
పాలికె బడ్జెట్లో చెత్త పన్ను బాదుడు
బనశంకరి: బృహత్ బెంగళూరు మహానగర పాలికె చరిత్రలో తొలిసారి రూ.19,927 కోట్లతో భారీ బడ్జెట్‌ను ప్రకటించారు. శనివారం టౌన్‌హాల్ సభాంగణంలో పాలికె 2025–26వ బడ్జెట్‌ను బీబీఎంపీ పాలనాధికారి ఆర్.ఉమాశంకర్, కమిషనర్ తుషార్ గిరినాథ్, ఆర్థిక విభాగం ప్రత్యేక కమిషనర్ హరీశ్‌కుమార్ సమర్పించారు. ఎప్పుడూ లేనివిధంగా చెత్త పన్నును బాదడంతో నగరవాసులపై భారం పడనుంది. ఈ బడ్జెట్లో కొత్త పన్ను రాయితీలు ఏవీ ఇవ్వలేదు.
రోడ్ల వసతులు, వైట్ ట్యాపింగ్
● ఈ ఏడాది నుంచి అమల్లోకి వచ్చేలా ఆస్తి పన్నుతో కలిసి చెత్త సేకరణకు పన్ను విధించనున్నారు. ఒక్కో ఇల్లు, షాపులపై చెత్త పన్ను ఎంత మొత్తం అనేది ప్రకటించలేదు.
● బ్రాండ్ బెంగళూరుకు పెద్దపీట, చెత్త తరలింపులో సంస్కరణలు, ట్రాఫిక్ రద్దీ పరిష్కారానికి మౌలిక వసతులను పెంచుతామని పేర్కొన్నారు.
● సొరంగ మార్గాలు, ఎలివేటెడ్ కారిడార్, రాజకాలువల పక్కల్లో రోడ్ల నిర్మాణం, రహదారులకు వైట్‌టాపింగ్, స్కై–డెక్ నిర్మాణ పథకాలను చేపట్టాలని బడ్జెట్‌లో ప్రస్తావించారు.
● వీధులు, సందుల్లోని అర్టీరియల్, సబ్ అర్టీరియల్ రోడ్ల నిర్మాణంతో పాటు ఫుట్‌పాత్‌లను ఏర్పాటు చేస్తారు.
సిల్క్‌బోర్డులో ఆధునిక రహదారి
సెంట్రల్ సిల్క్‌బోర్డు, కృష్ణరాజపురం జంక్షన్, బైయప్పనహళ్లి మెట్రోస్టేషన్ వరకు ఐటీ కంపెనీలు ఎక్కువగా ఉన్నందున అక్కడ రాష్ట్ర ప్రభుత్వం మెట్రోతో కలిసి పాలికె రూ.400 కోట్లతో 22.7 కిలోమీటర్ల రోడ్డును ప్రపంచస్థాయిలో తీర్చిదిద్దుతారు. బ్రాండ్ బెంగళూరు ప్రత్యేక ఎస్క్రో అకౌంట్ తెరిచి మూడేళ్లలో రూ.2828 కోట్లతో సొరంగ మార్గం, ట్రాఫిక్, ఆరోగ్యం, ఆధునిక రీతిలో మౌలిక సౌకర్యాలను ప్రజలకు కల్పిస్తామని ప్రకటించారు. నగరం నలుదిక్కుల్లో చెత్త సంస్కరణ కేంద్రాలను నెలకొల్పుతారు. పలు దశల్లో తడి, పొడి చెత్తను తరలించడం, సంస్కరణ కేంద్రాల్లో ఎరువులుగా మార్చడానికి పలు ప్రణాళికలను రూపొందించారు. ఇకపై పౌర కార్మికులకు తలా రూ.10 లక్షలుగా, మొత్తం రూ.107.70 కోట్లను బ్యాంకులో డిపాజిట్‌చేసి దీని ద్వారా వచ్చే వడ్డీని పింఛన్‌గా అందిస్తారు.
రూ.19,927 కోట్ల బెంగళూరు పాలికె పద్దు
ఆస్తిపన్నుతో కలిపి చెత్తపన్ను వసూలు
మౌలిక వసతులకు నిధులు

పాలికె బడ్జెట్లో చెత్త పన్ను బాదుడు

పాలికె బడ్జెట్లో చెత్త పన్ను బాదుడు