![‘రైతు భరోసా’ వద్దట](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/rithubandhupathakammmm_mr-1739131268-0.jpg.webp?itok=9JQ7k6bb)
‘రైతు భరోసా’ వద్దట
● భూ వివరాలిచ్చేందుకు జిల్లాలోని 13,505 మంది విముఖత ● ప్రభుత్వానికి ఏటా మిగులుతున్నది రూ.13.50 కోట్లు ● రైతుబంధు ప్రారంభం నుంచి లెక్కిస్తే ఈ మొత్తం రూ.162.06 కోట్లు ● వీరంతా బీనామీలా.. సంపన్నులా?
కరీంనగర్ అర్బన్: ‘డబ్బంటే ఎవరికి చేదు’.. మాటల సందర్భాల్లో ప్రస్తావించడం పరిపాటి. కానీ, వీరికి చేదేనట. ప్రభుత్వమే పంట పెట్టుబడి సాయం ఉచితంగా ఇస్తుండగా తమకు వద్దంటూ భూ వివరాలివ్వకపోవడం విస్మయం కలిగిస్తోంది. దీనివల్ల ఏటా ప్రభుత్వానికి రూ.13.50 కోట్లు మిగులుతున్నాయి. పథకం ప్రారంభం నుంచి లెక్కిస్తే ఈ మొత్తం రూ.162.06 కోట్లు. అయితే, డబ్బులొస్తుంటే వద్దంటుండటంతో వీరంతా బినామీలా.. అన్న సందేహం వ్యక్తమవుతోంది.
అవకాశమిచ్చినా దూరమే..
కొత్తగా పట్టాదారు పాసుపుస్తకాలు పొందిన రైతులు రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు గత నెల 31 వరకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. ఏఈవోలు క్షేత్రస్థాయిలో వివరాలు సేకరించగా పలువురు పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్‌కార్డు, బ్యాంకు ఖాతా జిరాక్స్‌లతోపాటు దరఖాస్తు ఫాం అందజేశారు. బ్యాంకు ఖాతాలు, ఇతరత్రా వివరాల్లో మార్పులు చేర్పులకు కొందరు అర్జీ పెట్టుకున్నారు. కరీంనగర్ జిల్లాలో పట్టాదారులు 2,09,450 మంది ఉన్నారు. వీరిలో 13,505 మంది వివరాలిచ్చేందుకు విముఖత చూపారు. వీరిలో కరీంనగర్ రూరల్, హుజూరాబాద్, కొత్తపల్లి, జమ్మికుంట, ఇల్లందకుంట మండలాలకు చెందినవారే ఎక్కువ మంది ఉండగా.. వివరాలెందుకు ఇవ్వడం లేదన్నది వ్యవసాయ శాఖకు పెద్ద ప్రశ్న. 2018 మే 10 నుంచి రైతుబంధు పథకం ప్రారంభమైంది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎకరాకు రూ.5 వేలు ఇవ్వగా.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పేరిట రూ.6 వేలు ఇస్తామని ప్రకటించింది.
అన్ని మండలాల్లో ఉన్నారు..
జిల్లాలో కరీంనగర్ అర్బన్‌తోపాటు 16 మండలాలున్నాయి. అన్ని మండలాల్లోనూ వివరాలివ్వని వారుండటం విశేషం. చిగురుమామిడి మండలంలో 896 మంది, చొప్పదండిలో 736, ఇల్లందకుంటలో 925, గంగాధరలో 711, గన్నేరువరంలో 656, హుజూరాబాద్‌లో 1,540, జమ్మికుంటలో 1,245, కరీంనగర్ అర్బన్‌లో 39, కరీంనగర్ రూరల్‌లో 1,639, కొత్తపల్లిలో 826, మానకొండూరులో 638, రామడుగులో 931, శంకరపట్నంలో 584, తిమ్మాపూర్‌లో 832, సైదాపూర్‌లో 626, వీణవంకలో 681 మంది తమ భూ వివరాలు ఇవ్వలేదు. వ్యవసాయ శాఖ విస్తృత ప్రచారం చేస్తున్నా పెడచెవిన పెడుతుండటం విడ్డూరం. వీరంతా బినామీలా.. సంపన్నులా.. అన్నది సస్పెన్స్.
Comments
Please login to add a commentAdd a comment