
శివాజీనగర: ఈ ఎన్నికల్లో బీజేపీలో 12 మందికిపైగా మంత్రులు ఇంటిముఖం పట్టారు. మంత్రులు కే సుధాకర్, బీ శ్రీరాములు, వీ సోమణ్ణ, మురుగేశ్ నిరాణి, బీసీ పాటిల్ వంటి సీనియర్లు ఇందులో ఉన్నారు. స్పీకర్ విశ్వేశ్వర హెగ్డే కాగేరి కూడా ఓటమిపాలయ్యారు.
సుధాకర్.. శ్రీరాములు..
► చిక్కబళ్లాపుర నియోజకవర్గంలో మంత్రి కే.సుధాకర్ ఓడిపోగా కాంగ్రెస్ అభ్యర్థి ప్రదీప్ ఈశ్వర్ గెలుపొందారు.
► బళ్లారి రూరల్‌లో సీనియర్ బీజేపీ నేత బీ.శ్రీరాములు భారీ ఓట్ల తేడాతో ఓడిపోయారు.
► చామరాజనగర, వరుణ రెండు సీట్లలో పోటీ చేసిన మంత్రి వీ.సోమణ్ణకు ఎక్కడా గెలుపు దక్కలేదు. చామరాజనగరలో కాంగ్రెస్ నుంచి పుట్టరంగశెట్టి, వరుణలో మాజీ సీఎం సిద్దరామయ్య గెలుపొందారు.
అశోక్ రెండింట ఒకటి
కేపీసీసీ అధ్యక్షుడు డీ.కే.శివకుమార్‌పై కనకపుర, పద్మనాభనగరలో రెండుచోట్ల పోటీ చేసిన మంత్రి ఆర్ అశోక్ డీకేశిని ఓడించలేకపోయారు. అయితే పద్మనాభనగరలో గట్టెక్కి హమ్మయ్య అనుకున్నారు.
శెట్టర్ ఓటమి, సవది ఎన్నిక
బీజేపీ నుంచి వైదొలగి కాంగ్రెస్‌లో చేరిన మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ శెట్టర్ హుబ్లీ సెంట్రల్ నియోజకవర్గంలో ఓటమిని చవిచూశారు. ఆయన బాటలోనే వెళ్లిన లక్ష్మణ సవది అథణిలో ఎన్నికయ్యారు.
పాపం సభాపతి కాగేరి
ఆరుసార్లు విధానసభకు ఎన్నికై న స్పీకర్ విశ్వేశ్వర హెగ్డే కాగేరి ఉత్తర కన్నడ శిరసిలో పరాభవం చెందారు. ఇక్కడ కాంగ్రెస్ గెలుపొందింది. మంత్రులు గోవింద కారజోళ ముధోళ్‌లో ఓడిపోగా, కాంగ్రెస్ నుంచి ఆర్.బీ.తిమ్మాపుర ఎననికయ్యారు. హిరేకరూరులో మంత్రి బీ.సీ.పాటిల్‌ను కాంగ్రెస్ నేత యు.బీ.బణకార్ ఓడించారు. మంత్రులు నారాయణగౌడ, మురుగేశ్ నిరాణి, శశికలా జొల్లె, హాలప్ప ఆచార్ కూడా తమ క్షేత్రాల్లో మట్టికరిచారు.
గుండెపోటు అభిమాని మృతి
యశవంతపుర: చిత్రదుర్గ జిల్లా హిరియూరు బీజేపీ అభ్యర్థి కె పూర్ణిమ ఓటమి విషయం తెలుసుకున్న ఓ అభిమాని గుండెపోటుతో మృతి చెందారు. హిరియూరు తాలూకా అలమరదహట్టి గ్రామానికి చెందిన ఈరణ్ణ గుండెపోటుతో మృతి చెందారు. కాంగ్రెస్ అభ్యర్థి డీ సుధాకర్, బీజేపీ అభ్యర్థి పూర్ణిమల మధ్య గట్టి పోటీ నడిచింది. సుధాకర్ ఐదు వేల ఓట్ల తేడాతో అధిక్యత సాధించిన విషయం తెలియగానే ఈరణ్ణ గుండెపోటుతో మృతి చెందారు.
Comments
Please login to add a commentAdd a comment