డివిజన్లు మారుడే!
● ప్రాథమికంగా పూర్తయిన డీలిమిటేషన్ ● ప్రభుత్వానికి నివేదిక అందించిన బల్దియా ● త్వరలో మొదలుకానున్న అధికారిక ప్రక్రియ ● ఆయా డివిజన్ల ఆశావహుల్లో ఉత్కంఠ
కరీంనగర్ కార్పొరేషన్: నగరంలో డివిజన్లు మళ్లీ మారుతున్నాయి. కొత్తగా ఐదు గ్రామపంచాయతీలు, ఒక మున్సిపాలిటీ నగరపాలకసంస్థలో విలీనం కావడంతో డివిజన్ల పునర్విభజన అనివా ర్యమైంది. 60 నుంచి 66 డివిజన్లుగా పునర్విభజిస్తూ నగరపాలకసంస్థ ప్రభుత్వానికి నివేదిక అందించింది. ప్రభుత్వ ఆదేశాల అనంతరం అధికారికంగా ప్రక్రియ మొదలుకానుంది.
మారిన హద్దులు
నగరపాలకసంస్థలో బొమ్మకల్, దుర్శేడ్, గోపాల్‌పూర్, మల్కాపూర్, చింతకుంట గ్రామపంచాయతీలతో పాటు, కొత్తపల్లి మున్సిపాలిటీని విలీనం చేయడం తెలిసిందే. నగరంలో 66 డివిజన్లు కొత్తగా ఏర్పాటు చేస్తూ అధికారులు పునర్విభజన చేశారు. గతంలో మాదిరిగానే మస్కిటోకాయిల్ తరహాలో డివిజన్ల కూర్పు జరిగినట్లు, నగరంలోని అన్ని డివిజన్‌ల సరిహద్దులు మారినట్లు సమాచారం. అయితే అధికారికంగా వివరాలు వెల్లడించడం లేదు.
గోప్యంగా పునర్విభజన
గతంలో పునర్విభజన సందర్భంగా నెలకొన్న పరిణామాల దృష్ట్యా ఈ సారి అధికారులు రాజ కీయ జోక్యానికి దూరంగా అత్యంత గోప్యంగా విభజన చేపట్టారు. నగరపాలకసంస్థ కమిషనర్ చాహత్ బాజ్‌పేయ్ పర్యవేక్షణలో పట్టణ ప్రణాళి క అధికారులు, పాత బిల్‌కలెక్టర్లు, రెవెన్యూ అధి కారులు డివిజన్ల హద్దులు నిర్ణయించారు. పాత డివిజన్లు, ఇంటినంబర్లు, ఓట్లను ప్రామాణికంగా డివిజన్లను పునర్విభజించినట్లు తెలిసింది. ఒక్కో డివిజన్‌కు కనీసం ఐదు వేల ఓట్లు ఉండేలా రూపొందించినట్లు సమాచారం. హైదరాబాద్‌లోని సెంట్రల్ గుడ్ గవర్నెన్స్‌లో ఈ డివిజన్ల విభజనను పూర్తి చేసి, ప్రభుత్వానికి నివేదిక అందించారు. డీలిమిటేషన్‌కు సంబంధించి నోటిఫికేషన్, ముసాయిదా, అభ్యంతరాలు తదితర ప్రక్రియను ప్రభుత్వం చేపట్టాల్సి ఉంది. అధికారిక ప్రక్రియ అనంతరమే డివిజన్ల పునర్విభజనకు ఆమోద ముద్ర పడనుంది.
ఆశావహుల్లో ఉత్కంఠ
డివిజన్‌ల పునర్విభజన రాజకీయంగా ఉత్కంఠను రేపుతోంది. పాలకవర్గం పదవీకాలం ముగియడం, ఎన్నికలు జరగాల్సి ఉండడంతో ఆయా డివిజన్లలో రాజకీయ హడావుడి ఇప్పటికే ఉంది. అయితే డివిజన్‌ల హద్దులు మారుతుండడంతో తాము పోటీచేసే అవకాశాలు, గెలుపోటములపై మాజీ కార్పొరేటర్లు, ఆశావహులు లెక్కలు వేసుకుంటున్నారు. కొత్తగా డివిజన్ల ఏర్పాటు ఆయా కార్పొరేటర్ స్థానాల రిజర్వేషన్‌లను ప్రభావితం చేసే అవకాశం ఉండడంతో, పునర్విభజన ప్రాధాన్యం సంతరించుకొంది. అధికారిక ప్రక్రియ మొదలు కావాల్సి ఉన్నా, ఇప్పటికే ప్రాథమికంగా 66 డివిజన్ల జాబితాను రూపొందించడంతో పునర్విభజనకు కీలక అడుగు పడింది.
Comments
Please login to add a commentAdd a comment