లోకో పైలట్ల అప్రమత్తం.. తప్పిన పెను ప్రమాదం
కరీంనగర్‌రూరల్: కరీంనగర్ రైల్వేస్టేషన్‌లో గ్రానైట్ తర లించే లారీ పట్టాల మధ్యలో ఇరుక్కుపోయింది. అదే సమయంలో గూడ్స్ రైలు అదే లైన్‌లో వస్తోంది. ఎంత హారన్ మోగించినా లారీ తీయకపోవడంతో లోకో పైలట్లు ఎమర్జెన్సీ బ్రేక్ వేసి రైలు ను నిలిపివేశారు. లారీ డ్రైవర్ వాహనాన్ని స్టార్ట్ చేసుకుని వెళ్లిపోయాడు. లోకో పైలట్లు ఎమర్జెన్సీ బ్రేక్ వేయకపోయి ఉంటే ఐదుగురు ప్రాణాలు ప్రమాదంలో పడేవని లోకో పైలట్ రవి, అసిస్టెంట్ లోకో పైలట్ బేగ్ తెలిపారు. ఈ సంఘటనతో 15నిమిషాలు గూడ్స్‌రైలు నిలిచిపోయినట్లు అధికారులు తెలిపారు. లారీ వివరాలు తెలియాల్సి ఉంది. కరీంనగర్ రైల్వేయార్డ్‌లో గ్రానైట్ లారీలు రూల్స్‌కు విరుద్ధంగా తిరుగుతున్నా.. అధికారులు పట్టి పట్టనట్టు వ్యవహరిస్తున్నట్లు లోకో పైలట్లు తెలిపారు. ఈ విషయాన్ని సికింద్రాబాద్ రైల్వే ఉన్నతాధికారులకు తెలియజేస్తామని పేర్కొన్నారు.
రుణమాఫీ కాలేదు.. రైతుబంధు రాలేదు
● ఎమ్మెల్యే సత్యంను నిలదీసిన రైతులు
గంగాధర: ఎమ్మెల్యే సారూ.. మాకు రుణమాఫీ కాలేదు. రైతుబంధు రాలేదు.. ఎప్పుడు మాఫీ అవుతుంది. డబ్బులెప్పుడు పడతాయి.. అంటూ రైతులు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను నిలదీశారు. గంగాధర మండలంలోని గర్శకుర్తి గ్రామంలో కరీంనగర్ వయా గర్శకుర్తి మీదుగా వేములవాడ వెళ్లడానికి ఆర్టీసీబస్సును ఆదివా రం ప్రారంభించారు. కార్యక్రమం పూర్తయిన తరువాత తిరిగి వెళ్తుండగా.. పలువురు రైతులు ఎమ్మెల్యేను అడ్డుకుని రుణమాఫీ, రైతుబంధు గురించి ప్రశ్నించారు. సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని ఎమ్మెల్యే సత్యం రైతులకు సమాధానం ఇచ్చారు.
ప్రజావాణి యఽథాతథం
కరీంనగర్ అర్బన్: ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం నేటినుంచి(సోమవారం) యఽథాతథంగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ పమేలా సత్పతి ఒక ప్రకటనలో తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా కొద్ది వారాల పాటు రద్దు చేయబడిన ప్రజావాణిని తిరిగి ఈ నెల 10నుంచి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. జిల్లా ప్రజలు కలెక్టరేట్‌లో జరిగే ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
సరఫరా నిలిపివేయకుండానే విద్యుత్ మరమ్మతులు
కొత్తపల్లి: విద్యుత్ సరఫరా నిలిపివేయకుండానే సబ్‌స్టేషన్లలో మరమ్మతులు చేపడుతూ వినియోగదారులకు సేవలందిస్తున్నారు. నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలనే లక్ష్యంలో భాగంగా విద్యుత్ అధికారులు ఈ పనులు చేపడుతున్నారు. గతంలో విద్యుత్ సబ్‌స్టేషన్లలో మరమ్మతులు చేపట్టే సమయంలో ఆ ప్రాంతాల్లో సరఫరా నిలిపివేసేవారు. మారుతున్న కాలంలో సాంకేతికతను జోడిస్తూ ఇతర ఫీడర్ల నుంచి విద్యుత్‌ను సరఫరా చేస్తూ సబ్‌స్టేషన్లలో మరమ్మతులు చేపడుతున్నారు. ఇదేక్రమంలో ఆదివారం కరీంనగర్ టౌన్–3 సెక్షన్ బ్యాంక్ కాలనీ, టౌన్ 5 సెక్షన్ టవర్ సర్కిల్ విద్యుత్ సబ్‌స్టేషన్లలో మరమ్మతులు చేపట్టారు. ఈ పనులను టీజీఎన్‌పీడీసీఎల్ కరీంనగర్ సర్కిల్ ఎస్‌ఈ మేక రమేశ్‌బాబు, డీఈ జంపాల రాజం, ఏడీఈ టౌన్–1 శ్రీని వాస్‌గౌడ్, ఏఈలు వెంకటరమణయ్య, నజియ జబీన్, విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు.
డంప్‌యార్డు తొలగించాలి
కొత్తపల్లి: కొత్తపల్లిలోని డంప్‌యార్డును తొలగించాలని బీజేపీ పట్టణశాఖ ఆధ్వర్యంలో ఆదివారం డంప్‌యార్డు వద్ద నిరసన వ్యక్తం చేశారు. కరీంనగర్ నగర పాలక సంస్థకు చెంది న చెత్తను కొత్తపల్లి డంప్‌యార్డుకు తరలించడాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. చెత్తతో కరీంనగర్–జగిత్యాల ప్రధాన రహదారిపై ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. కొత్తపల్లి రైల్వే జంక్షన్‌ను అధునాతన హంగులతో నిర్మిస్తుండగా సమీపంలోని డంప్ యార్డు కళావిహీనంగా మారిందన్నారు. వెంటనే డంప్ యార్డును ఎత్తివేయడంతో పాటు చెత్తను కొత్తపల్లికి తరలించవద్దని డిమాండ్ చేశారు.
పట్టాలపై ఇరుక్కొని నిలిచిపోయిన లారీ
లోకో పైలట్ల అప్రమత్తం.. తప్పిన పెను ప్రమాదం
Comments
Please login to add a commentAdd a comment