అరుదైన ఆవులు.. మేలుజాతి గేదెలు
● శాలరామన్నపల్లెలో అరుదైన ఆవులను సంరక్షిస్తున్న రాజిరెడ్డి
సిరిసిల్ల: పాడిపరిశ్రమను వృత్తిగా స్వీకరించి చాలా మంది ఉపాధి పొందుతున్నారు. కానీ, వేములవాడ అర్బన్ మండలం శాలరామన్నపల్లెకు చెందిన సోర్పు రాజిరెడ్డి అరుదైన ఆవులను కొనుగోలు చేసి సంరక్షిస్తున్నారు. పాకిస్తాన్‌కు చెందిన కాంగాయాన్ (కాంక్రీవాల్), సాహివాల్, ఒంగోలు గిర్, హర్యానా ఆవుల రకాలను కొనుగోలు చేసి పోషిస్తున్నారు. ఈ మూడు వైరెటీ ఆవులు ఒక్కొక్కటి రోజుకు సగటున పది లీటర్ల పాలు ఇస్తున్నాయి. పాకిస్తాన్ వైరెటీ కాంగాయాన్‌ను రూ.2లక్షలకు కొనుగోలు చేశారు. ఆధునిక బర్రెల షెడ్డు, ఐదెకరాల్లో గడ్డిజాతుల పెంపకం, గడ్డిని ముక్కలు చేసే ఛాప్‌కట్టర్ యంత్రం ఇలా ఆధునికంగా బర్రెల, ఆవుల షెడ్డును నిర్వహిస్తున్నారు. రాజిరెడ్డి షెడ్డులో 30 మేలురకమైన బర్రెలు, ఐదు వైరెటీ ఆవులు ఉన్నాయి. వీటి సంరక్షణకు బిహార్‌కు చెందిన రెండు జంటలు పని చేస్తున్నారు. నిత్యం 300 లీటర్ల పాలను కరీంనగర్ జిల్లా కేంద్రంలోని గీతా భవన్‌కు సరఫరా చేస్తున్నారు. అరుదైన ఆవులు, మేలురకమైన బర్రెలు, ఆధునిక షెడ్డులో రాజిరెడ్డి పాడిపరిశ్రమను నిర్వహిస్తున్నారు. ప్రపంచంలోనే మరిన్ని అరుదైన ఆవులను సేకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు రాజిరెడ్డి తెలిపారు. చేసే పనిపై ఆసక్తి, అభిరుచి ఉంటే.. వైవిధ్యంగా ముందుకు సాగవచ్చని నిరూపిస్తున్నారు.
అరుదైన ఆవులు.. మేలుజాతి గేదెలు
Comments
Please login to add a commentAdd a comment