
శివమొగ్గ: కేజీ బరువైన నకిలీ బంగారు నాణాలిచ్చి హాసన్‌లోని అమూల్ డైరీలో పని చేస్తున్న వ్యక్తికి రూ.7 లక్షల మేర టోకరా వేశారు. వివరాలు.. బాధితుడు గిరిగౌడ. సురేష్ అనే వ్యక్తి ఫోన్ చేసి తనది మలెమాదేశ్వర బెట్ట అని పరిచయం చేసుకున్నాడు. తమ ఊరిలో ఓ పేద వ్యక్తి పొలంలో పని చేస్తుండగా బంగారు నాణేల నిధి దొరికిందని, వారి కూతురి పెళ్లికి డబ్బు కావాలని, తక్కువ ధరకు అమ్ముతారు, కొనుక్కోండి అని కోరాడు. దీంతో గిరిగౌడలో ఆశ పుట్టింది. నాణేల పరిశీలనకు అంగీకరించాడు.
హొళెహొన్నూరు పోలీసు స్టేషన్ పరిధిలోని మంగోటె గ్రామ వంతెన వద్దకు పిలిపించి ఒక అసలు బంగారు నాణెం ఇచ్చి పరీక్షించుకోమని చెప్పాడు. ఊరికి వచ్చిన గిరిగౌడ ఆ నాణేనికి పరిశీలించి, అసలైనదని సంతోషించాడు. కేజీ నాణేలను కొంటాననడంతో రూ.7 లక్షలకు డీల్ కుదుర్చుకున్నారు. మళ్లీ మంగోటె వంతెన వద్దకు వెళ్లి డబ్బు ఇచ్చి నాణేలను తెచ్చుకున్నాడు. ఇంటికి తీసుకువచ్చి చూడగా నకిలీవని తేలడంతో లబోదిబోమంటూ హొళెహొన్నూరు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.