
వరుణుడి విలయ తాండవం
సాక్షి,బళ్లారి/హొసపేటె : ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికందుతున్న సమయంలో అకాల వర్షాలతో పంటలు పూర్తిగా దెబ్బతినడంతో పాటు పిడుగు పాటుకు ముగ్గురు మృతి చెందటంతో ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. గురువారం సాయంత్రం నుంచి రాత్రి వరకు కురుసిన భారీ వర్షం కొప్పళ జిల్లాలో పలు గ్రామాల్లో బీభత్సం సృష్టించింది. భారీ ఎత్తున ఈదురుగాలులు, ఉరుములు, పిడుగులతో కూడిన వర్షం కురిసింది. దీంతో పిడుగుపాటుకు గురై కొప్పళ జిల్లాకు చెందిన మంజునాథ్(48), గోవిందప్ప మేగళమనె(62) అనే ఇద్దరు రైతులు మరణించారు. వర్షం కురుస్తున్న సమయంలో తోటలోని ఇంటికి తాళం వేయడానికి వెళ్లినప్పుడు పిడుగు పడి వీరిద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.
విజయనగర జిల్లాలో..
విజయనగర జిల్లా కూడ్లిగి తాలూకా బండె బసాపుర గ్రామానికి చెందిన పాండేనాయక్(16) అనే బాలుడు ఇంటి ముందు నిలబడిన సమయంలో పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. భారీ వర్షంతో ముగ్గురు పిడుగుపాటుకు గురై మృతి చెందడంతో పాటు పశువులు కూడా మృతి చెందాయి. కొప్పళ తాలూకా పరిధిలో పలు గ్రామాల్లో అరటి తోటలు, వరి చేలు నేలకొరగడంతో రైతులకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. పంట చేతికందే సమయంలో వరి చేలల్లో కుప్పలు, కుప్పలుగా రాశులు పడిపోయాయి. అరటి తోటలు నేలకొరిగిపోవడంతో రైతులకు లక్షలాది రూపాయల మేర నష్టం వాటిల్లింది. అకాల వర్షంతో బళ్లారి, విజయనగర, కొప్పళ జిల్లాల్లో పంటలు దెబ్బతిన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. అకాల వర్షంతో దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని, పిడుగుపాటుకు మృతి చెందిన కుటుంబాలను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
పిడుగు పాటుకు ముగ్గురు మృతి
పంట నష్టంతో రైతులు విలవిల

వరుణుడి విలయ తాండవం