రూ.1,439.55 కోట్లు | - | Sakshi
Sakshi News home page

రూ.1,439.55 కోట్లు

Published Tue, Mar 4 2025 12:09 AM | Last Updated on Tue, Mar 4 2025 12:08 AM

రూ.1,

రూ.1,439.55 కోట్లు

ఇసుక

టెండర్‌ ఖరీదు

పూడిక పేరిట మానేరు ‘ఇసుక’ మాయం!

20 ఏళ్లపాటు తోడుకునేందుకు అనుమతులు

ఎల్‌ఎండీ, మధ్యమానేరు జలాశయాల్లో పూడికతీత పేరిట దందా

నీరుండగానే పూడికతీసే పనులకు పర్మిషన్‌

ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక రవాణా పేరిట వేగంగా టెండర్లు

సిరిసిల్ల: తెలంగాణ రాష్ట్రంలోని గోదావరి నదికి ఉపనదిగా ఉన్న మానేరువాగులో పూడిక పేరిట పెద్ద ఎత్తున ఇసుకను తొలగించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఈమేరకు పూడిక పేరిట రూ.1,439.55 కోట్ల విలువైన ఇసుకను తరలించేందుకు నీటిపారుదలశాఖ టెండర్లు పిలిచింది. 20 ఏళ్ల పాటు కరీంనగర్‌ జిల్లాలోని దిగువ మానేరు డ్యాం(ఎల్‌ఎండీ), రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మధ్యమానేరు జలాశయాల్లో నిల్వ ఉన్న నీటిలో నుంచి ఇసుకను, మట్టిని తొలగించే పనులకు శ్రీకారం చుడుతున్నారు. ఈమేరకు ప్రభుత్వ ఖజానాకు రూ.1,439.55 కోట్ల ఆదాయం సమకూరేలా భారీ టెండర్లు పిలిచారు.

నీరుండగానే ఇసుక తొలగింపు

జిల్లాలోని బోయినపల్లి మండలం మాన్వాడ వద్ద ఉన్న మధ్యమానేరు జలాశయంలో ప్రస్తుతం 15 టీఎంసీల నీరు ఉండగా.. కరీంనగర్‌ ఎల్‌ఎండీలో 20 టీఎంసీల నీరుంది. ఈ జలాశయాల్లో నీటి నిల్వ సామర్థ్యాన్ని తగ్గించేందుకు నీటిని దిగువకు వదులుతున్నారు. నీటినిల్వ, తరలింపు, నీటి వాడకానికి ఆటంకాలు ఎదురుకాకుండా జలాశయాల మధ్యలోకి యంత్రాలను పంపించి పూడిక మట్టిని, ఇసుకను, వ్యర్థాలను బయటకు తీసి వడబోసే విధంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో యంత్రాలను వినియోగిస్తారు. మట్టి నుంచి ఇసుకను వేరు వేసి ఇందులో లభించిన ఇసుకను టన్నుకు రూ.406.64 చొప్పున ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. ఈ టెండరును దక్కించుకున్న కాంట్రాక్టర్‌ ప్రభుత్వం నిర్ణయించిన ధరను చెల్లించి ఇసుకను బహిరంగ మార్కెట్‌లో అమ్ముకునే అవకాశం కల్పించారు. నీరు ఉండగానే పూడిక పేరిట ఇసుకను తొలగించి అమ్ముకునే భారీ ప్రణాళికతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది.

మధ్యమానేరులో 247 లక్షల టన్నుల ఇసుక తొలగింపు

నిజానికి మధ్యమానేరు జలాశయాన్ని 2018లో నిర్మించారు. తొలిసారి అప్పుడే నీటిని నిల్వచేశారు. మధ్యమానేరు జలాశయంలో పెద్దగా పూడిక లేదు. ఏడు గ్రామాలు మునిగిపోయి ఉన్నాయి. కానీ ఈ జలాశయంలో 247 లక్షల టన్నుల పూడిక పేరిట ఇసుకను తరలించేందుకు టెండర్లు పిలిచారు. 1985లో నిర్మించిన కరీంనగర్‌ ఎల్‌ఎండీలో 131 లక్షల టన్నుల పూడికను తొలగించాలని నిర్ణయించారు. 20 ఏళ్లపాటు పూడిక, మట్టి, వ్యర్థాలను వెలికితీస్తూ.. ఇసుకను తొలగిస్తూ.. అమ్ముకునే అవకాశాన్ని కాంట్రాక్టర్‌కు నీటిపారుదలశాఖ కల్పించింది. పూడిక పేరిట ఇసుకను భారీ ఎత్తున తరలిస్తే ఆయా ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోయే ప్రమాదం పొంచి ఉంది.

29 జలాశయాల్లో సర్వేలు.. రెండింటిలో పనులు

రాష్ట్ర వ్యాప్తంగా 29 జలాశయాల్లో పూడికతీతకు సర్వే చేశారు. తొలివిడతగా ఎల్‌ఎండీ, మధ్యమానేరు జలాశయాలను ఎంపిక చేశారు. ఈ రెండు ప్రాజెక్టుల్లో పూడికతీత.. ఇసుక అమ్మకాలు విజయవంతమైతే.. నిర్మల్‌ జిల్లా కడెంతోపాటు ఎల్లంపల్లి జలాశయంలోనూ పూడికతీతకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ జలాశయాల్లో నాణ్యమైన ఇసుక లభిస్తుందని ఇంజినీరింగ్‌ నిపుణులు అంచనా వేశారు. ఈమేరకు ఆధునిక విధానంలో నీరు ఉండగానే పూడికమట్టి, మొరం, ఇసుక తొలగించి వేరు చేసి దేనికదే అమ్మకానికి పెట్టాలని ప్రభుత్వం టెండర్లు పిలిచింది.

ఇందిరమ్మ ఇళ్లకు.. తాగునీటికి ఇబ్బందులు లేకుండా..

పూడిక మట్టి తొలగింపుతో తాగునీటికి ఇబ్బందులు లేకుండా చూడాలని భావిస్తున్నారు. ప్రాజెక్టుల్లో నీటినిల్వ తగ్గినప్పుడు నీరు రంగుమారిపోతుంది. మిషన్‌ భగీరథకు నీటి సరఫరాకు ఇబ్బందులు రాకుండా ప్రాజెక్టుల్లో నీరు ఉండగానే పూడిక తీయాలని భావిస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో భారీగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు చేపడుతుండగా.. పేదల ఇంటి నిర్మాణానికి ఇసుక కొరత లేకుండా చూడాలనే లక్ష్యంతో ఈ టెండర్లు పిలిచినట్లు అధికారులు చెబుతున్నారు. ఇసుక మాఫియాను కట్టడి చేస్తూ అధికారికంగానే నాణ్యమైన ఇసుకను నిర్మాణాలకు అందించాలని భావిస్తున్నారు. ఈమేరకు నీటిపారుదలశాఖ, గనులశాఖ, టీజీఎండీసీ అధికారులు రెండు జలాశయాల్లో రూ.1,439.55 కోట్ల ఇసుక టెండర్లను పిలిచారు. టెండర్లు దక్కించుకున్న బడా కాంట్రాక్టర్లు పని ప్రారంభిస్తే.. భారీ ఎత్తున ఇసుకను అమ్ముకునే అవకాశం ఉంది. ఏది ఏమైనా.. కరీంనగర్‌, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రవహించే మానేరు వాగులో బహిరంగ ఇసుక దోపిడీకి రాజకీయ నేతలు తెరలేపారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారికంగానే టెండర్లు పిలిచి ఇసుక వ్యాపారంతో సహజవనరుల దోపిడీ సాగనుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
రూ.1,439.55 కోట్లు1
1/1

రూ.1,439.55 కోట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement