ఎల్లారెడ్డిలో ఎవరు? : పోటీకి సై అంటున్న మరికొందరు.. | - | Sakshi
Sakshi News home page

ఎల్లారెడ్డిలో ఎవరు? : పోటీకి సై అంటున్న మరికొందరు..

Published Mon, Jul 24 2023 12:22 AM | Last Updated on Wed, Jul 26 2023 5:38 PM

వడ్డెపల్లి సుభాష్‌రెడ్డి - Sakshi

వడ్డెపల్లి సుభాష్‌రెడ్డి

ఎన్నికల నోటిఫికేషన్‌ రాకముందే ఎల్లారెడ్డి నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కింది. ఎలక్షన్‌ బరిలో నిలవాలని యోచిస్తున్న పలువురు నేతలు.. నిత్యం జనం మధ్య ఉంటున్నారు. పార్టీ కార్యక్రమాలతో క్యాడర్‌లో జోష్‌ను నింపేందుకు యత్నిస్తూనే.. టికెట్టు కోసం ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు.

సాక్షి, కామారెడ్డి : జిల్లా రాజకీయాల్లో ఎల్లారెడ్డి నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉంది. ప్రతిసారి ఎన్నికల్లో రెండు, మూడు కొత్త ముఖాలు కనిపిస్తుంటాయి. యువతను వెంటేసుకుని గ్రామాలను చుట్టేస్తుంటారు. ప్రధాన పార్టీల నుంచి పాత వారితో పాటు కొత్తవారూ టికెట్లు ఆశించి ప్రయత్నాలు చేస్తారు. పార్టీ టికెట్టు వస్తే సరి.. లేదంటే తిరుగుబాటు జెండా ఎగరేయడానికీ వెనకాడరు. లేదంటే బిచాణా ఎత్తేస్తుంటారు.

ప్రస్తుతం ఒక్కో పార్టీలో ఇద్దరు, ముగ్గురు టికెట్టు ఆశిస్తూ నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. సేవా కార్యక్రమాలతో కొందరు, ప్రజా సమస్యలే ఎజెండాగా ఇంకొందరు తిరుగుతున్నారు. నియోజకవర్గంలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే జాజాల సురేందర్‌, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డితో పాటు వివిధ పార్టీల నేతలు బాణాల లక్ష్మారెడ్డి, వడ్డెపల్లి సుభాష్‌రెడ్డి, కలకుంట్ల మదన్‌మోహన్‌రావ్‌, నిజ్జెన రమేశ్‌, జమునా రాథోడ్‌, కృష్ణారెడ్డిలతో పాటు మరికొందరు ఎన్నికల బరిలో నిలిచేందుకు ఉవ్విళ్లూరుతున్నారు.

కాంగ్రెస్‌లో పోటాపోటీ..

ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీకి బలమై న క్యాడర్‌ ఉంది. 2018 లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా సు రేందర్‌ విజయం సాధించారు. అనంతరం ఆయన బీఆర్‌ఎస్‌ కండువా కప్పుకున్నారు. నియోజకవర్గంలో ప్రస్తుతం పీసీసీ ప్రధాన కార్యదర్శి వడ్డెపల్లి సు భాష్‌రెడ్డి, పీసీసీ ఉపాధ్యక్షుడు మదన్‌మోహన్‌రావు టికెట్టు కోసం పోటీపడుతున్నారు. ఇరువురూ ఎవరికి వారే పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్నారు. అలాగే పోటీపడి సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. పార్టీ టికెట్టు కోసం ఇద్దరి మధ్య తీవ్ర పోటీ నెలకొంది. దీంతో నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే జనార్దన్‌గౌడ్‌ కొంత కాలంగా సైలెంట్‌గా ఉంటున్నారు.

బీజేపీలో ముగ్గురు..

బీజేపీ నుంచి పోటీ చేయడానికి పలువురు ఆసక్తి చూపుతున్నారు. రెండేళ్ల క్రితం కమలం గూటికి చేరిన మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డికి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో అనుచరులున్నారు. అయితే ఇటీవల తన అనుచరులు కొందరు ఇతర పార్టీల్లో చేరారు. కాగా రవీందర్‌రెడ్డి కూడా బీజేపీలో ఇమడలేకపోతున్నారని, కాంగ్రెస్‌ గూటికి వెళతారని ప్రచారం జరుగుతోంది. ఆయన ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి గైర్హాజరవడం, పార్టీ కార్యక్రమాల్లోనూ పాల్గొనకపోవడం దీనికి బలం చేకూరుస్తోంది. ఒకవేళ ఆయన బీజేపీలో కొనసాగితే ఆ పార్టీ టికెట్టు రేసులో ముందుంటారు. ఎల్లారెడ్డి టికెట్టును బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు బాణాల లక్ష్మారెడ్డి కూడా ఆశిస్తున్నారు. ఆయన గత ఎన్నికలలో పోటీ చేశారు. నియోజకవర్గంలో తరచూ పర్యటిస్తున్నారు. మరోనేత పైలా కృష్ణారెడ్డి కూడా ఎన్నికల బరిలో నిలవడానికి ఉత్సాహం చూపుతున్నారు.

తెలంగాణ జన సమితి నుంచి...

ఓయూ జేఏసీ నాయకుడిగా తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న విద్యార్థి నాయకుడు నిజ్జెన రమేశ్‌ ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి తెలంగాణ జన సమితి అభ్యర్థిగా పోటీ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఆయన నియోజకవర్గంలో తిరుగుతున్నారు. ప్రొఫెసర్‌ కోదండరాంతో కలిసి పలు కార్యక్రమాలు చేపట్టారు. వడగళ్లతో పంట నష్టపోయిన రైతులను పరామర్శించడంతో పాటు వారిని ఆదుకోవాలని ప్రభుత్వానికి నివేదిక అందించారు.

అధికార పార్టీలో సిట్టింగ్‌కే అవకాశం?

జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ ఎ.సంపత్‌గౌడ్‌ ఎల్లారెడ్డి నుంచి ఎన్నికల బరిలో దిగుతానంటున్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన సంపత్‌గౌడ్‌ కొంత కాలంగా ఆ పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. ఏదో ఒక పార్టీ నుంచి పోటీ చేయాలని ఆయన పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. అవసరమైతే స్వతంత్రంగా బరిలోకి దిగాలని యోచిస్తున్నారు. వైఎస్సార్‌ తెలంగాణ పార్టీలో చేరిన జమునా రాథోడ్‌ ఆ పార్టీ నుంచి పోటీలో ఉంటారని భావిస్తున్నారు. మరికొందరి పేర్లు సైతం ప్రచారంలో ఉన్నాయి. ఇలా ఆయా పార్టీల టికెట్టు ఆశిస్తున్న పలువురు నేతలు నిత్యం ప్రజల మధ్య ఉంటుండడంతో ఎల్లారెడ్డి నియోజకవర్గంలో సందడి కనిపిస్తోంది.

బీఆర్‌ఎస్‌లో సిట్టింగ్‌ ఎమ్మెల్యే జాజాల సురేందర్‌కే తిరిగి టికెట్టు వస్తుందని భావిస్తున్నారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసి గెలిచిన సురేందర్‌.. నియోజకవర్గం మీద పట్టు సాధించారు. నియోజకవర్గంలో ఎన్నో ఏళ్లుగా ప్రజల్ని ఇబ్బందులు పెట్టిన గతుకుల రోడ్లు సురేందర్‌ హయంలో చాలావరకు బాగయ్యా యి. ఆయన అన్ని మండలాల్లో పర్యటిస్తూ అందరితో సన్నిహిత సంబంధాలు నెరపుతున్నా రు. మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, ఎమ్మెల్సీ కవితలతో సురేందర్‌ సన్నిహిత సంబంధాలు పెట్టుకుని నియోజకవర్గ అభివృద్ధికి ఎక్కువ నిధులు సాధించే ప్రయత్నం చేస్తున్నారు. పలువురు ద్వితీయ శ్రేణి నేతలూ టికెట్టు ఆశిస్తున్నా.. ఆ పార్టీ అధిష్టానం సిట్టింగ్‌ ఎమ్మెల్యే వైపే మొగ్గు చూపే అవకాశాలున్నాయి.

బాణాల లక్ష్మారెడ్డి1
1/4

బాణాల లక్ష్మారెడ్డి

సంపత్‌గౌడ్‌ 2
2/4

సంపత్‌గౌడ్‌

నిజ్జెన రమేశ్‌ 3
3/4

నిజ్జెన రమేశ్‌

మదన్‌మోహన్‌ 4
4/4

మదన్‌మోహన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement