
రేపు వృద్ధి మహిళా దినోత్సవం
హుబ్లీ: కర్ణాటక ఛాంబర్ ఆఫ్ కామర్స్ మహిళా పారిశ్రామికవేత్తల కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం వృద్ధి 2025 మహిళా దినోత్సవం, మహిళ సాధకులకు సన్మాన కార్యక్రమాన్ని ఇక్కడి జేసీ నగర్‌లోని కేసీసీఐ సభాభవనంలో ఏర్పాటు చేసినట్లు ఆ సంస్థ మహిళా శాఖ చైర్‌పర్సన్ నిషా మెహత తెలిపారు. ఆమె స్థానిక మీడియాతో మాట్లాడారు. సృజనశీలత నినాదంతో తర్వాత తరాల మహిళా పారిశ్రామికవేత్తలను, నాయకురాళ్లను ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జెస్కాం ఎండీ ఎంఎల్ వైశాలి, వాయువ్య కర్ణాటక ఆర్‌టీసీ ఎండీ ఎం.ప్రియాంకతో పాటు మహిళా సాధకురాలు బోయింగ్ 777 పైలట్ కెప్టెన్ జోయ్ అగర్వాల్, మిస్ ఇండియా 2013, కళాకారిణి సిమ్రాన్ అహుజ పాల్గొంటారన్నారు. వివిధ రంగాలలో సేవలు అందించిన సాధకురాలైన గిరిజక్క ధర్మారెడ్డి, జ్యోతి హిరేమఠ, డాక్టర్ కేఆర్ రాజేశ్వరిలను సన్మానిస్తామన్నారు. ప్రముఖులు ఎస్పీ సంశిమఠ, సందీప్, మహేంద్ర సింగి, పల్లకి మాలవి తదితరులు పాల్గొన్నారు.
బస్సులో మహిళ ఆభరణాల చోరీ
హుబ్లీ: ఓ మహిళ బస్సులో ప్రయాణం చేస్తుండగా రూ.లక్షలాది విలువ చేసే బంగారు ఆభరణాలను ఎవరో చోరీ చేసినట్లు విద్యా నగర పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. హుబ్లీ నుంచి శంసికి వెళ్లడానికి హోసూరు బస్టాండ్ నుంచి ఆ మహిళ బస్సు ఎక్కింది. దీంతో ఆమె వద్ద ఉన్న మంగళసూత్రం, ఇతర ఆభరణాలు చోరికి గురయ్యాయి.
అక్రమ రీఫిల్లింగ్.. సిలిండర్లు స్వాధీనం
మరో ఘటనలో ధార్వాడ తాలూకా జోగెళ్లపురలో అక్రమంగా వంట గ్యాస్ సిలిండర్లను రీఫిల్లింగ్ చేస్తున్న గోడౌన్‌పై తహసీల్దార్, అధికారులు దాడి చేసి అక్రమంగా నిల్వ ఉంచిన 180 నిండు సిలిండర్లు, 461 ఖాళీ సిలిండర్లు, రెండు నాజిల్స్, రెండు రీఫిల్లింగ్ యంత్రాలతో పాటు ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై ధార్వాడ తహసీల్దార్ దొడ్డప్ప పూజార కేసు నమోదు చేస్తానని తెలిపారు.
ఏబీసీడీ వర్గీకరణ చేయాలి
రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం మాదిగలకు ఏబీసీడీ వర్గీకరణ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసి 9 నెలలు గడిచినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని, సాంఘీక న్యాయం కల్పించాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర సంచాలకుడు రవీంద్ర నాథ్ పట్టి డిమాండ్ చేశారు. బుధవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. 30 ఏళ్ల నుంచి మాదిగలకు ఏబీసీడీ వర్గీకరణ చేయాలంటూ మాదిగ సముదాయాల సమీక్షకు సహకరించాలన్నారు. 45 రోజుల పాటు ఇంటింటికీ అధికారులు సర్వేకు వచ్చినప్పుడు కులం జాబితాలో తప్పని సరిగా కులం పేరును రాయించాలన్నారు.