శివాజీనగర: కర్ణాటక రాష్ట్రాన్ని క్షయ రోగ విముక్తి రాష్ట్రంగా చేసేందుకు ఆరోగ్య శాఖ బీసీజీ టీకాల కార్యక్రమాన్ని ముమ్మరం చేయనుంది. నగరంలో మంగళవారం ఆరోగ్య మంత్రి దినేశ్ గుండురావు ప్రారంభించారు. రాష్ట్రంలో 16 జిల్లాల్లో బీసీజీ టీకాలను చేపట్టినట్లు, క్షయ రోగ రాకుండా అరికట్టడంలో ప్రముఖ పాత్రను పోషిస్తుందన్నారు. 1060 గ్రామ పంచాయతీలు క్షయ నుంచి విముక్తి పొందాయన్నారు. క్షయ రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడంలో బీసీజీ టీకా ముఖ్యమైనదన్నారు. ప్రజలు ఈ టీకాను తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఆరోగ్య శాఖ డైరెక్టర్ త్రివేణితో పాటుగా కొందరు వైద్యులు అక్కడే బీసీజీ టీకా తీసుకున్నారు.
ఎమ్మెల్యేలూ.. ఆస్తులు చెప్పాలి
దొడ్డబళ్లాపురం: ఎమ్మెల్యేలు తమ, కుటుంబ సభ్యుల ఆస్తి వివరాలను జూన్ 30లోపు ఇవ్వాలని లోకాయుక్త గడువు విధించింది. ఇందుకు సంబంధించి ఎమ్మెల్యేలకు లేఖలు పంపింది. ఎమెల్యేలు ప్రతి ఏడాది జూన్ 30 లోపు తాము, కుటుంబ సభ్యులకు చెందిన ఆస్తుల వివరాలను లోకాయుక్తకు సమర్పించాలని పేర్కొన్నారు.
భార్యకు నరకం..
ఎస్‌ఐపై కేసు
యశవంతపుర: తన బదిలీ కోసం డబ్బులు కట్టాలి, ఇందుకు పుట్టింటి నుంచి మరింత కట్నం తేవాలని వేధిస్తున్న ఎస్‌ఐపై బెంగళూరు చంద్రాలేఔట్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలు.. నిందితుడు కిశోర్ ధర్మస్థళలో ఎస్‌ఐ, అతడు భార్య వర్షపై కట్నం వేధింపులకు పాల్పడడంతో పాటు మాట వినలేదని కొట్టేవాడు. వర్ష ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. 2024లో మూడిగెరె ఎస్‌ఐగా పని చేస్తున్న సమయంలో కిశోర్‌తో వర్షకు పెళ్లయింది. కట్నం కింద రు.10 లక్షలు డబ్బులు, రూ.22 లక్షలు విలువగల కారు, 135 గ్రాముల బంగారం ఇచ్చి, లక్షల ఖర్చు చేసి వైభవంగా వివాహం చేశారు. కోరుకున్న చోటుకు బదిలీ కావాలంటే రూ.10 లక్షలు ఇవ్వాలని, ఈ డబ్బును తెచ్చివ్వాలని భార్యను పీడించసాగాడు. అత్తమామ, మరదలు కూడా వర్షపై దాడి చేశారు. వర్ష గాయాలతో ధర్మస్థళ ఆస్పత్రిలో చేరింది. మెరుగైన చికిత్స కోసం ఆమె తల్లిదండ్రులు బెంగళూరు ఆస్పత్రిలో చేర్పించారు. ఎస్‌ఐ మీద చంద్రాలేఔట్ పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు.
లంచగొండి డీఎస్పీ
ఆటకట్టు
శివమొగ్గ: పోలీసు సిబ్బంది నుంచే లంచం తీసుకుంటూ రిజర్వ్ బలగాల డీఎఆర్ విభాగం డీఎస్పీ లోకాయుక్తకు పట్టుబడ్డారు. శివమొగ్గ నగరంలో మంగళవారం ఈ ఘటన జరిగింది. సిబ్బంది ఏదో పని మీద డీఎస్పీ క్రిష్ణమూర్తిని కలిశారు. డబ్బులిస్తే పనవుతుందని ఆయన సూచించారు. దీంతో నివాసంలో ఆయనకు రూ. 5 వేలు ఇస్తుండగా, లోకాయుక్త అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. అరెస్టు చేసి విచారణ చేపట్టారు. లోకాయుక్త ఎస్పీ మంజునాథ్ చౌదరితో పాటు సిబ్బంది దాడిలో పాల్గొన్నారు.
బెంగళూరు టు కలబుర్గి ప్రత్యేక రైళ్లు
గుంతకల్లు: ఉగాది పండుగ ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఈ నెల 28, 29వ తేదీల్లో బెంగళూరు– కలబురిగి నగరాల మధ్య ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. 28న బెంగళూరు జంక్షన్ నుంచి రాత్రి 9.15 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.40 గంటలకు కలబురిగి జంక్షన్‌కు చేరుతుందన్నారు. తిరిగి ఈ రైలు 29వ తేదీ ఉదయం 9.35 గంటలకు కలబురిగి జంక్షన్ నుంచి బయలుదేరి అదే రోజు రాత్రి 8.00 గంటలకు బెంగళూరు జంక్షన్‌కు చేరుతుందన్నారు. యలహంక, ధర్మవరం, అనంతపురం, గుంతకల్లు, ఆదోని, మంత్రాలయం రోడ్డు, రాయచూరు, కృష్ణ, యాదగిరి, షాహాబాద్ రైల్వేస్టేషన్ల మీదుగా రాకపోకలు సాగిస్తాయని తెలిపారు.
క్షయ నివారణకు పెద్దలకు బీసీజీ టీకా
క్షయ నివారణకు పెద్దలకు బీసీజీ టీకా