నేటి నుంచి బ్రహ్మోత్సవాలు
ధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామి బ్రహ్మోత్సవాలు సోమవారం నుంచి ప్రారంభమవుతాయి. ఉత్సవాలకు ఇతర రాష్ట్రాలతో పాటు తెలంగాణలోని నిజామాబాద్, నిర్మల్, మంచిర్యాల, కరీంనగర్ జిల్లాల నుంచి వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. భక్తుల సౌకర్యార్థం వివిధ శాఖల అధికారులు ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమయ్యారు. ఆలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో ముస్తాబు చేశారు. చలువపందిళ్లతో పాటు తాగునీరు తదితర వసతులు ఏర్పాటు చేశారు. భక్తులకు ఇబ్బందులు ఎదరుకాకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేపట్టాలని విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
13 రోజుల పాటు..
ప్రాచీన పుణ్యక్షేత్రంగా వెల్గొందుచున్న ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయంలో నేటి నుంచి 22 వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలను వైభవంగా జరిపిస్తారు. 13 రోజుల్లో వారం రోజులు అత్యంత కీలకమైనవి. సదరు రోజుల్లో నిత్యం 50 వేల నుంచి లక్ష వరకు భక్తులు వస్తుంటారని అధికారుల అంచనా వేశారు. సోమవారం పుట్ట బంగారంతో ఉత్సవాలు ప్రారంభిస్తారు. మంగళవారం సాయంత్రం నిర్వహించే స్వామివారల కల్యాణ వేడుకలకు సుమారు లక్ష వరకు భక్తులు వచ్చే అవకాశముంది. 14,15,16వ తేదీల్లో బ్రహ్మపుష్కరిణి కోనేరులో యోగ, ఉగ్ర, వేంకటేశ్వర్ స్వాముల తెప్పోత్సవం, డోలోత్సవం, 16,17,18వ తేదీల్లో స్వామివారల దక్షిణ, ఉత్తర దిగ్యాత్ర కార్యక్రమాలు చేపడతారు. 19న ఉత్సవాల్లో ప్రధాన ఘట్టం స్వామివారల రథోత్సవం సాయంత్రం నిర్వహిస్తారు. 20,21,22వ తేదీల్లో ఉత్సవమూర్తుల ఏకంతోత్సవాలను వైభవంగా జరిపిస్తారు.
వివిధ డిపోల నుంచి ప్రత్యేక బస్సులు
● ధర్మపురిలో జరిగే స్వామివారి బ్రహ్మోత్సవాలకు వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు వస్తుంటారు.
● వివిధ డిపోల నుంచి సుమారు 200 బస్సుల వరకు వేస్తున్నామని ఆయా డిపోల మేనేజర్లు తెలిపారు.
● జగిత్యాల డిపో నుంచి 25 బస్సులు, నిర్మల్ డి పో నుంచి 15, ఆర్మూర్ డిపో 100, కరీంనగర్ 10, మంచిర్యాల తదితర డిపోలనుంచి సుమారు 50 బస్సులు నడిపించనున్నారు.
● అలాగే కరీంనగర్ నుంచి రాయపట్నం మీదుగా ధర్మపురికి 67 కిలో మీటర్లు, జగిత్యాల మీదుగా 80 కిలో మీటర్ల దూరం ఉంది.
● నిర్మల్ నుంచి జగిత్యాల మీదుగా 110 కి.మీ. ఆర్మూర్ నుంచి జగిత్యాల మీదుగా 105 కి.మీ, నిజామాబాద్ నుంచి ధర్మపురి 130 కిలోమీటర్ల దూరం ఉంది.
ధర్మపురిలో ముస్తాబైన నృసింహుని ఆలయం
ఈనెల 22 వరకు వివిధ కార్యక్రమాలు
తొలి రోజు పుట్ట బంగారంతో ప్రారంభం
అన్ని ఏర్పాట్లు చేశాం
ధర్మపురి లక్ష్మీనృసింహుని బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేశాం. నీడ, నీరు, భోజన వసతులు కల్పిస్తున్నాం. ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తాం.
– శ్రీనివాస్, ఆలయ ఈవో
Comments
Please login to add a commentAdd a comment