కర్ణాటక: ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న స్కూల్ నుంచి మరోచోటుకు బదిలీ కావడంతో ఆ ఉపాధ్యాయురాలు తట్టుకోలేక ప్రాణాలు విడిచింది. ఈ విషాద సంఘటన కోలారు జిల్లా కేజీఎఫ్ తాలూకాలో చోటుచేసుకుంది. వివరాలు... కేజీఎఫ్‌లో ప్రభుత్వ తమిళ పాఠశాలలో టీచర్‌గా నిర్మలాకుమారి ఉద్యోగం చేస్తున్నారు. ఇందులో విద్యార్థుల హాజరు తక్కువగా ఉన్నందున ఉపాధ్యాయుల సర్దుబాటులో భాగంగా కొందరు టీచర్లను ఇతర పాఠశాలలకు బదిలీ చేశారు.
నిర్మలాకుమారి (49)ని శ్రీనివాసపురం తాలూకా సోమయాజులపల్లి ప్రభుత్వ పాఠశాలకు బదిలీ చేశారు. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న నిర్మలాకుమారి మైసూరు ఆస్పత్రిలో గతంలో కిడ్నీ మార్పిడి చేసుకున్నారు. తనను ఆరోగ్య సమస్య దృష్ట్యా బదిలీ చేయవద్దని కౌన్సెలింగ్ సమయంలో ఆమె ఉన్నతాధికారులకు విన్నవించారు. అయితే శ్రీనివాసపురంలో అవసరం ఉందంటూ బదిలీ చేశారు.
పాఠశాలను చూసి వస్తూ..
నిర్మలాకుమారి శనివారం సోమయాజులపల్లి పాఠశాలను చూసి వద్దామని కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లింది. నిత్యం ఇంతదూరం రావాలా అని మానసిక ఆవేదనకు గురైంది. తిరిగి వస్తుండగా మార్గమధ్యలో అస్వస్థతకు గురై మరణించింది. విద్యార్థి– టీచర్ నిష్పత్తి (పీటీఆర్)ని అనుసరించి ఉపాధ్యాయులను బదిలీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇదే నియమాలను పాటించారని బీఈఓ చంద్రశేఖర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment