రాగి జావ తాగి విద్యార్థులకు అస్వస్థత
● గోప్యంగా ఉంచేందుకు హెచ్‌ఎం యత్నం
● జగ్గిరాజుపేట స్కూల్‌లో ఘటన
ఉప్పలగుప్తం: చల్లపల్లి పంచాయతీలోని జగ్గిరాజుపేట మండల ప్రజా పరిషత్ పాఠశాలలో మంగళవారం ఉదయం అల్పాహారంగా ఇచ్చిన రాగి జావ తాగి విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పాఠశాలకు మొత్తం 26 మంది విద్యార్థులు హాజరవ్వగా, 14 మంది వాంతులతో అస్వస్థతకు గురవ్వడం చర్చనీయాంశమైంది. పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేసే కుక్ ముందుగా ఇంటి వద్దే ఆహారం తయారు చేసి, ఫంక్షన్‌కు వెళ్లడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని హెచ్‌ఎం వరలక్ష్మి తెలిపారు. హెచ్‌ఎం అందించిన సరకులతోనే పిల్లలకు ఆహారాన్ని తయారు చేసి, బంధువుల పెళ్లికి వెళ్లానని కుక్ సుజాత పేర్కొన్నారు. రెండు ప్యాకెట్ల రాగి పిండిని నెలంతా 28 మంది విద్యార్థులకు సర్దుబాటు చేసేలా హెచ్‌ఎం చెబుతారని, ఎప్పటిలాగే ఈరోజూ తయారుచేశానని వివరించారు. రాగి పిండి మంగళవారంతో అయిపోయిందని గ్రామస్తుల ఎదుట వాపోయారు. రాగి పిండి కాల పరిమితి ముగిసి ఉండవచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. పాఠశాలలో కనీసం రాగి పిండి ప్యాకెట్లు లేకపోవడం గమనార్హం. ఉదయం సుమారు 10 గంటలకు సంఘటన జరగ్గా, హెచ్‌ఎం గోప్యంగా ఉంచటంతో, మధ్యాహ్నం రెండు గంటలకు కానీ ఉన్నతాధికారులకు విషయం తెలియలేదు. సమాచారం అందుకున్న ఎంఈవో సత్తి సత్యకృష్ణ, సర్పంచ్ ఇసుకపట్ల జయమణి, దళిత నాయకుడు ఇసుకపట్ల రఘుబాబు, వైద్య సిబ్బంది పాఠశాలకు చేరుకున్నారు. విద్యార్థులకు ప్రాథమిక చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం అమలాపురం ఏరియా ఆస్పత్రికి అంబులెన్స్‌లో తరలించారు. హెచ్‌ఎం వరలక్ష్మి తీరుపై ఎంఈవో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చికిత్స పొందుతున్న విద్యార్థులను ఎమ్మెల్యే ఆనందరావు, ఆర్డీవో కె.మాధవి, డీఈవో సలీం బాషా, ఎంఈవో కిరణ్‌బాబు పరామర్శించారు.
విధుల నుంచి తొలగింపు
ఈ సంఘటనపై డీఈవో సలీం బాషా మాట్లాడుతూ, కుక్ ఇంటి వద్ద ఆహారం తయారు చేసుకుని రావడం వల్ల ఫుడ్ పాయిజన్ జరిగిందని, జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు కుక్‌తో పాటు హెల్పర్‌ను విధుల నుంచి తొలగించామని ప్రకటించారు. దీనిపై స్థానిక కూటమి నాయకుల ఒత్తిళ్లు ఉన్నాయని గ్రామంలో చర్చించుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment