శివాజీనగర: కొత్తగా కొలువైన కాంగ్రెస్ ప్రభుత్వం నేడు శుక్రవారం తొలి బడ్జెట్‌ను ప్రకటించబోతోంది. ఆర్థికశాఖను కూడా చూస్తున్న ముఖ్యమంత్రి సిద్దరామయ్య బడ్జెట్‌ను సమర్పిస్తారు. మేనిఫెస్టోలో ప్రకటించిన కాంగ్రెస్ 5 గ్యారంటీ పథకాలు కాకుండా కొత్తగా ఇతర సంక్షేమ పథకాలు ఏవైనా ఉంటాయా అనేది కుతూహలంగా మారింది. సిద్దు బడ్జెట్‌ను సమర్పించడం ఇది 14వ సారి కావడం రికార్డు కానుంది.
గ్యారంటీలు, నిరుద్యోగం, హామీలు
కొత్త బడ్జెట్‌పై భారీగానే ఆశలు ఉన్నాయి. కరోనా బెడద వదిలిపోవడంతో ఖజానా ఆర్థికంగా పుంజుకొంది. పన్నుల వసూళ్లు, జీఎస్టీ ఆదాయం బాగానే ఉంది. ఈసారి బడ్జెట్ మొత్తం రూ.3.25 లక్షల కోట్లు దాటవచ్చని అంచనా. గతంలో బసవరాజ బొమ్మై ప్రభుత్వం రూ.2.51 లక్షల కోట్లు ఉండింది. కరెంటు చార్జీలు, మద్యం రేట్లు పెంచి సిద్దరామయ్య సర్కారు విమర్శలను ఎదుర్కొంది. రానున్న లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని జనాకర్షక పథకాలను ప్రకటించవచ్చని భావిస్తున్నారు.
అనేక జిల్లాల్లో కరువు నేపథ్యంలో అన్నదాతలను ఆదుకోవడానికి చర్యలను ప్రకటించాల్సి ఉంది. ఎన్నికల ప్రచారంలో నిరుద్యోగం గురించి కాంగ్రెస్ నేతలు ప్రచారం చేయడం వల్ల ఈ అంశం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. మేనిఫెస్టోలో ఇచ్చిన అనేక హామీలను నెరవేర్చేలా పథకాలు, నిధుల కేటాయింపులు కనిపించాల్సి ఉంది.
బెంగళూరుకు ఏమిస్తారు
ఇక అంతర్జాతీయ నగరంగా పేరుపొందిన బెంగళూరు నగరాభివృద్ధికి అధికంగా నిధులు కేటాయించవచ్చని అంచనాలున్నాయి. అలాగే నగరం ఎదుర్కొంటున్న ట్రాఫిక్ రద్దీ, ముంపు బెడద, నేరాల అడ్డుకట్టకు పథకాలను ప్రకటించవచ్చని తెలుస్తోంది. నగర ప్రధాన భాగాల్లో సొరంగ రోడ్డు నిర్మాణంపై ప్రతిపాదనలున్నాయి. ఐటీ, బీటీ రంగాలపై దృష్టా సారించాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment