కేంద్ర బడ్జెట్‌పై ఆశలు లేవు
యశవంతపుర: కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి న్యాయం జరుగుతుందనే నమ్మకంలేదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. అయన శుక్రవారం కొడుగు జిల్లా భాగమండలలో విలేకర్లతో మాట్లాడారు. కర్ణాటకకు కేంద్రం నుంచి రావాల్సిన పన్నులను సక్రమంగా విడుదల చేయట్లేదన్నారు. రాష్ట్ర డిమాండ్లను కేంద్రం పట్టించుకోలేదన్నారు. కావేరి నది స్వచ్ఛతపై రచించిన సమితి ఇంకా నివేదిక ఇవ్వలేదన్నారు. రాష్ట్రంలో ఏనుగులు, చిరుతలు హారం కోసం అడవి నుంచి గ్రామాల్లోకి చొరబడుతున్నాయని, ఈక్రమంలో వన్యజీవుల రక్షణకు చర్యలు తీసుకుంటామన్నారు.
మృతుడి కుటుంబానికి రూ.17 లక్షల పరిహారం
మైసూరు: మైసూరులోని మహారాణి కళాశాల భవనం పునరుద్ధరణ పనుల్లో భాగంగా చేపట్టిన పనుల్లో కట్టడం కూలి శిథిలాల కింద చిక్కి మృతి చెందిన కార్మికుడు సద్దాం హుసేన్ కుటుంబానికి రూ.17 లక్షల పరిహారం అందజేశారు. ఎమ్మెల్యే కే.హరీష్‌గౌడ శుక్రవారం నగరంలోని గౌసియా నగర్‌లో ఉన్న మృతుడి ఇంటికి వెళ్లి అతని భార్యకు రూ.17లక్షల చెక్ అందజేశారు. అదేవిధంగా కాంట్రాక్టర్ హరీష్‌గౌడ మరో రూ.5లక్షల ఆర్థిక సాయం అందించారు. మృతుడి ఇద్దరి పిల్లల పేరుతో రూ.2లక్షలు బ్యాంకులో జమ చేశారు.
నిందితుడిపై పోలీసు కాల్పులు
యశవంతపుర: బెంగళూరుకు చెందిన మను అనే రౌడీషీటర్‌పై పోలీసులు కాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్నారు. ఈఘటన హాసన్ జిల్లాలో జరిగింది. వివరాలు.. జనవరి 29న ప్రైవేటు బస్సు బెంగళూరు నుంచి మంగళూరు వెళ్తుండగా హాసన్ బైపాస్‌లో నిందితుడు తన అనుచరులతో కలిసి కారు అడ్డం పెట్టి విధ్వంసానికి పాల్పడ్డాడు. ఇతని కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. మను మంగళూరు నుంచి బెంగళూరు వెళ్లేందుకు హాసన్ తాలూకా శాంతిగ్రామ వద్ద ఉండగా పోలీసులు దాడి చేశారు. కారులో ఉన్న మను కిందకు దిగి మారణాయుధాలతో పోలీసులపై దాడికి దిగాడు. దీంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు కాల్పులు జరిపారు. ఒక బుల్లెట్ మను కాలులోకి దూసుకెళ్లి కుప్పకూలాడు. అనంతరం అతన్ని ఆస్పత్రికి తరలించారు. నిందితుడిపై హత్య, మూడు హత్యాయత్నం కేసులు, దోపిడీ కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు.
హాప్‌కామ్స్‌పై
బీజేపీ రైతు మోర్చా కన్నెర్ర
శివాజీనగర: రైతులకు సహకారిగా పనిచేయాల్సిన హాప్ కామ్స్ దళారులకు అనుకూలంగా మారి అవినీతిలో కూరుకు పోయిందని ఆరోపిస్తూ బీజేపీ రైతు మోర్చా నాయకులు ఉద్యమించారు. బెంగళూరులోని హాప్ కామ్స్ ప్రధాన కార్యాలయాన్ని శుక్రవారం ముట్టడించేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. మోర్చా రాష్ట్ర, జిల్లా పదాధికారులను అరెస్ట్ చేసి సిద్దాపుర పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అయితే నాయకులు పోలీస్ స్టేషన్ ముందు ధర్నా నిర్వహించి పోలీసుల చర్యపై మండిపడ్డారు. కోలారు, చిక్కబళ్లాపుర, రామనగర, బెంగళూరు గ్రామీణ, నగర కార్యాలయాల ముందు కూడా ధర్నాలు జరిగాయి. రాష్ట్ర బీజేపీ రైతు మోర్చా ప్రధాన కార్యదర్శి డాక్టర్ బీ.సీ.నవీన్‌కుమార్ నేతృత్వంలో ధర్నాలు జరిగాయి. రాష్ట్ర కార్యదర్శి సతీశ్ కడతలమనె, రైతు మోర్చా ఉపాధ్యక్షుడు రుద్రేశ్,ఐదు జిల్లాల రైతు మోర్చా జిల్లాధ్యక్షులు ఈ ధర్నాలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment