ఘనమై.. ఆదర్శ వరమై..
ఫ ఉమ్మడి జిల్లాలో శంఖవరం,
హంసవరంలో ఆదర్శ పాఠశాలలు
ఫ ఆరో తరగతిలో ప్రవేశానికి నోటిఫికేషన్
ఫ ఆన్‌లైన్‌లో విద్యార్థుల
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నిరుపేద విద్యార్థులకు సైతం కార్పొరేట్ విద్య అందాలనే సత్సంకల్పంతో ఏపీ మోడల్ పాఠశాలలను 2013లో ప్రారంభించారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రస్తుతం పాఠశాలల్లో ఇంగ్లిష్ బోధనతో పాటు, అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో శంఖవరం మండలం శంఖవరం, తుని మండలం హంసవరంలో ఆదర్శ పాఠశాలలున్నాయి. ప్రస్తుతం ఆయా పాఠశాలల్లో ఆరో తరగతి ప్రవేశానికి విద్యార్థుల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది.
దరఖాస్తులకు ఆహ్వానం
మోడల్ పాఠశాలల్లో 2025–26 విద్యా సంవత్సరంలో ఆరో తరగతి ప్రవేశానికి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మొదలైంది. సోమవారం నుంచి ఆన్‌లైన్‌లో ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ మార్చి 31 వరకు కొనసాగుతుంది. దరఖాస్తు చేసుకున్న విద్యార్థి అర్హతను పరిశీలించి, అర్హుడని తేలితే క్రెడిట్, డెబిట్‌కార్డులు, నెట్ బ్యాకింగ్ ఉపయోగించి గేట్‌వే ద్వారా రుసుం చెల్లిస్తే, ఓ జర్నల్ నంబర్ కేటాయిస్తారు. ఆ నంబర్ ఆధారంగా www.cse.ap.gov.in లేదా www.apms.apcfss.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. తర్వాత నకలును పాఠశాలలో సమర్పించాల్సి ఉంటుంది.
ఏప్రిల్ 20న ప్రవేశ పరీక్ష
ఆరో తరగతి ప్రవేశానికి గతేడాది మాదిరిగానే ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. దరఖాస్తు చేసుకున్న మోడల్ స్కూల్‌లోనే పరీక్ష ఏప్రిల్ 20న ఉదయం 10 నుంచి 12 గంటల వరకు జరుగుతుంది. మెరిట్ లిస్ట్ ఆధారంగా రోస్టర్ ప్రకారం సీట్లను కేటాయించనున్నారు. ఏప్రిల్ 27న మెరిట్ లిస్ట్, అదే రోజు సెలెక్షన్ లిస్టును వెల్లడిస్తారు. ఏప్రిల్ 30న సర్టిఫికెట్ల పరిశీలనతో పాటు, కౌన్సెలింగ్ ప్రక్రియ జరుగుతుంది. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభ తేదీ నుంచి తరగతులు మొదలవుతాయి.
ఇక్కడ సీటుకు చాలా డిమాండ్
పేద, మధ్య తరగతి కుటుంబాల పిల్లలకు కూడా ఉన్నత చదువును అందుబాటులోకి తీసుకురావడమే ధ్యేయంగా ఏపీ మోడల్ పాఠశాలలు ఏర్పాటయ్యాయి. ఆయా పాఠశాలల్లో ఆరో తరగతి ప్రవేశం పొందితే, ఇంటర్ వరకు ఇంగ్లిష్ మీడియం విద్యను అందించడంతో పాటు, విద్యా కానుక కిట్లు, ఉచితంగా పాఠ్య పుస్తకాలు, మధ్యాహ్న భోజనం వంటి సౌకర్యాలు కల్పిస్తారు. పూర్తి ఇంగ్లిష్ మీడియంతో సత్ఫలితాలను సాధిస్తున్న మోడల్ స్కూల్, జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్ పొందడం అంత ఈజీ కాదు. ప్రైవేట్ పాఠశాలల్లో ఎంత ఖర్చు పెట్టినా అందుబాటులో లేని నాణ్యమైన ఇంగ్లిష్ మీడియం విద్య.. ఇక్కడ లభ్యం కావడం పేద పిల్లలకు వరంగా మారింది.
లభించే సదుపాయాలివే..
● నిష్టాతులైన ఉపాధ్యాయులతో బోధన
● కార్పొరేట్ పాఠశాలలను తలదన్నేలా ఐదు ఎకరాల సువిశాల ప్రాంగణాల్లో భవనాలు
● ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు ఇంగ్లిష్ మీడియం విద్యా బోధన
● సౌకర్యవంతంగా విశాల తరగతి గదులు, విద్యార్థులకు ఉచిత విద్య
● బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులకు పూర్తి స్థాయి పరికరాలతో వేర్వేరుగా ల్యాబ్‌లు
● నీట్, జేఈఈ, ఎంసెట్ వంటి పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ
● స్పోకెన్ ఇంగ్లిష్, చేతి రాతపై ప్రత్యేక శ్రద్ధ
● అన్ని సదుపాయాలతో గ్రంథాలయం
● ఎల్‌సీడీ ప్రొజెక్టర్‌తో విద్యా బోధన, డిజిటల్ విద్యా విధానం
● తొమ్మిదో తరగతి నుంచి అకడమిక్ విద్యకు సమాంతరంగా కనీసం రెండు ఒకేషనల్ కోర్సులు
నాణ్యమైన విద్యా బోధన
పేద విద్యార్థులకు మోడల్ పాఠశాలలు బంగారు భవిష్యత్తు ఇస్తాయి. ఐదో తరగతి పూర్తి చేసుకున్న ప్రతి విద్యార్థి ఇందులో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవాలి. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా మోడల్ పాఠశాలలు కొనసాగుతున్నాయి. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో హంసవరం, శంఖవరంలో మోడల్ స్కూళ్లు నిర్వహిస్తున్నాం. నాణ్యమైన విద్యా బోధనతో పాటు, పాఠ్య పుస్తకాలు, యూనిఫాం ఉచితంగా ఇస్తారు. ఆరో తరగతిలో ప్రవేశాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్థులు దీనిని సద్వినియోగం చేసుకోవాలి.
– పి.రమేష్, జిల్లా విద్యా శాఖాధికారి, కాకినాడ
ఎవరు అర్హులంటే..
ఓసీ, బీసీ విద్యార్థులు 2013 సెప్టెంబర్ ఒకటి నుంచి 2015 ఆగస్టు 31 మధ్య జన్మించిన వారు అర్హులు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులైతే 2011 సెప్టెంబర్ ఒకటి నుంచి 2015 ఆగస్టు 31లోపు జన్మించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.75, ఓసీ, బీసీలు రూ.150 పరీక్ష ఫీజు చెల్లించాలి. ప్రభుత్వం లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో నిరవధికంగా ఐదో తరగతి చదివి ఉండాలి. ప్రవేశ పరీక్షలో ఓసీ, బీసీ విద్యార్థులకు 35 మార్కులు, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 30 మార్కులు వచ్చి ఉండాలి.
ఘనమై.. ఆదర్శ వరమై..
Comments
Please login to add a commentAdd a comment