కాకినాడ క్రైం: జీబీఎస్ వ్యాధితో మరో వ్యక్తి శనివారం జీజీహెచ్‌లో చేరాడు. ఏలేశ్వరానికి చెందిన 52 ఏళ్ల ఆ వ్యక్తి జీబీఎస్‌తో బాధ పడుతున్నాడని వైద్యులు నిర్ధారించారు. దీంతో కలిపి జీజీహెచ్‌లో జీబీఎస్ కేసులు నాలుగుకు చేరాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఓ వ్యక్తి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం ముగ్గురు చికిత్స పొందుతున్నారని వైద్యాధికారులు తెలిపారు.
రత్నగిరికి పోటెత్తిన భక్తులు
అన్నవరం: రత్నగిరి వాసుడు సత్యదేవుడిని శనివారం పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించి, పూజలు చేశారు. దీంతో ఆలయం వద్ద రద్దీ ఏర్పడింది. ఉచిత దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట సమయం పట్టింది. మొత్తం 25 వేల మంది భక్తులు సత్యదేవుని దర్శించుకున్నారు. వ్రతాలు 1,500 జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.25 లక్షల ఆదాయం సమకూరింది. నిత్యాన్నదాన పథకంలో సుమారు 4 వేల మంది భక్తులు సత్యదేవుని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. సత్యదేవుని ప్రాకార సేవ ఆలయంలో ఘనంగా నిర్వహించారు. రత్నగిరిపై ఉత్తరాది భక్తుల సందడి ఇంకా కొనసాగుతోంది. ఏటా వీరు నవంబర్ నుంచి జనవరి వరకూ మాత్రమే వచ్చేవారు. ఈసారి మార్చి నెల వచ్చినా వస్తూనే ఉన్నారు. వారు వస్తున్న టూరిస్టు బస్సులతో కొండ దిగువన కళాశాల మైదానం నిండిపోతోంది.
శానిటరీ సమస్యకు
తాత్కాలిక పరిష్కారం
అన్నవరం: రత్నగిరిపై శానిటరీ సమస్య తాత్కాలికంగా పరిష్కారమైంది. దేవస్థానానికి అవసరమైన పారిశుధ్య సిబ్బంది సరఫరాకు గుంటూరుకు చెందిన కనకదుర్గా ఏజెన్సీతో ఒప్పందం కుదిరింది. దేవస్థానంలోని అన్ని విభాగాలు, సత్రాలు, ఆలయ ప్రాకారం, వ్రత మండపాలు, టాయిలెట్లు తదితర చోట్ల మొత్తం 349 మంది సిబ్బంది సేవలందించనున్నారు. వీరికి కనీస వేతన చట్టం ప్రకారం వేతనాలు చెల్లించేందుకు అంగీకారం కుదిరిందని దేవస్థానం శానిటరీ ఇన్‌స్పెక్టర్ వేంకటేశ్వరరావు తెలిపారు. వీరికి సంబంధిత ఏజెన్సీ ద్వారా నెలకు సుమారు రూ.52 లక్షల మేర వేతనాలు చెల్లించనున్నారు. శనివారం నుంచే ఇది అమలులోకి వచ్చింది. రెండేళ్లుగా దేవస్థానంలో హైదరాబాద్‌కు చెందిన కేఎల్‌టీఎస్ సంస్థ శానిటరీ పనులు చేస్తోంది. ఆ సంస్థ గడువు గత నవంబర్‌తోనే ముగియగా, నూతన సంస్థను ఎంపిక చేసేంత వరకూ కొనసాగాలని దేవస్థానం కోరింది. దీంతో గత నెలాఖరు వరకూ ఆ సంస్థ సిబ్బంది విధులు నిర్వహించారు. ఈ నెల ఒకటి నుంచి ఆ పనులు నిర్వహించలేమని ఆ సంస్థ దేవస్థానానికి లేఖ రాయడంతో దేవదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్రమోహన్ ఆదేశాలతో తాత్కాలికంగా శానిటరీ సిబ్బందిని సరఫరా చేసే పనిని గుంటూరు కనకదుర్గా ఏజెన్సీకి అప్పజెప్పారు. ఫినాయిల్, యాసిడ్, లిక్విడ్స్, ఇతర శానిటరీ సామగ్రిని టెండర్ ద్వారా దేవస్థానం కొనుగోలు చేయనుంది. ఆలయ ఆవరణ కడగడానికి మెషీన్లు, వాషింగ్ మెషీన్లను కూడా కొత్త టెండర్‌దారు వచ్చేంత వరకూ కేఎల్‌టీఎస్ సంస్థవే ఉపయోగించనున్నారు. త్వరలో రాష్ట్రంలోని అన్ని దేవస్థానాలకు ఉమ్మడిగా శానిటేషన్ టెండర్ పిలవనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment