సమగ్ర భూ సర్వేకు కసరత్తు
● సబ్ డివిజన్లు చేసేందుకు సర్వేయర్లకు అధికారం ● అక్కడికక్కడే మ్యాప్ అందజేత ● భూ రికార్డులు సిద్ధం చేస్తున్న ప్రభుత్వ యంత్రాంగం
చిరిగిన దస్త్రాలకు చెల్లుచీటి
కరీంనగర్ అర్బన్: భూ ఆక్రమణదారులు, భూ పంచాయితీల పేరుతో పబ్బం గడుపుకునేవారికి ఇది చేదువార్తే. భూమి గెట్లు జరుపుతూ పక్క రైతుల భూములను కలుపుకోవడం, గతంలో నాటిన హద్దులను జరిపి ఇబ్బందులకు గురిచేసే వితండవాదులకు శుభం కార్డు పడనుంది. హద్దులు, భూ రికార్డుల సమస్య లేకుండా చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. గత ప్రభుత్వంలోనే భూ సర్వేకు అడుగులు పడగా అంతలోనే ఆగిపోయింది. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం భూ సర్వేకు ప్రాధాన్యతనిస్తుండటంతో రైతుల్లో ఆఽశలు రేకెత్తుతున్నాయి. భూ రికార్డులను సిద్ధంగా ఉంచాలన్న ప్రభుత్వం ఆదేఽశం క్రమంలో అధికారులు తదనుగుణ చర్యలు చేపట్టారు. భూ రికార్డుల ప్రక్షాళనతో పాటు సబ్‌డివిజన్లు చేసేందుకు చర్యలు చేపడుతోంది. ఇదే జరిగితే నిత్యం భూ సమస్యలు, రికార్డుల కొరకు కార్యాలయాల చుట్టు తిరిగే రైతన్నకు ఇక తిప్పలు ఉండవు.
భూ సర్వేతో చిక్కులకు చెక్
సాగు భూములతో పాటు నివాస స్థలాలను ప్రతీ ఇంచు కొలువనున్నారు. జిల్లాలో పోలీస్‌స్టేషన్లు, సర్వే లాండ్ రికార్డుశాఖలకు ఈ దరఖాస్తులే ఎక్కువ. అయితే గతంలో పైలట్ ప్రాజెక్టుగా మండలానికో గ్రామాన్ని ఎంపిక చేసి భూ సర్వే చేయాలని నిర్ణయించారు. నిజామాబాద్ జిల్లాలో భూ భారతి కార్యక్రమం నిర్వహించగా అంతగా సత్ఫలితాలివ్వకపోవడంతో నిలిపివేశారు. తాజాగా హద్దుల గొడవను సమూలంగా నిర్మూలించేందుకు భూ సర్వే చేపట్టనున్నారు. సేత్వార్ లేదా కాస్రా లేదా టీపాన్ వంటి వివరాలను సరిచూస్తూ ప్రస్తుతమున్న సర్వే నంబర్లలో ఏమైనా తప్పుగా నమోదయ్యాయా.. విస్తీర్ణం తప్పుగా ఉందా వంటి వివరాలను కార్యాలయ స్థాయిలోనే గతంలోనే సరిచేశారు. తాజాగా ప్రతీ పట్టాదారు భూమికి సర్వే నంబర్‌ను కేటాయించనున్నారని సమాచారం. అంటే సబ్ డివిజన్ చేయనున్నారు.
తొమ్మిది దశాబ్దాల అనంతరం
1910–1930 కాలంలో నిజాం పాలకుల హాయంలో సమగ్ర భూ సర్వే నిర్వహించి రికార్డుల్లో భద్రపరిచారు. అప్పటి నుంచి భూముల సర్వే కానీ రికార్డుల నవీకరణ కానీ జరగలేదు. దీంతో రికార్డులను మాయం చేయడం, హద్దులను తొలగించడం, కబ్జాలకు పాల్పడటం యథేచ్ఛగా సాగుతోంది. అప్పటి గణాంకాల ప్రకారం సాగు భూమి 15,63,025 (6,25,210హెక్టార్లు) ఎకరాలుండగా ప్రస్తుతం 17,55,683 ఎకరాలకు చేరింది. అంటే 2లక్షల ఎకరాల వరకు భూమెక్కడిది. ప్రభుత్వం పంపిణీ చేసిన భూమి ఇంచుమించు లక్ష ఎకరాలు. మిగతా భూమి ఆక్రమణకు గురైనట్లేనని స్పష్టమవుతోంది. అయితే తాజా ప్రకటనతో ఆక్రమణల గుట్టు భారీగా తేలనుందని అర్థమవుతోంది.
డివిజన్ల వారీగా సర్వే వివరాలు
డివిజన్ రైతుల సంఖ్య (1బి ప్రకారం)
కరీంనగర్ 12,242
హుజూరాబాద్ 38,460
మానకొండూరు 39,764
చొప్పదండి 29,624
గతంలో భూ రికార్డుల నవీకరణలో గణాంకాలు
సాగు విస్తీర్ణం: 3,33,450 ఎకరాలు
వ్యవసాయేతర భూమి: 33,007ఎకరాలు
ప్రభుత్వ భూమి: 40,366
వక్ఫ్‌భూములు: 517 ఎకరాలు
అటవీ భూములు: 1,748 ఎకరాలు
ఖాతాల సంఖ్య: 1,92,687
మొత్తం సర్వేనంబర్లు: 3,51,545
ఉమ్మడి జిల్లా విస్తీర్ణం 11,82,300 హెక్టార్లు కాగా అందుకు సంబంధించిన 6 లక్షల టీపాన్లలో 4.30లక్షల టీపాన్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మిగిలిన 1.70లక్షల టీపాన్లు చిరిగిపోయాయి. 1910 కాలంలోని టీపాన్లను కాపాడుతూ వచ్చిన భూ కొలతలు, రికార్డులశాఖ కాలక్రమేణ వాటిని తిరగేస్తూ ఉండటంతో చాలావరకు చిరిగిపోయాయి. ఇక కొందరు కాసులకు కక్కుర్తిపడి రికార్డులను మాయం చేశారన్న విమర్శలున్నాయి. టీపాన్లు బస్తాల్లో కట్టిపెడతారు కొలత సమయంలో అవసరమైన సర్వే నంబర్ టీపాన్ తీసుకుంటారు. ఈ క్రమంలో వాటిని తిరగేసే సమయంలో పాతబడి గుర్తించలేనంతగా మారిపోయాయి. ఉమ్మడి జిల్లాలో సుమారు 50 గ్రామాల వరకు టీపాన్లు సరిగా లేవు. దీంతో దరఖాస్తు చేసుకున్న రైతు భూమికి కొలత వేయడం అధికారులకు తలనొప్పిగా మారేది. దీంతో గ్రామాల్లో భూ వివాదాలు పెరుగుతున్నాయి. భూ విలువ రోజురోజుకు పెరుగుతుండటంతో బలవంతులు బలహీనుల భూములను ఆక్రమించుకోవడం సహా పలు రకాల వివాదాలు పెరిగిపోతున్నాయి.
సమగ్ర భూ సర్వేకు కసరత్తు
Comments
Please login to add a commentAdd a comment