కరీంనగర్ కార్పొరేషన్: ‘ఇది నా డివిజన్...ఎవడ్రా ఈ డివిజన్‌లకు వచ్చి పనులు చేసేది. నాకు తెలియకుండా...నన్ను కలవకుండా పనులు చేస్తర? ఎట్ల చేస్తారో చూస్తా’ అంటూ ఓ మహిళా కార్పొరేటర్ భర్త కాంట్రాక్ట్ సంస్థ సిబ్బందిపై విరుచుకుపడ్డారు. పత్రికల్లో రాయలేని భాషలో దూషిస్తూ... సిబ్బందిని ఫోన్‌లో బెదిరించారు. కార్పొరేటర్ భర్తకు ఇంతగా కోపం రావడానికి... సిబ్బంది చేసిన తప్పేంటనుకుంటున్నారా? కాంట్రాక్ట్ సంస్థకు వచ్చిన పనులను ఆ డివిజన్‌లో చేపట్టేందుకు సిద్ధమవడమే.
నగరంలో కార్పొరేటర్ ట్యాక్స్ ఆగడాలు శృతి మించుతున్నాయి. తమ డివిజన్‌లలో ఇల్లు, అపార్ట్‌మెంట్, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాలతో పాటు, ఏ అభివృద్ధి పనులు జరిగినా.. తమ వాటా ఇవ్వాల్సిందేనని పేర్కొంటున్నారు. లేదంటే పనులను ఎలాగైనా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. బెదిరింపులకు సైతం తెగిస్తున్నారు. సదరు కార్పొరేటర్ భర్త గతంలోనూ పలు దుకాణసముదాయాల నిర్మాణ సమయంలో లక్షల రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి.
పనుల స్థాయిని బట్టి తనకు రావాల్సిన ‘సీ’ ట్యాక్స్(కార్పొరేటర్ ట్యాక్స్)ను ముక్కుపిండి వసూలు చేస్తారనే పేరున్న ఆయన, బెదిరింపులకు దిగుతున్నారు. ఇదిఇలాఉంటే కార్పొరేటర్ భర్త వ్యవహారాన్ని కాంట్రాక్ట్ సంస్థ సిబ్బంది మేయర్ సునీల్‌రావు దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment