20 ఏళ్లుగా చోరీలు.. 36 కేసులు
పెద్దపల్లిరూరల్: జల్సాలకు అలవాటు పడి దొంగతనాలనే వృత్తిగా ఎంచుకున్నాడు. పల్సర్ బండిపై పల్లెటూళ్లలో తిరుగుతూ తాళం వేసిన, మనుషులు లేని ఇళ్లను ఎంచుకుని పట్టపగలే చోరీలకు పాల్పడ్డ బోరిగం సంపత్‌ను అరెస్టు చేసినట్లు ఏసీపీ గజ్జి కృష్ణ తెలిపారు. గురువారం తన కార్యాలయంలో సుల్తానాబాద్ సీఐ సుబ్బారెడ్డి, కాల్వశ్రీరాంపూర్ ఎస్సై వెంకటేశ్‌తో కలిసి వివరాలు వెల్లడించారు. భూపాలపల్లి జిల్లా మల్హర్‌రావు మండలం రెడ్డిపల్లెకు చెందిన బోరిగం సంపత్ హోటల్‌లో పనిచేసేవాడు. జల్సాలకు అవసరమైన ఖర్చులకోసం 2005 నుంచి దొంగతనాలకు పాల్పడుతున్నాడు.
పలు జిల్లాలో 36 కేసులు నమోదు
దాదాపు 20 ఏళ్లుగా దొంగతనాలకు పాల్పడుతున్న సంపత్‌పై ఇప్పటికే 36 కేసులు పలు జిల్లాల్లో నమోదయ్యాయి. గోదావరిఖని, మంచిర్యాల, కరీంనగర్, హైదరాబాద్, వరంగల్, హనుమకొండ, మంథని, కొయ్యూరు, రామకృష్ణాపూర్, హసన్‌పర్తి, స్టేషన్‌ఘన్‌పూర్ ఏరియాల్లో చోరీలకు పాల్పడ్డాడు. ఇటీవల కాల్వశ్రీరాంపూర్ మండలం చిన్నరాతుపల్లిలో మద్దెల శాంతమ్మ ఇంటికి తాళం వేయకుండా పక్కనే ఉన్న ఇంట్లో శుభకార్యానికి వెళ్లి వచ్చేలోగా సంపత్ ఇంట్లో చొరబడి బంగారం ఎత్తుకెళ్లాడు. పోలీసులు చేపట్టిన తనిఖీలలో గురువారం పోలీసులకు చిక్కాడు.
రూ.15.47లక్షల సొత్తు స్వాధీనం
పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడిన బోరిగం సంపత్ నుంచి రూ.2,25,000 నగదు, 149.34 గ్రాముల బంగారం (రూ.13,22,108 విలువ గలది) స్వాధీనం చేసుకున్నారు. అలాగే ధర్మారం, గోదావరిఖని టూటౌన్, పొత్కపల్లి, హాజీపూర్, కాల్వశ్రీరాంపూర్, జూలపల్లి, సుల్తానాబాద్ మండలాల పరిధిలో దొంగతనాలకు పాల్పడినట్లు సంపత్ అంగీకరించాడు. కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తున్నట్లు ఏసీపీ తెలిపారు.
నిఘా పెంచాం
పెద్దపల్లి ప్రాంతంలో చోరీలు, అసాంఘిక కార్యకలా పాలపై నిఘా పెంచామని ఏసీపీ పేర్కొన్నారు. ఏఐ సాంకేతికతతో పలు ప్రాంతాల్లో హిడెన్ కెమెరాలు కూడా ఏర్పాటు చేశామని వెల్లడించారు. ప్రజలు అ ప్రమత్తంగా ఉంటూ అపరిచితులు, గుర్తు తెలియని వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపిస్తే తమకు సమాచారం అందించాలన్నారు. చోరీకి పాల్పడిన సంపత్‌ను పట్టుకున్న సీఐ సుబ్బారెడ్డి, ఎస్సై వెంకటేశ్, ఏఎస్‌ఐ తిరుపతితో పాటు అశోక్, లక్ష్మణ్, సుమన్, వినుస్తర్, రవీందర్, ప్రభాకర్, రమేశ్, రాజు, రాజ్‌కుమార్, ఫింగర్‌ప్రింట్ బృందం, సీడీఆర్ బృందం సిబ్బందిని ఏసీపీ అభినందించారు.
తాళం వేసిన ఇళ్లే టార్గెట్
నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
వివరాలు వెల్లడించిన ఏసీపీ కృష్ణ
Comments
Please login to add a commentAdd a comment