ఇవి తిన్నారంటే చాలా డేంజర్‌.. ఎందుకంటే? | - | Sakshi
Sakshi News home page

ఇవి తిన్నారంటే చాలా డేంజర్‌.. ఎందుకంటే?

Published Fri, Aug 11 2023 7:22 AM | Last Updated on Fri, Aug 11 2023 8:57 AM

- - Sakshi

కరీంనగర్‌: ప్రజారోగ్యానికి పారిశుధ్యం ఎంత ముఖ్యమో.. తినే పదార్థాలు శుచిగా ఉండాలనేది అంతే ముఖ్యం. కానీ కరీంనగర్‌లో రోడ్డు పక్కన ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లే కాదు.. ఎక్కువ శాతం హోటళ్లలోనూ శుచీ, శుభ్రత, సరఫరా చేసే ఆహారపదార్థాల నాణ్యత దారుణంగా ఉంటోంది. కల్తీ మయంగా మారిన ఈ పరిస్థితిని నివారించేందుకు కొరడా ఝళిపించాల్సిన ఆహార తనిఖీ అధికారులు మొద్దు నిద్ర పోతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

ఏడాదికి ఒకసారో.. రెండుసార్లో మొక్కుబడిగా హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లపై దాడులు చేస్తూ ఒకటి రెండు కేసులు నమోదు చేస్తూ మమ అనిపిస్తున్నారు. ఆహార పదార్థాల శాంపిళ్లను సేకరించి ప్రయోగశాలలకు పంపి ఇక తమ పని అంత వరకేనన్నట్లుగా వ్యవహరించడం విస్మయాన్ని కలిగిస్తోంది.

ఇలా జరిగింది..
సరదాగా కుటుంబ సభ్యులతో బయటకు వెళ్లిన తిరుపతి చికెన్‌ మంచూరియా కోసం నగరంలోని ఓ ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌ వద్దకు వెళ్లారు. అక్కడ సుష్టుగా తిని ఇంటికి వచ్చారు. కొద్ది సేపటికే వాంతులు, విరోచనాలు మొదలయ్యాయి. వెంటనే ఆసుపత్రికి వెళ్తే ఫుడ్‌ పాయిజనింగ్‌ వల్ల ఇలా జరిగిందని వైద్యులు తేల్చారు.

కృష్ణకుమార్‌ పుట్టిన రోజు అని సరదాగా ఫ్రెండ్స్‌తో కలిసి రోడ్డు పక్కన ఫాస్ట్‌ సెంటర్‌ వద్ద చికెన్‌ ఫ్రైడ్‌ రైస్‌ తిన్నారు. మరుసటి రోజు కడపునొప్పి రావడం, కొద్ది సేపటికే విరోచనాలు మొదలవడంతో నీరసించిపోయాడు. కుటుంబ సభ్యులు గమనించి ఆసుపత్రిలో చేర్పించగా ఫుడ్‌ పాయిజన్‌ అని చెప్పి వైద్యులు చికిత్స అందించారు.

హోటల్‌ పెట్టాలంటే..
గతంలో హోటల్‌ పెట్టాలంటే కార్పొరేషన్‌ ఇచ్చే ట్రేడ్‌ లైసెన్సుకు తోడు వివిధ రకాల అనుమతులు పొందాల్సి వచ్చేది. మారిన పరిస్థితులు, నిబంధనల దృష్ట్యా ట్రేడ్‌, ఫుడ్‌ లైసెన్సులు పొందితే చాలు.

ఇవీ ప్రమాణాలు
► వంట కోసం ఉపయోగించే నూనెను ఒకసారి కంటే ఎక్కువ వాడరాదు.

► వండిన పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్రిజ్‌లలో నిల్వచేయొద్దు.

► తాగునీటికి తప్పనిసరిగా ఫిల్టర్‌ వినియోగించాలి.

► కుళ్లిన పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లోనూ వినియోగదారుడికి సరఫరా చేయరాదు.

► కోడి, మేక మాంసంలను ఒకేచోట పెట్టరాదు. పదార్థాలను సరైన వాతావరణంలో నిల్వ ఉంచాలి.

► వంటగది శుభ్రంగా ఉంచుకోవాలి. మురుగునీటి వ్యవస్థ చుట్టుపక్కల ఉండరాదు.

తనిఖీలతో సరి
హోటళ్లు, ఫాస్ట్‌సెంటర్లు, బేకరీలు.. ఇతర సంస్థలపై అప్పుడప్పుడు అధికారులు తనిఖీలు చేస్తున్నా వాటి యాజమాన్యాల తీరులో మార్పు ఉండటం లేదు. అపరిశుభ్ర పదార్థాలను సరఫరా చేస్తూనే ఉన్నారు. కారణం.. తనిఖీలు చేసినా అంతగా ఇబ్బంది పెట్టే చర్యలు ఉండవన్న ధీమా వారిలో నెలకొంది. పూర్తిస్థాయిలో ఆయా సంస్థలపై కఠిన చర్యలు తీసుకున్న ఉదంతాలు మచ్చుకై నా లేవు. హెచ్చరికలు, ట్రేడ్‌ లైసెన్సులను ఉపసంహరించడం వంటి చర్యలతో సరిపెడుతున్నారు.

స్కిన్‌ అలర్జీలు వస్తాయి..
కల్తీ నూనెలు, కల్తీ వస్తువులతో చేసే ఫాస్ట్‌, జంక్‌ ఫుడ్‌ తినడం వల్ల స్కిన్‌ అలర్జీలు ఎక్కువగా వస్తాయి. కండ్ల వద్ద వాపు, పెదాలు వాపు రావడం, అక్కడితో ఆగకుండా గొంతు వాపు వస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో అత్యవసరంగా చికిత్స అందించాల్సి ఉంటుంది. – డాక్టర్‌ రాచకొండ రమేశ్‌, చర్మ వ్యాధి నిపుణులు

జంక్‌ ఫుడ్‌తో ప్రమాదం..
హోటల్స్‌, రెస్టారెంట్లు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లలో తినే జంక్‌ఫుడ్‌తో చాలా ప్రమాదాలు ఉన్నాయి. రెగ్యులర్‌గా తినే వారు గ్యాస్‌ట్రబుల్‌, అల్సర్‌ వంటి వ్యాధుల భారినపడుతున్నారు. ఈ మధ్య కాలంలో కేసులు 20 శాతం పైగా పెరిగాయి. సహజసిద్ధమైన ఫుడ్‌ తీసుకోవడం వల్ల ఆరోగ్యం కాపాడుకోవచ్చు. – డాక్టర్‌ అనిల్‌కుమార్‌, జనరల్‌సర్జన్‌

నియంత్రణ ఉండాలి..
ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్ల నిర్వాహకులు ఇష్టారీతిన సెకండ్‌ క్వాలిటీ వస్తువులు, అడ్డగోలుగా కెమికల్స్‌ వాడుతూ ఫుడ్‌ రుచికరంగా తయారుచేస్తున్నారు. దీంతో జనాలు సైతం రుచికి అలవాటు పడి తింటున్నారు. అది తినడం వల్ల తీవ్ర అనారోగ్యానికి గురై ఇబ్బందులు పడుతున్నారు. వాటిపై నియంత్రణ ఉండాలి. – శ్యాంసుందర్‌, కరీంనగర్‌

నిరంతర తనిఖీలు చేపట్టాలి..
ఆహార కల్తీకి పాల్పడుతున్న హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌లపై నిరంతరం తనిఖీలు చేపట్టాలి. రుచి కోసం హానికరమైన కెమికల్స్‌ వాడినట్లు గుర్తిస్తే క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలి. నూనెను ఎక్కువ రోజులు వాడడం వల్ల వివిధ రకాల రోగాలు వస్తున్నాయి. – భాస్కర్‌, కరీంనగర్‌

ఊబకాయులుగా తయారవుతారు..
కల్తీ ఆహారపదార్థాలు, చీజ్‌, బట్టర్‌ వంటివి వాడడం వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోయి ఊబకాయులుగా తయారయ్యే ప్రమాదం ఉంది. మనిషికి ఊబకాయంతో పాటు బ్లడ్‌లో కొవ్వు చేరడం వల్ల రక్తనాళాలు మూసుకుపోతాయి. దీంతో రక్త సరఫరాలో అంతరాయం ఏర్పడి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. – డాక్టర్‌ ఉపేందర్‌రెడ్డి, క్రిటికల్‌కేర్‌ నిపుణులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement