● యడియూరప్ప ధ్వజం
దొడ్డబళ్లాపురం: కాంగ్రెస్ సర్కారు బడ్జెట్‌పై బీజేపీ నేత, మాజీ సీఎం యడియూరప్ప తీవ్ర విమర్శలు చేశారు. ఇది రాష్ట్ర అభివృద్ధికి వ్యతిరేకంగా ఉంది, కేవలం మైనారిటీలను మచ్చిక చేసుకోవడానికి ప్రవేశపెట్టిన బడ్జెట్‌గా అనిపిస్తోందని ఎక్స్‌లో ఆరోపించారు. ముస్లిం కాంట్రాక్టర్లకు మతం ఆధారంగా అవకాశాలు కల్పించడం రాజ్యాంగం ఆశయాలకు వ్యతిరేకమన్నారు. కళ్యాణ కర్ణాటక అభివృద్ధికి ఇచ్చింది శూన్యమన్నారు. గత బడ్జెట్‌లో పేర్కొన్న పనులు, పథకాల అమలుపై మౌనం ఎందుకన్నారు. గ్యారంటీల పేరుతో అభివృద్ధిని గాలికొదిలేశారన్నారు. బెంగళూరు మీద దృష్టి పెట్టలేదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 2వేలమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, రైతులకు మొండిచేయి చూపించారని ధ్వజమెత్తారు.
సిద్దరామయ్య 16వ బడ్జెట్
శివాజీనగర: దేశంలో అత్యధికసార్లు రాష్ట్ర బడ్జెట్‌ను ప్రకటించిన ఆర్థికమంత్రి/ సీఎంలలో ఒకరుగా సిద్దరామయ్య రికార్డు సృష్టించారు. తాజా బడ్జెట్ ఆయనకు 16వ పద్దు కావడం విశేషం. గుజరాత్ గత ఆర్థిక మంత్రి వజుభాయివాలా ఏకంగా 18 సార్లు బడ్జెట్‌లు ప్రవేశపెట్టి అరుదైన కీర్తిని పొందారు. మాజీ సీఎం రామకృష్ణ హెగ్డే 13 బడ్జెట్‌లు ప్రవేశపెట్టారు. 1994లో తొలిసారిగా జనతాదళ్ సర్కారులో ఆర్థిక మంత్రిగా ఉన్న సిద్దరామయ్య తన తొలి బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.
మరో బాలింత మృత్యుఒడికి
యశవంతపుర: ఉత్తర కర్ణాటకలో బాలింతల మరణాలు తగ్గడం లేదు. అప్పుడే పుట్టిన పసిబిడ్డలు శాశ్వతంగా అమ్మ ప్రేమకు దూరమవుతున్నారు. బెళగావిలోని బిమ్స్ ఆస్పత్రిలో బాలింత గురువారం రాత్రి చనిపోయింది. జిల్లాలోని గోకాక్ తాలూకా లగమేశ్వర గ్రామానికి చెందిన కీర్తి నేసరగి తుమ్మరగుడ్డి (23) మృతురాలు. మంగళవారం వైద్యులు సిజేరియన్ చేసి ప్రసవం చేశారు. అయితే కీర్తి తీవ్రమైన రక్తస్రావం జరిగి మరణించిందని వైద్యులు చెబుతున్నారు. రక్తస్రావం అవుతున్నా వైద్యులు సరైన చికిత్సలు అందించలేదని కుటుంబసభ్యులు ఆరోపిస్తూ ధర్నాకు దిగారు. బెళగావి ఎపిఎంసీ పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నారు.
ఎయిర్‌పోర్టులో
4 కేజీల బంగారం సీజ్
దొడ్డబళ్లాపురం: కెంపేగౌడ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు 4 కేజీల బంగారాన్ని పట్టుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుని వద్ద ఈ బంగారం పట్టుబడింది. ప్రయాణికుడు అంగీ లోపలి భాగంలో బంగారం దాచుకుని వెళ్తుండగా తనిఖీలలో దొరికిపోయాడు. ఈ బంగారం విలువ రూ.3.44 కోట్లుగా కస్టమ్స్ అధికారులు తెలిపారు. ప్రయాణికున్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
రన్య రావుకు కస్టడీ
సంచలనాత్మక బంగారం స్మగ్లింగ్ కేసులో కన్నడ నటి రన్య రావుకు బెంగళూరు కోర్టు మరో 3 రోజుల పాటు డీఆర్‌ఐ కస్టడీకి అనుమతించింది. సోమవారం రాత్రి ఆమె బెంగళూరు విమానాశ్రయంలో 14 కేజీలకు పైగా బంగారంతో దొరికిపోవడం తెలిసిందే. అప్పటినుంచి డీఆర్‌ఐ ప్రశ్నిస్తోంది. రన్యరావు దుబాయ్, మధ్య ఆసియా, యూరప్ దేశాలకు తరచూ ప్రయాణించేదని గుర్తించారు. ఎందుకు ఆ టూర్లు అనేది ఆరా తీస్తున్నారు. మరోవైపు విచారణలో ఉన్న ఆమె ఫోటో ఒకటి బయటకు వచ్చింది. ఆమె స్వల్పంగా గాయపడినట్లు అందులో ఉండడం కలకలం రేపుతోంది. గోల్డ్ స్మగ్లింగ్‌లో తనను ఇరికించారని చెప్పినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment