మృత్యువు విడదీయని స్నేహ బంధం
● ఆర్టీసీ బస్సు ఢీకొని ఇద్దరు యువకుల మృతి
● పోలీస్ స్టేషన్ ఎదుట
మృతుల బంధువుల ఆందోళన
ధవళేశ్వరం: వారిద్దరూ స్నేహితులు. కలిసిమెలిసి తిరుగుతూ.. జీవితానందాన్ని ఆస్వాదిస్తున్న వారిని మృత్యువు అమాంతం మింగేసింది. ఆ మృత్యువు కూడా ఆ స్నేహితులను విడదీయలేకపోయింది. ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో ధవళేశ్వరం జాలరుపేటకు చెందిన యువకులు నాగమల్లి ముత్యాలరావు(18), బొడ్డు వెంకటేష్(16) మృతి చెందారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మంగళవారం మధ్యాహ్నం 3.30కు రాజోలు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు రాజోలు నుంచి రాజమహేంద్రవరానికి వెళుతోంది. ధవళేశ్వరం కాటన్‌పేట సమీపంలో ముత్యాలరావు, వెంకటేష్ మోటార్ బైక్‌పై వెళుతూ ఆర్టీసీ బస్సును ఓవర్ టేక్ చేయబోయారు. అదుపుతప్పి కిందపడడంతో వారి తలలపై నుంచి బస్సు వెనుక చక్రాలు దూసుకెళ్లి, అక్కడికక్కడే మృతి చెందారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న జాలరుపేట వాసులు, స్థానికులు కలిసి సంఘటన స్థలంలో ఆందోళన చేపట్టారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఎదుట రోడ్డుపై బైఠాయించి, నిరసన తెలిపారు. దీంతో వేమగిరి వైపు నుంచి వచ్చే వాహనాలను హైవే మీదుగా, రాజమహేంద్రవరం నుంచి వచ్చే వాహనాలను ఐఎల్‌టీడీ జంక్షన్ నుంచి మళ్లించారు. ఆందోళన చేస్తున్న మృతుల బంధువులతో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి చర్చలు జరిపారు. వ్యక్తిగతంగా రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందిస్తానని ఎమ్మెల్యే ప్రకటించారు. ప్రభుత్వ పరంగా సాయం అందించేందుకు కృషి చేస్తానన్నారు. ఆర్టీసీ అధికారులు రూ.15 వేల చొప్పున ప్రకటించారు. ధవళేశ్వరం సీఐ టి.గణేష్ వ్యక్తిగతంగా రూ.10 వేల చొప్పున డీఎస్పీ భవ్య కిషోర్ చేతుల మీదుగా అందజేశారు. దీంతో ఆందోళనకారులు శాంతించారు. డీఎస్పీ ఆధ్వర్యంలో సీఐలు గణేష్, కె.మంగాదేవి, వెంకటేశ్వరరావు, ఎస్సైలు క్రాంతికుమార్, హరిబాబు తదితరులు బందోబస్తు నిర్వహించారు. చిన్న వయసులోనే యువకులు తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో వారి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. జాలరుపేట ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
మృత్యువు విడదీయని స్నేహ బంధం
Comments
Please login to add a commentAdd a comment