జగిత్యాలక్రైం: వస్త్రవ్యాపారంలో నష్టాలు రావడం, పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పులకు వడ్డీలు చెల్లించే పరిస్థితి లేకపోవడంతో మనస్తాపం చెందిన జగిత్యాల జిల్లా కేంద్రంలోని కృష్ణానగర్‌కు చెందిన హోల్‌సేల్ వ్యాపారి గాజుల నరహరి(55) మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. నరహరి పట్టణంలో హోల్‌సేల్ వ్యాపారి. దందా బాగా సాగేందుకు బ్యాంక్‌లో కొంత రుణం తీసుకున్నాడు. తెలిసినవాళ్ల వద్ద మరికొంత అప్పు చేశాడు. అయితే, వ్యాపారంలో ఆశించిన లాభాలు రాకపోవడం, తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరిగిపోవడం, వాటిని తీర్చేదారిలేకపోవడంతో ఆయన తీవ్రమనస్తాపానికి గురయ్యాడు.
ఈక్రమంలో ఉదయం పట్టణంలోని జగిత్యాల క్లబ్‌కు వెళ్లాడు. ఇంటినుంచి తెచ్చుకున్న తాడును సీలింగ్ ఫ్యాన్‌కు కట్టి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పులకు వడ్డీ కట్టలేక, ఆర్థిక ఇబ్బందులు వెంటాడడంతో ఆత్మహత్య చేసుకుంటున్నానని, తనను క్షమించండని రాసిన లేఖ మృతుడి జేబులో లభించింది. కాగా, క్లబ్ స్వీపర్ గదులు శుభ్రం చేస్తుండగా నరహరి సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు.
దీంతో ఆయన కుటుంబసభ్యులతోపాటు, క్లబ్ సెక్రటరీ నారాయణరెడ్డికి సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న పట్టణ సీఐ నటేశ్ సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుమారుడు సచిన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. మృతుడికి భార్య ఉంది. కూతురు అమెరికాలో ఉంటోంది. దీంతో అంత్యక్రియలు నిర్వహించేందుకు జాప్యమయ్యే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment