
రేపు మెగా వైద్య పరీక్ష శిబిరం
రాయచూరు రూరల్: నగరంలో ఈనెల 13న ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు భారతీయ వైద్య సంఘం అధ్యక్షుడు శ్రీశైలేష్ అమర్‌ఖేడ్ వెల్లడించారు. శుక్రవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మహాత్మా గాంధీ క్రీడా మైదానంలో భారతీయ వైద్య సంఘం, ఒపెక్ ఆస్పత్రి, రాయచూరు వైద్య విజ్ఞాన సంస్థ(రిమ్స్) కళాశాల, పరిశోధన ఆస్పత్రి, నవోదయ ఆస్పత్రి, జిల్లా ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో చర్మం, చెవులు, ముక్కు, గొంతు, చిన్న పిల్లల వ్యాధులు, గుండెపోటు, రక్తపోటు, చక్కెర, నేత్ర, ఈసీజీ వంటి సేవలను ప్రజలకు ఉచితంగా శిబిరంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వైద్యులు దీపశ్రీ, రాఘవేంద్ర, శ్రీధర్ వైట్ల, నీలోఫర్, వీరనగౌడలున్నారు.
చోరీ కేసుల్లో ముగ్గురు అరెస్టు ●
● బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం
హొసపేటె: విజయనగర జిల్లా కూడ్లిగి పోలీసులు నాలుగు ఇళ్లలో జరిగిన చోరీ కేసులను ఛేదించి బంగారు ఆభరణాలను జప్తు చేసుకున్నారు. కూడ్లిగితో పాటు హగరిబొమ్మనహళ్లిలో నాలుగు ఇళ్లలో చోరీ కేసులను చేధించిన అక్కడి పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేసి, రూ.కోట్లాది విలువైన బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకుని వారి నుంచి రూ.22 లక్షలు వసూలు చేశారు. హగరిబొమ్మనహళ్లికి చెందిన ఎం.ఇంద్ర, మరియమ్మనహళ్లికి చెందిన జీ.సతీష్‌గౌడ్, యడ్రమ్మనహళ్లికి చెందిన సుభాష్‌లను అరెస్టు చేశారు. 215 గ్రాముల బంగారు ఆభరణాలు, 2 కిలోల వెండి ఆభరణాలు, రూ.2 లక్షలు, రూ.10 లక్షలు విలువైన కార్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయంపై కూడ్లిగి పట్టణ పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
గాయత్రి తపోభూమి
రజతోత్సవాలకు శ్రీకారం
హుబ్లీ: గాయత్రి మాతను కొలిచే ప్రధాన క్షేత్రాల్లో హుబ్లీలోని తడసద గాయత్రి తపోభూమి ప్రధానమైంది. ఈ శ్రీక్షేత్రం స్థాపించి రజతోత్సవాలకు చేరుకుంటున్న శుభవేళ శుక్రవారం వివిధ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. శ్రీచక్ర ప్రతిష్టాపన, శ్రీదక్షిణామూర్తి, నవగ్రహాల ప్రతిష్టాపన, ధర్మధ్వజ ప్రతిష్టాపన కార్యక్రమాలను శృంగేరి విధుశేఖర భారతి గురు తమ అమృత హస్తాలతో శ్రీకారం చుట్టడంతో శుక్రవారం నుంచి ఈ ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. సవదత్తి చిదంబరం క్షేత్రం ప్రసన్న దీక్షిత స్వామి ప్రత్యేకంగా ఈ సందర్భంగా ప్రవచనం చేశారు. సిందగి దత్తప్పయ్య స్వామి, యరగళ్ల సిద్దరాజ స్వామి, శృంగేరి మురగోడ, దివాకర శంకర, దీక్షితులు, ఆనందవన అగడి, గురుదత్త మూర్తి చక్రవర్తి తదితరులతో పాటు గాయత్రి తపోభూమి ట్రస్ట్ అధ్యక్షుడు వినాయక ఆకళవాడి, కార్వాడ పద్మ పుష్ప గురుకుల కులపతి శివమూర్తి జోయ్స్, శ్రీక్షేత్రం ఉపాధ్యక్షుడు అశోక హర్పనహళ్లి, పూర్ణచంద్ర గంటశాల, నీలకంఠ, అరవింద ముతగి తదితరులు ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు.
వేగ నిరోధకాలు
ఏర్పాటు చేయండి
బళ్లారిటౌన్: నగరంలోని ఆంధ్రాళ్ బైపాస్ నుంచి బోవిగేరి సర్కిల్ వరకు ఇటీవల లారీలు అతి వేగంగా సంచరిస్తున్నాయని, ఈ రోడ్డులో స్పీడ్‌బ్రేకర్లు వేయాలని జిల్లా జనజాగృతి సంఘం అధ్యక్షుడు హుండేకర్ రాజేష్ డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లాధికారి కార్యాలయానికి స్థానికులతో పాటు తరలి వచ్చి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ ప్రాంతంలో నూతనంగా రోడ్డు నిర్మించినందున వాహనాలు వేగంగా సంచరిస్తున్నాయని, దీంతో ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. అంతేగాక 13వ వార్డు పరిధిలో గంగప్ప జిన్ నుంచి బోవిగేరి వరకు పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ఆలయాలు ఉన్నందున చాలా రద్దీ ఉంటుందని తెలిపారు. దీంతో అక్కడక్కడ స్పీడ్ బ్రేకర్లు వేస్తే వాహనాల వేగానికి కళ్లెం వేసినట్లు అవుతుందన్నారు. సంఘం పదాధికారులు స్వామి నాయక్, గాదిలింగ, దుర్గప్ప, నాగరాజ్, మిథున్ కుమార్, కాశిం, అనిల్‌రెడ్డి, దస్తగిరి, అన్వర్, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.

రేపు మెగా వైద్య పరీక్ష శిబిరం

రేపు మెగా వైద్య పరీక్ష శిబిరం