గంటపాటు అంబులెన్స్‌లోనే రోగి | - | Sakshi
Sakshi News home page

గంటపాటు అంబులెన్స్‌లోనే రోగి

Published Fri, Mar 7 2025 9:43 AM | Last Updated on Fri, Mar 7 2025 9:38 AM

గంటపాటు    అంబులెన్స్‌లోనే రోగి

గంటపాటు అంబులెన్స్‌లోనే రోగి

జగిత్యాల: జిల్లాకేంద్రానికి చెందిన అశోక్‌ పక్షవాతం బారిన పడగా అంబులెన్స్‌లో గురువారం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చారు. అయితే వైద్యుల నిర్లక్ష్యంతో గంటపాటు అంబులెన్స్‌లోనే నిరీక్షించాల్సిన వచ్చింది. అశోక్‌ చిరువ్యాపారి. ఇంటివద్ద ఉన్నట్టుండి కింద పడిపోవడంతో కుటుంబ సభ్యులు 108లో ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆస్పత్రి సిబ్బంది ఎంతకూ స్ట్రెచర్‌ తీసుకురాకపోవడంతో దాదాపు గంటపాటు అంబులెన్స్‌లో ఉండాల్సి వచ్చింది. వైద్యులను కుటుంబ సభ్యులు వేడుకోవడంతో చికిత్స కోసం తీసుకెళ్లారు.

పులి జాడ దొరకలే..

ముత్తారం(మంథని): ముత్తారం మండలం మచ్చుపేట భగుళ్లగుట్టలో పెద్దపులి సంచరించినట్లు అటవీశాఖ అధికారులు గుర్తించిన విషయం తెలిసిందే. ఐదురోజులుగా ముత్తారం మండలం అడవిశ్రీరాంపూర్‌, పారుపల్లి, సర్వారం, మైదంబండ, మచ్చుపేట అటవీ, మానేరు తీరం, చెరువులు, పొలాల వెంబడి పెద్దపులి వెళ్లినట్లు అటవీశాఖ అధికారులు నిర్ధారించారు. గురువారం మచ్చుపేట భగుళ్లగుట్ట అటవీప్రాంతంలో తిరిగిన అధికారులకు ఏలాంటి ఆధారాలు లభించలేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అడవిని జల్లెడ పట్టినా పులి జాడ దొరక్క పోవడంతో నిరుత్సాహానికి గురయ్యారు. ఎండాకాలం కావడంతో పులి భగుళ్లగుట్టలోనే ఉందా లేదా ఇతర ప్రాంతానికి వెళ్లిందా అనే విషయం తెలుసుకోవడం కష్టంగా ఉందని అటవీశాఖ అధికారులు తల పట్టుకుంటున్నారు. కాగా పులి కదలికలు దొరికే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు.

హత్యకేసులో ముగ్గురి అరెస్ట్‌

జగిత్యాలక్రైం: జగిత్యాల రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధి టీఆర్‌నగర్‌కు చెందిన షేక్‌ రఫీ(28) ఈనెల ఒకటిన గ్రామ శివారులోని ఎస్సారెస్పీ కాలువ వద్ద అనుమానాస్పదంగా మృతిచెందిన విషయం తెల్సిందే. రఫీ మృతిపై అనుమానం ఉందని అతని తండ్రి షేక్‌ రజాక్‌ పోలీసులకు ఫిర్యాదు చేసాడు. విచారణ చేపట్టిన రూరల్‌ ఇన్‌చార్జీ సీఐ నీలం రవి టీఆర్‌నగర్‌కు చెందిన మహ్మద్‌ రంజానీ అలియాస్‌ రంజు, షేక్‌ మహ్మద్‌, షేక్‌ షాదప్‌లను నిందితులుగా గుర్తించి అరెస్ట్‌ చేశారు. వారిని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. రూరల్‌ ఎస్సై సదాకర్‌ పాల్గొన్నారు.

బుగ్గగుట్ట అటవీప్రాంతంలో మంటలు

పాలకుర్తి(రామగుండం): బసంత్‌నగర్‌ బస్టాండ్‌ నుంచి ఈసాలతక్కళ్ళపల్లి గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న బుగ్గగుట్ట అటవీప్రాంతంలో గురువారం ప్రమాదవశాత్తు మంటలు అంటుకుని వ్యాపించాయి. విషయం తెలుసుకున్న ఫారెస్టు అధికారులు, స్థానిక అల్ట్రాటెక్‌ సిమెంట్‌ కంపెనీ సెఫ్టీ అధికారులు వాటర్‌ట్యాంకర్‌ల ద్వారా నీటిని చల్లించి మంటలను అదుపుచేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement