నిందితుడు చంద్రప్ప, భార్య నేత్రావతి (ఫైల్)
కర్ణాటక: సిలికాన్ సిటీలో ఘోరం చోటుచేసుకుంది. భర్త, కొడుకు కలిసి మహిళను మట్టుబెట్టారు. మానవత్వానికి మచ్చ తెచ్చే ఈ సంఘటన కేఆర్‌పుర పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు విచారణ చేపట్టగా భర్త, ఆమె కొడుకే సూత్రధారులని తెలిసి అందరూ నిర్ఘాంతపోయారు.
కడ్డీపై వేలి ముద్రలు
వివరాలు.. ఈ నెల 2న కేఆర్‌పుర పోలీసుస్టేషన్ పరిధిలో నేత్రావతి (40) అనే మహిళను ఎవరో ఇనుప రాడ్‌తో బాది హత్య చేశారు. మా అమ్మను చంపేశారంటూ ఆమె మైనర్ కొడుకు (17) కేఆర్ పుర పోలీసులకు ఫోన్ చేశాడు. ఇతడు డిప్లొమా విద్యార్థి అని తెలిసింది. పోలీసులు వచ్చి అనుమానంతో కుర్రవాన్ని అదుపులోకి తీసుకున్నారు. అక్కడ పడి ఉన్న రాడ్‌పై ఉన్న రెండు వేలి ముద్రలను పరిశీలించారు. మరిన్ని ఆధారాల కోసం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. దానిపై ఉన్న వేలిముద్రలు ఎవరివో కాదని, నేత్రావతి భర్త చంద్రప్ప, కొడుకువని నిర్ధారణ అయ్యింది.
భర్త ఏమన్నాడంటే
పోలీసుల విచారణలో చంద్రప్ప నోరు విప్పాడు. తన భార్యకు వివాహేతర సంబంధం ఉందని, మద్యానికి కూడా అలవాటైందని, బయటకు వెళ్తే రెండు రోజులైనా ఇంటికి వచ్చేది కాదని చెప్పాడు. దీంతో తాను, కొడుకు అన్నం వండుకోలేక, హోటళ్లకు వెళ్లలేక ఉపవాసం ఉండేవాళ్లం. ప్రశ్నిస్తే తమతో పోట్లాడి రభస చేసేది, గత్యంతరం లేక ఆమెను కొడుకుతో కలిసి హత్య చేసినట్లు వివరించాడు. వీరికొక కూతురు ఉండగా, ఆమె జార్జియాలో వైద్య విద్య చదువుతోంది.
తండ్రిని కాపాడాలని బాలుని తపన
హత్య చేసిన తరువాత తానే ఇదంతా చేశానని, తండ్రికి ఏమీ తెలియదని బాలుడు తండ్రిని కాపాడేందుకు ప్రయత్నించాడు. తల్లి తనను పట్టించుకోవడం లేదనే బాధతో చంపానని పోలీసులకు చెప్పాడు. జైలుకెళ్లిన తరువాతైనా మంచి చదువు దొరుకుతుందని, మైనర్ కావడం వల్ల శిక్ష తక్కువగా ఉంటుందని, తండ్రికి జైలు వాసం తప్పుతుందని అనుకున్నట్లు చెప్పాడు. చివరకు రాడ్ మీద వేలిముద్రలు నిజం చెప్పడంతో తండ్రీ కొడుకులిద్దరినీ పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు.
Comments
Please login to add a commentAdd a comment