ శాఖ బాలికల కళాశాల వసతి గృహం, ఏఎస్‌డీ డిగ్రీ కళాశాల బాలికల వసతి గృహాన్ని మంగళవారం ఆయన తనిఖీ చేశారు. తాగునీరు, భోజనం, ఇతర సదుపాయాల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులూ లేకుండా వసతి గృహాల్లో మెరుగైన సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహానికి సంబంధించి విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా నూతన భవనాల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అన్నారు. కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ డీడీ జి.శ్రీనివాసరావు, ఏపీఈడబ్ల్యూఐడీసీ ఈఈ వెంకటరాజు తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికలు సజావుగా
నిర్వహించాలి
కాకినాడ సిటీ: ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ను గురువారం సజావుగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి జె.వెంకటరావు ఆదేశించారు. పోలింగ్ మెటీరియల్ పంపిణీ కేంద్రమైన కాకినాడ మెక్లారిన్ హైస్కూల్‌ను ఆయన మంగళవారం సందర్శించారు. పోలింగ్ మెటీరియల్ 67 పోలింగ్ కేంద్రాలకు సక్రమంగా చేరేలా కౌంటర్లు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో కాకినాడ ఆర్‌డీఓ ఎస్.మల్లిబాబు తదితరులు పాల్గొన్నారు.
ఈవీఎంల భద్రతకు చర్యలు
కాకినాడ సిటీ: ఈవీఎం, వీవీ ప్యాట్స్ భద్రతకు తగు చర్యలు చేపట్టాలని అధికారులను కలెక్టర్ షణ్మోహన్ ఆదేశించారు. కలెక్టరేట్ వద్ద ఉన్న ఈవీఎం గోదామును మంగళవారం ఆయన తనిఖీ చేశారు. అక్కడ భద్రతకు చేపడుతున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి నెలా ఈవీఎం గోదామును పరిశీలించి, నివేదిక పంపిస్తున్నామని వెల్లడించారు. కార్యక్రమంలో కాకినాడ అర్బన్ తహసీల్దార్ వి.జితేంద్ర, కలెక్టరేట్ ఎన్నికల విభాగం డిప్యూటీ తహసీల్దార్ ఎం.జగన్నాథం తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment