నిర్మలమ్మ కరుణించేనా!
భద్రా ఎత్తిపోతల ప్రాజెక్టుకు ఆర్థిక సహకారం..
సాక్షి బెంగళూరు: కేంద్ర బడ్జెట్‌పై కర్ణాటక గంపెడాశలు పెట్టుకుంది. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. ఈ క్రమంలో కేంద్ర పద్దుపై కర్ణాటక ఆశగా చూస్తోంది రాష్ట్రానికి ఈసారైనా భారీగా నిధులు, ప్రాజెక్టుల కేటాయింపులు జరుగుతాయా అనే ఆశగా ఎదురు చూస్తోంది. ఇదే సమయంలో ఎప్పటిలాగానే ఈసారి కూడా కర్ణాటకకు మొండిచేయి తప్పదని పలువురు నేతలు అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టులకు కేటాయింపులు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తులు వెళ్లాయి. ఈ విజ్ఞప్తులపై కేంద్రం ఎలా స్పందిస్తుందో తెలియడానికి ఇంకొక రోజు వేచి చూడాల్సిందే..!!
రూ. 90 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు సహాయం కోసం డిమాండ్..
బెంగళూరులో సుమారు రూ. 90 వేల కోట్లతో పలు మౌలికవసతుల అభివృద్ధి ప్రాజెక్టులకు కేంద్రం నుంచి ఆర్థిక సహాయం ఇవ్వాలని రాష్ట్ర సర్కార్ విజ్ఞప్తి చేసింది. టన్నెల్ రోడ్డు యోజన, పెరిఫెరల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు వంటివి ఉన్నాయి. డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్, పీఆర్‌ఆర్ బిజినెస్ కారిడార్, నీటి సరఫరా ప్రాజెక్టులకు 2025–26 కేంద్ర బడ్జెట్‌లో నిధుల విడుదల కోసం కర్ణాటక ఆశగా ఎదురుచూస్తోంది.
నగర సొరంగ మార్గ నిర్మాణానికి...
ట్రాఫిక్ రద్ధీని తగ్గించేందుకు టన్నెల్ రోడ్డు నిర్మాణం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. హెబ్బాళ ఎస్టీమ్ మాల్ నుంచి హెచ్‌ఎస్‌ఆర్ లేఔట్ సిల్క్‌బోర్డు జంక్షన్ (ఉత్తరం–దక్షిణం వరకు సుమారు 18.5 కి.మీ. మేర రోడ్డు నిర్మాణం కోసం రూ. 15 వేల కోట్లు, కేఆర్ పుర సర్కిల్ నుంచి నాయండనహళ్లి జంక్షన్ (తూర్పు–పడమర) వరకు 28.5 కి.మీ. టన్నెల్ రోడ్డు నిర్మాణం కోసం రూ. 25 వేల కోట్ల ఖర్చు అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం రూ. 19 వేల కోట్లతో డీపీఆర్ సిద్ధం చేసింది. జాతీయ రహదారితో ఈ టన్నెల్ కలవనున్నడంతో రాష్ట్ర ప్రభుత్వం, జాతీయ రహదారుల ప్రాధికార ఈ ప్రాజెక్టును చేపడుతున్నాయి. ఈ ప్రాజెక్టుకు బడ్జెట్‌లో నిధుల కేటాయింపు చేయాలని కోరుతోంది.
మెట్రో కారిడార్, డబుల్ డెక్కర్
ప్రస్తుత మెట్రో మార్గాలకు ఐదు కారిడార్లను విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సుమారు 129 కి.మీ. మెట్రో మార్గాన్ని విస్తరించాలని అడుగులు వేస్తోంది. నగర ఔటర్ రింగ్‌రోడ్డు, బెంగళూరు ఉపనగరాన్ని ఈ ఉద్ధేశిత మెట్రో కారిడార్ కలుపుతుంది. ఈ ఐదు మెట్రో కారిడార్లకు అనుమతివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. మెట్రో నాల్గో దశ ప్రాజెక్టులో భాగంగా జేపీ నగర నుంచి హెబ్బాళ వరకు అలాగే హోసహళ్లి నుంచి కడబగేరె వరకు సుమారు 45 కి.మీ. మేర డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్‌కు రూ. 8,916 కోట్ల నిదులను విడుదల చేయాలని మనవి చేసింది.
17 ఫ్లై ఓవర్ల నిర్మాణం కోసం...
నగరంలో ట్రాఫిక్ రద్ధీ ఎక్కువగా ఉండే 11 జంక్షన్లలో 99.50 కి.మీ. మేర 17 ఫ్లై ఓవర్లు నిర్మించేందుకు రూ. 12 వేల కోట్లు ఇవ్వాలని ప్రభుత్వం కోరుతోంది. ప్రముఖ నది తీరప్రాంతం, పెద్ద చెరువులు, రాజకాలువ పక్కనే బఫర్ జోన్ ఆక్రమణలకు గురై ప్రమాదాలు జరుగుతుండడంతో ఈ జోన్‌లో 300 కి.మీ. మేర రోడ్డు నిర్మాణం కోసం రూ. 3 వేల కోట్ల కేటాయింపులు జరపాలని ప్రభుత్వం కోరింది.
బిజినెస్ కారిడార్ నిర్మాణం,
బెంగళూరు ట్రాఫిక్‌రద్ధీ తగ్గించేందుకు బీడీఏ ఆధ్వర్యంలో 8 లైన్ల 73.04 కి.మీ. మేర బిజినెస్ కారిడార్ నిర్మాణం కోసం రూ. 27 వేల కోటు అవసరం. కావేరి ఆరో దశ ప్రాజెక్టు ద్వారా బెంగళూరుకు 2028 నాటికి 500 ఎంఎల్‌డీ నీటి సరఫరాకు కేటాయింపులు జరపాలని కూడా ప్రభుత్వం మనవి చేసింది.
నేడే కేంద్ర బడ్జెట్
గంపెడాశలు పెట్టుకున్న కర్ణాటక
ఎప్పటిలాగే ఉసూరుమనిపిస్తారేమోనన్న భయం..
కరువు పీడిత మధ్య కర్ణాటక ప్రాంతానికి నీటిని పంపిణీ చేసేందుకు ఉద్దేశించిన భద్రా ఎత్తిపోతల ప్రాజెక్టుకు గత బడ్జెట్‌లో ప్రకటించిన రూ. 5,300 కోట్లు విడుదల చేయాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. మేకెదాటు, మహదాయి ప్రాజెక్టులకు అనుమతులు మంజూరు చేయాలని కూడా కోరుతోంది. 15వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు చేసిన ప్రత్యేక కేటాయింపులు రూ. 11,495 కోట్లను విడుదల చేయాలని, అంగన్‌వాడీ, ఆశాకార్యకర్తలకు గౌరవ వేతనం రూ. 5 వేలు, వంటచేసే వారు, సహాయకులకు రూ. 2 వేలు పెంపుదల చేయాలని ప్రభుత్వం కోరింది. కల్యాణ కర్ణాటక ఆభివృద్ధికి రూ. 5 వేల కోట్లు, రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలకు రుణాల మంజూరుకు అనుమతులు, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద నగరంలో ఇళ్ల నిర్మాణాలకు అందించే రూ. 1.5 లక్షలను రూ. 5 లక్షలకు గ్రామాల్లో రూ. 72 వేల నుంచి రూ. 3 లక్షలకు పెంచాలని ప్రభుత్వం కోరుతోంది.
Comments
Please login to add a commentAdd a comment