శ్రీలక్ష్మీనృసింహస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు
ధర్మపురిలో యజ్ఞాచార్యుల దంపతులను మేళతాళాలతో తీసుకెళ్తున్న దేవస్థానం సిబ్బంది
పుట్ట బంగారం వేదిక వద్ద పూజలు నిర్వహిస్తున్న వేదపండితులు
ధర్మపురి: జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామి బ్రహ్మోత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ఈవో శ్రీనివాస్ ఆధ్వర్యంలో ముందుగా ప్రధాన ఆలయమైన శ్రీయోగానందా స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆనవాయితీ ప్రకారం యజ్ఞాచార్యులు కందాలై పురుషోత్తమాచారి దంపతులను ఆలయం పక్షాన మేళతాళాలతో వారి గృహానికెళ్లి స్వాగతం పలికారు. పూలమాలలు, స్వామివారి శేషవస్త్రాలతో సన్మానించి దేవాలయానికి ఆహ్వానించారు.
ఘనంగా పుట్ట బంగారం వేడుకలు
బ్రహ్మోత్సవాల్లో మొదటిరోజైన సోమవారం సాయంత్రం స్థానిక చింతామణి చెరువు కట్ట వద్ద పుట్ట బంగారం వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్వామివారి ఉత్సవమూర్తులను ఆలయం నుంచి పుట్ట బంగారం వేదిక వద్దకు మేళతాళాలతో తీసుకెళ్లారు. వేదపండితుల మంత్రోచ్ఛరణలతో ప్రత్యేక పూజలు చేసి పుట్టను తవ్వి ఆ మట్టిని ఆలయాని తీసుకొచ్చారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
నేడు నృసింహుని కల్యాణం
ధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మినృసింహస్వామి కల్యాణ వేడుకలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం స్థానిక బ్రాహ్మణ సంఘం పక్కనున్న శ్రీమఠం స్థలంలో వేడుకను కన్నులపండువగా జరిపించనున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ధర్మపురి శ్రీమఠం పీఠాధిపతి సచ్చితానంద సరస్వతిస్వామిజీ హాజరుకానున్నారు. ప్రభుత్వం తరఫున కలెక్టర్ పట్టువస్త్రాలు, తలంబ్రాలను సమర్పించనున్నారు. వివిధ రాష్ట్రాలు, జిల్లాల నుంచి సుమారు లక్ష మంది వరకు భక్తులు తరలివస్తారని అంచనా. ఎస్పీ అశోక్‌కుమార్ ఆధ్వర్యంలో డీఎస్పీ రఘుచందర్, ఆరుగురు సీఐలు, 15 మంది ఎస్సైలు, 200 మంది పోలీస్‌బందోబస్తులో పాల్గొననున్నారు. స్వామివారి కల్యాణం నిమిత్తం దేవస్థానం మాజీ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి, మాజీ డైరెక్టర్ అక్కెనపెల్లి సునిల్‌కుమార్ దంపతులు సోమవారం ఆలయ అర్చకులకు పట్టు వస్త్రాలు, తలంబ్రాలను సమర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment