ఊపందుకున్న ఖాతా అభియాన్‌ | - | Sakshi
Sakshi News home page

ఊపందుకున్న ఖాతా అభియాన్‌

Published Thu, Mar 27 2025 12:43 AM | Last Updated on Thu, Mar 27 2025 12:41 AM

సాక్షి,బళ్లారి: గత కొన్ని నెలలుగా ఆర్‌ఎస్‌, టీఎస్‌, ఎన్‌ఏ ఇంటి స్థలాలకు సంబంధించిన యజమానులకు పూర్తిగా రిజిస్ట్రేషన్లు నిలిపివేయడంతో పాటు, వారి ఇంటి స్థలాలకు సంబంధించి ఫాం–2 సర్టిఫికెట్ల పంపిణీ కూడా ఆపివేయడంతో ఆయా ఇళ్ల స్థలాలు కలిగిన యజమానులు తీవ్ర ఇబ్బందులు, సమస్యల్లో కూరుకుపోయిన తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు జారీ చేసింది. ఏ ఖాతా, బీ ఖాతా చేయించుకుని వారి ఇంటి స్థలాలకు పూర్తిగా హక్కులతో పాటు రిజిస్ట్రేషన్లు చేయించుకునేందుకు, అమ్ముకునేందుకు అవకాశం కల్పించడంతో జనం ఏ ఖాతా, బీ ఖాతాలు చేయించుకునేందుకు ఎగబడుతున్నారు. నగరంలోని దాదాపు 35 వేలకు పైగా ఇళ్ల స్థలాలకు సంబంధించి ఏ ఖాతా, బీ ఖాతాలు చేసి ఇచ్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో ఏ ఖాతా, బీ ఖాతాలు చేసి ఇచ్చేందుకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. 20 రోజుల క్రితం ప్రభుత్వం నుంచి జారీ అయిన ఈ తాజా ఆదేశాలతో ఆయా కార్యాలయాల వద్ద రద్దీ నెలకొంది.

ప్రభుత్వ ఖజానాకు రూ.కోట్లాది ఆదాయం

అటు ప్రభుత్వానికి కూడా కోట్లాది రూపాయల ఆదాయం కూడా వస్తున్న నేపథ్యంలో అధికారులు సిటీకార్పొరేషన్‌ కార్యాలయం వద్ద ఆయా ఇంటి స్థలాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించి ఏ ఖాతా, బీ ఖాతాలు అందజేస్తున్నారు. ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినప్పటి నుంచి నగరంలోని మూడు జోన్లలో ఉన్న కార్పొరేషన్‌ కార్యాలయాల వద్ద నిత్యం జన సందడి కనిపిస్తోంది. నగరంలోని గాఽంధీనగర్‌ సిటీ కార్పొరేషన్‌ కార్యాలయం జోన్‌ –1 కేంద్రం, పాత సిటీ కార్పొరేషన్‌ కార్యాలయం జోన్‌–2, కౌల్‌బజార్‌ జోన్‌–3 కేంద్రంగా తమ తమ వార్డులకు సంబంధించిన ఆర్‌ఎస్‌, టీఎస్‌, ఎన్‌ఏ ఇళ్ల స్థలాలకు సంబంధించిన రికార్డులు అందజేసిన వారికి ఏ ఖాతా ఇంటి స్థలాలకు ఫాం–2, బీ ఖాతా ఇంటి స్థలాలకు ఫాం–2ఎ సర్టిఫికెట్లు (హక్కుపత్రాలు) అందజేస్తున్నారు. దీంతో ఆయా కార్యాలయాల వద్ద ఉదయం నుంచి సాయంత్రం వరకు తమ ఇంటి స్థలాలకు పన్నులు చెల్లించి, హక్కు పత్రాలు పొందేందుకు జనం ముందుకు వస్తున్నారు. ఈ హక్కుపత్రాలు పొందితే ఆయా ఇళ్ల స్థలాల యజమానులు బ్యాంకు రుణాలు పొందడంతో పాటు అమ్ముకునేందుకు, రిజిస్ట్రేషన్లు చేయించుకునేందుకు అవకాశం లభిస్తుండడంతో నగరంలో ఏ నలుగురు కలిసినా ఏ ఖాతా, బీ ఖాతా అభియాన్‌పైనే చర్చించుకుంటున్నారు.

స్థలాల క్రయవిక్రయాలకు వెసులుబాటు

ఆర్‌ఎస్‌, టీఎస్‌, ఎన్‌ఏ ఇంటి స్థలాల రిజిస్ట్రేషన్లు గత ఏడాది నుంచి నిలిపివేసిన తరుణంలో ప్రస్తుతం వినూత్నంగా అభియాన్‌ను ప్రారంభించడంతో ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం వస్తోంది. ఇంటి స్థలాల యజమానులకు కూడా వారి స్థలాలకు హక్కు పత్రాలు పొంది వారికి అవసరమైనప్పుడు అమ్ముకునేందుకు వెసులుబాటు లభిస్తోంది. దీంతో ఏ ఖాతా, బీ ఖాతాలు చేయించుకునేందుకు జనం ఎగబడుతున్నారు. ఈ సందర్భంగా గాంధీనగర్‌ జోన్‌కు సంబంధించిన జోనల్‌ అధికారి గురురాజు సాక్షితో మాట్లాడుతూ ఈ అభియాన్‌ ప్రారంభించినప్పటి నుంచి జనంలో మంచి స్పందన లభిస్తోందన్నారు. వారి ఇంటి స్థలాలకు సంబంధించి ఏ ఖాతా లేదా బీ ఖాతాలు చేయించుకుని పూర్తి హక్కులు పొందుతున్నారన్నారు. భవిష్యత్తులో బ్యాంకు రుణాలతో పాటు అవసరమైతే వారి స్థలాలను అమ్ముకునేందుకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తవన్నారు. ఇప్పటి వరకు తమ జోన్‌ పరిధిలో దాదాపు 1500 ఏ ఖాతా ఫాం–2, బీ ఖాతాకు సంబంధించి ఫాం–2ఏలను ఆయా యజమానులకు పంపిణీ చేశామన్నారు. మిగిలిన రెండు జోన్లలో కూడా దాదాపు ఇదే తరహాలో జోరుగా ఫాం–2, ఫాం–2ఏ సర్టిఫికెట్లు పంపిణీ చేసినట్లు అధికారులు వెల్లడించారు.

ఏ ఖాతా అంటే ఫాం–2, బీ ఖాతా అంటే ఫాం–2ఏ

మూడు జోన్లలో 35 వేలకు పైగా ఖాతాల పంపిణీకి చర్యలు

గాంధీనగర్‌, పాత కార్పొరేషన్‌, కౌల్‌బజార్‌ కార్యాలయాల్లో రద్దీ

ఊపందుకున్న ఖాతా అభియాన్‌1
1/2

ఊపందుకున్న ఖాతా అభియాన్‌

ఊపందుకున్న ఖాతా అభియాన్‌2
2/2

ఊపందుకున్న ఖాతా అభియాన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement