తూర్పున ఆడ... పశ్చిమాన మగ
మంథని: రెండక్షరాల ప్రేమ మనషులనే కాదు.. మూగజీవావలనూ ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ప్రేమకోసం ఖడాంతరాలు దాటి ప్రయాణాలు చేసిన వారున్నారు.. ప్రాణాలు లెక్క చేయకుండా ప్రేమను గెలిపించుకున్న వారూ చరిత్రలో నిలిచిపోయారు.. ఆ కోవలో జంతువులు సైతం భాగస్వామిని కలుసుకునేందుకు రాష్ట్రాలు దాటి ప్రయానం చేస్తున్నాయి. రెండు పెద్ద పులుల ప్రేమకథ ఇది.
మహారాష్ట్ర నుంచి ఆడపులి..
మహారాష్ట్ర అటవీప్రాంతంలోని ఓ ఆడపులి ప్రేమికుడిని వెతుక్కుంటూ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని గోదావరి నది, మానేరుతీర ప్రాంతాల్లో కొద్దిరోజులుగా సంచరిస్తోంది. ఇదే సమయంలో పశ్చిమ అడవుల్లోనూ ఓ మగపులి సంచారం ఉమ్మడి కరీంనగర్ జిల్లావాసుల్లో భయాందోళనలు కలిగిస్తోంది. సుమారు ఇరవై రోజుల క్రితం మంచిర్యాల జిల్లా చెన్నూరు అడవుల నుంచి ప్రొఫెసర్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా అడవులు.. అటునుంచి మంథని అడవులకు మీదుగా ఆడపులి ఉమ్మడి జిల్లాకు చేరుకుంది. పాదముద్రల ఆధారంగా అది ఇక్కడ సంచరిస్తోందని అటవీ అధికారులు నిర్ధారించారు. పశ్చిమాన వేములవాడ సమీపం ఫాజుల్‌నగర్ అటవీప్రాతంలో మగపులి సంచరించినటు్‌ల్ తెలుస్తోంది. రెండు పులుల పాదముద్రలు 12 సెం.మీ. – 13 సెం.మీ. వరకు, 3–4 సంవత్సరాల వయసు ఉంటుంది. ఒకదశలో రెండుచోట్ల సంచరిస్తున్న పులి ఒక్కటే అనే అనుమానాలు వ్యక్తమైనా.. ఒకేసమయంలో రెండుచోట్ల పులి సంచరిండంతో వేర్వేరు పులుగా స్పష్టమవుతోంది. జత కలిసేందుకే కి.మీ. కొద్దీ పయనిస్తున్నాయి. వాటిని చూసి అటవీ ప్రాంత జనం జాగరణ చేస్తోంది.
కలయిక కోసమా?
వేసవిలో తోడు కోసం పులులు అనువైన ప్రాంతాల్లో అన్వేషణ చేయడం సాధారణం. ప్రస్తుతం తూర్పు, పశ్చిమ ప్రాంతాల్లో సంచరిస్తున్న పులులు జత కోసమేనా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనువైన ప్రాంతాలు.. అనుకూల ప్రదేశాల్లో, జంతువులు నివాసం ఉంటాయి. తమ భాగస్వామిని కలుసుకునే జంతువుల్లో ఏదో ఒకరకమైన సమాచార వ్యవస్థ ఏర్పడుతుందని అటవీ అధికారులు భావిస్తున్నారు. మనుషుల్లో లాగా ప్రేమను వ్యక్తపరిచే అవకాశం లేకపోవడంతో సిగ్నల్స్ లేదా.. మరోరకంగా(వాసన) తమతోడును జంతువులు గుర్తుపట్టేలా చేస్తాయి. పులి రోజూ 20 కి.మీ. నుంచి 50 కి.మీ. వరకు ప్రయాణించే అవకాశం ఉన్నట్లు అధికారులు అంటున్నారు. భాగస్వామి కోసం ఎక్కువదూరం సైతం వెళ్లే అవకాశమూ ఉందంటున్నారు. ఇలా తూర్పు నుంచి పశ్చిమానికి పయనించే క్రమంలో రెండు పులులు ఎక్కడైనా ఎదురయ్యే అవకాశం ఉన్నట్లు అభిప్రాయపడుతున్నారు. పశ్చిమాన ఉన్న పులి సైతం తోడు కోసమే సంచరిస్తున్నట్లు అనుమానాలు ఉన్నాయి. దట్టమైన అటవీప్రాంతం ఇప్పుడు మైదానంగా మారడంతో వాటి ఉనికి ప్రశ్నార్థకమైంది, దీంతో మనుషులు ఉండే ప్రాంతాలకు వచ్చి ఆవులు, మేకలతోపాటు పలు జంతువులను వేటాడి ఆకలి తీర్చుకుంటున్నాయి. కొద్దిరోజుల క్రితం జయశంకర్ భూపాలపల్లి అటవీ ప్రాంతంలో ఓ జంతువుపై దాడిచేసిన పులి.. ఏకంగా గ్రామాల సమీపంలోనే ప్రజలకు కనబడటంతో తీవ్ర భయాందోళకు గురయ్యారు. తనకు జతదొరికే వరకు పులి ఇలాగే సంచరిస్తూ దాడులు చేస్తే ప్రమాదం మరింత పెరిగే అవకాశం ఉందని అటవీ ప్రాంత ప్రజలు వణికిపోతున్నారు.
తోడుగానా.. విడిగానా?
తోడుకోసం పయనిస్తున్న పులులు కలిసే వరకూ సంచరిస్తాయా లేక వచ్చిన దారినే వెళ్తాయా? అనేది తెలియరావడంలేదు. పులులు సంచరించే ప్రాంతా న్ని గుర్తించేందుకు పాదముద్రల ఆధారం అయినా .. ఎంటు నుంచి ఎటు వెళ్లాయనేది ఎవరికీ అంతుచిక్కడం లేదు. సీసీ కెమెరాలు, ట్రాకింగ్ బృందాలు అన్వేషిస్తున్నా అటవీశాఖకు వాటి కదలికలు లభించినట్లు ఎక్కడా వెళ్లడించడం లేదు. జతకలిశాక తోడుగా వెళ్తాయా, విడిగానే తమదారి తాము చూ సుకుంటాయా? అనేది తేలాల్సి ఉంది. వీటిబారినపడకుండా పల్లెవాసులను అటవీ అదికారులు అప్రమత్తం చేస్తున్నారు. ఏదిఏమైనా తోడు కోసం తిరుగుతున్న పులుల ప్రేమకథ ఆసక్తిగా మారింది.
పులి.. ప్రేమ
తోడు కోసం కిలోమీటర్ల మేర పయనం
సిగ్నల్స్ లేదా.. మరో రకంగా గుర్తుపట్టే అవకాశం
జత కలుస్తాయా.. వేర్వేరుగానే వెళ్తాయా?
అటవీ శాఖ అధికారుల్లో అనేక అనుమానాలు
Comments
Please login to add a commentAdd a comment