భక్తుల సౌకర్యం కోసమే కల్యాణ వేదిక మార్పు
● విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్
ధర్మపురి: భక్తుల సౌకర్యం కోసమే స్వామివారి కల్యాణ వేదిక మార్పు చేస్తున్నామని విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయంలో ఈనెల 10 నుంచి 22 వరకు జరిగే బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఆదివారం మాట్లాడారు. లోక కల్యాణార్థం స్వామివారి కల్యాణ మహోత్సవం ఏటా ఆలయంలోని శేషప్ప కళావేదికపై నిర్వహించడంతో చాలా మంది భక్తులు తిలకించలేకపోయారని తెలిపారు. దీంతో భక్తులు, వేదపండితులు, దేవాదాయశాఖ అనుమతులు, సూచనల మేరకు మార్పు చేయడం జరుగుతుందని, బ్రాహ్మణ సంఘం పక్కనున్న శ్రీమఠం వద్ద సువిశాలమైన స్థలంలో స్వామివారి కల్యాణం జరిపించేందుకు దేవాదాయశాఖ అనుమతులు ఇచ్చారని వివరించారు. నూతన వేదిక వద్ద ఆగమశాస్త్రం ప్రకారం వేదపండితులు స్థల సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించారని వెల్లడించారు. ప్రాణం ఉన్నంతవరకు దేవుని విషయంలో ఎలాంటి తప్పు చేయనని స్పష్టం చేశారు. పట్టణ అభివృద్ధి, బ్రహ్మోత్సవాలపై మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ సూచనలు స్వీకరిస్తామని పేర్కొన్నారు. శ్రీమఠం వేదిక చుట్టూ సొంత ఖర్చులతో ఫెన్సింగ్ ఏర్పాటు చేయిస్తానని, రానున్న రోజుల్లో గోదావరి వరదలు రాకుండా కరకట్ట నిర్మాణం కోసం సీఎం దృష్టికి తీసుకెళ్లి నిర్మాణం కోసం కృషి చేస్తానని తెలిపారు. సమావేశంలో నాయకులు ఎస్.దినేశ్, వేములు రాజు, చీపిరిశెట్టి రాజేశ్, సింహరాజు ప్రసాద్ తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment