
కోలారు: ప్రసవం కోసం వచ్చిన మహిళ కాన్పు తరువాత కన్నుమూసింది. దీంతో బిడ్డ తల్లి లేని అనాథ అయ్యింది. ఈ ఘటన కోలారు నగరంలోని ఎస్‌ఎన్‌ఆర్ జిల్లా ఆస్పత్రిలో చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యం వల్లనే బాలింత మరణించిందని భర్త, అత్తమామలు ఆరోపిస్తున్నారు.
24 గంటలు కాకుండానే
వివరాలు.. తాలూకాలోని జంగాలహళ్లి గ్రామానికి చెందిన భవాని (26) అనే గర్భిణి సోమవారం ప్రసవం కోసం జిల్లా ఆస్పత్రిలో చేరింది. సాయంత్రం వైద్యులు సిజేరియన్ చేయగా పాప పుట్టింది. మంగళవారం ఉదయం బాలింతకు కడుపు నొప్పి రాగా నర్సు ఇంజెక్షన్ ఇచ్చింది. తరువాత కొద్దిసేపటికి భవాని మృతి చెందింది. శిశువు తలపై కూడా గాయం కనిపించింది. దీనిని బట్టి సిజేరియన్‌లో సక్రమంగా చేయలేదని భర్త ఆరోపించి ఘటనపై నగర పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తనకు న్యాయం చేయాలని కోరాడు. శిశువు కళ్లు తెరవక ముందే తల్లిని కోల్పోయిందని నానమ్మ రత్నమ్మ రోదించింది.
నిర్లక్ష్యం లేదు: వైద్యాధికారి
జిల్లా ఆస్పత్రి సర్జన్ డాక్టర్ విజయకుమార్ ఆస్పత్రిలో ఎవరూ నిర్లక్ష్యం చేయలేదని, వారంలో 45 సిజేరియన్లు జరిగాయి, ఎక్కడా సమస్య కాలేదు. మహిళ మృతిపై విచారణ చేస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment