జగిత్యాలజోన్: విద్యార్థినిని ప్రేమించాలని వేధించి.. ఆమె మృతికి కారణమైన వ్యక్తికి మూడేళ్ల జైలు, రూ.3 వేల జరిమానా విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి, పోక్సో కోర్టు ఇన్‌చార్జి జడ్జి జి.నీలిమ బుధవారం తీర్పు చెప్పారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ సీహెచ్. రామకృష్ణారావు కథనం ప్రకారం.. పెగడపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన రైతు వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఆయనకు కొడుకు, కూతురు సంతానం. తొమ్మిదో తరగతి చదువుతున్న ఆమె 2022 ఏప్రిల్ ఒకటో తేదీన స్నేహితురాలి వద్ద చదువుకుంటానని చెప్పి వెళ్లిన బాలిక కాసేపటికి ఇంటికి చేరుకుంది. ఇంటి వెనుక వైపు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు ఇంటి పరిసరాల్లో వెదకగా.. తాను పురుగుల మందు తాగానని చెప్పింది. వెంటనే ఆమెను కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మరుసటి రోజు చనిపోయింది. తన కూతురు మరణానికి పెగడపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఎట్టం రవి కారణమని, స్కూల్‌కు వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడు తన కూతురును ప్రేమించాలని వేధించడంతోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుందని తండ్రి పెగడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అప్పటి ఎస్సై శ్వేత కేసు నమోదు చేశారు. కోర్టు మానిటరింగ్ అధికారులు కిరణ్‌కుమార్, డి.శ్రీధర్, కేవీ.సాగర్ సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టడంతో ఎట్టం రవికి మూడేళ్ల జైలు, రూ.3 వేల జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment